Thursday 13 April 2017

శ్రీ వేంకటేశ్వర

శ్రీ వేంకటేశ్వర
చంద్రకళ వృత్తము
గణములు -- ర,స,స,త,జ,జ,గ 
యతి -- 1,11

ఏడుకొండల పైనను దేవా! యింపుగ నుంటివి శ్రీపతీ!

వేడుకొందుము నిన్నిదె రావా వేదన ద్రుంచగ శీఘ్రమున్

చూడవేలనొ కావగలేవా శోక మణంచుచు భక్తులన్

గోడు పెట్టుట చూడగ బోవా కూర్మిని కొంచెము పంచవా

నీడ నీయగ వేడెద నయ్యా నిన్నెపు డాదర మొప్పగన్

రాడు గావడు రాడను మాటన్ రక్షకు డౌచును ద్రుంచవా

కూడుగుడ్డలు చూప వటయ్యా కుందుచుండెడి వారికిన్

మోడువారిన జీవన మందున్ మోదము నింపుచు బ్రోవవా

ఏడ జూచిన సంఘము నందున్ హేయముగా నవినీతియే

చీడ బట్టిన ధారుణి కీవే క్షేమము గూర్చగ నొప్పగున్

పాడుకొందుము నీ మహిమంబున్ పాపము గూల్చుము హే ప్రభో!

వాడు వీడను భేదము లేలా పౌరుల కెల్లెడ ధారుణిన్

కీడు చేసెడి భావన లేలా కేవల మన్నిట స్వార్థమే

నేడు చూడగ లోకుల లోనన్ నిత్యము నిండిన దక్కటా

పాడుబడ్డ మనంబుల లోనన్ పావనతన్ మరి నింపగా

లేడు శ్రీకర! వేంకట నాథా! లేడిల నీసము డెవ్వడున్

ఏడు కొండల నెక్కెద మయ్యా ఈశ్వర! రక్షణ చేయుమా

వాడిపోయిన భావము లెల్లన్ వైభవ మందగ నిల్పుమా

బీడు వారిన ధారుణి లోనన్ విస్తృత సత్ఫల మిచ్చుచున్

వీడి పొమ్మన కుండగ మమ్మున్ వేడెద చల్లగ చూడగన్.

No comments:

Post a Comment