Saturday 15 September 2018

గ్రామము


గ్రామము
మ.
అనురాగంబున కాస్పదంబు భువిలో నత్యంత హృద్యంబు జీ
వనకాలంబున నద్భుతంబయిన ఠేవన్ బంచు నిత్యంబు స
జ్జన సాంగత్యము గూర్చుచుండి సతమున్ సత్వోన్నతిన్ నిల్పు బో
రన మాలిన్యము ద్రుంచు భావములలో గ్రామంబు యోచించగన్.                              1.
ఉ.
అక్కున జేర్చు తల్లివలె నందగజేయును సద్యశంబిలన్
మిక్కిలి ప్రేమ జూపుచును మేలగు మార్గము నెంచ నేర్పు తి
ర్యక్కులకైన గాని కడు హర్షము గూర్చును వత్సలత్వమున్
చక్కగ జూపుచుండు పరుషం బొకయింతయు లేక పల్లె తాన్.                                   2.
మ.
ఇసుమంతైనను కల్మషంబు మదిలో నేవేళనుం దాల్ప దా
వసుసంఘంబును బిడ్డ లందరకునై భవ్యంబుగా బంచు తా
మసభావంబును బారద్రోలుచును సన్మార్గంబు జూపించి నల్
దెసలన్ హర్షము జిమ్ము గ్రామము భువిన్ దేదీప్యమానంబుగన్.                                  3.
శా.
కాలుష్యంబుల కంటకుండ శుచియై కారుణ్యసంపూర్ణయై
మేలైనట్టి విధాన సర్వజనులన్ మిథ్యాపథగ్రస్తులై
లీలం దేలకయుంట దెల్పి సుఖలాలిత్యంబు జూపించుచున్
లాలించున్ సతతంబు గ్రామము మదిన్ లక్ష్యంబులన్ నాటుచున్.                               4.
చం.
రణగొణశబ్దతాడనదురంత మహాపద కంటకుండు త
త్ఫణితినినేర్పి నిత్యమును భవ్య నిరామయ జీవనంబు స
ద్గుణమణులౌ ప్రజాళికిల గూర్చుచు సభ్యసమాజమందు స
ద్గణుతిని బొందగల్గిన విధంబును నేర్పును గ్రామమెప్పుడున్.                                    5.
చం.
నగరనివాసులై యనుదినంబును తీరిక లేక మానసం
బగణిత వేదనాభరితమై వెత లందుచు నుండ వారినిన్
తగువిధి బిల్చి బాంధవసుధారసధారల బంచి ప్రేమతో
ద్విగుణిత శక్తివైభవము తేజము జూపును గ్రామ మెల్లెడన్.                                         6.
 చం.
అతుల ముదాకరంబగుచు హాయిని బంచెడి స్థానమిద్ది, యీ
క్షితిపయి  సర్వమానవుల క్షేమము గోరెడి చోటు, నిత్య మా
గతులకు ప్రేమబంచగల కందువ, మానవ మానవత్వమున్
సతతము లోకమందునను  జాటు నివేశము, గ్రామ మెంచినన్.                             7.
చం.
నిజమగు బంధుభావములు నిక్కపుత్రోవ జరించు పద్దతుల్,
రుజలకు జిక్కి సంతతము రోజక నుండగలట్టి మార్గముల్,
త్రిజగములందు సన్నుతి, వరిష్ఠత లందుటకైన త్రోవలున్,
ప్రజలకు మానవత్వశుభ భావన నేర్పును  గ్రామమెల్లెడన్.                                         8.
శా.
గ్రామౌన్నత్యము నెంచి సర్వగతులన్ కానైన సాహాయ్యమున్
స్వామిత్వంబున సంచరించు ప్రభుతల్ సౌజన్యతాయుక్తితో
నీమంబుం గొని చేయగా వలె నికన్ నిత్యంబు తద్భావనా
సీమన్ గౌరవమొప్పచేకొనవలెన్ క్షేమంబులం గాంచగన్.                                           9.
ఉ.
గ్రామము లేనియట్టిదగు కాలము నందు బ్రపంచ మంతటన్
క్షేమము మృగ్యమౌ ననుట సిద్ధము గావున జీవనార్థులై
ధీమతులౌచు మానవులు తేజము గూర్చెడి పల్లెసీమలన్
నీమముతోడ గావవలె నిర్మలమానసమంది నిచ్చలున్.                                         10.

హ.వేం.స.నా.మూర్తి.
15.౦౯.౨౦౧౮.

No comments:

Post a Comment