Wednesday 12 April 2017

బాదుషా

బాదుషా
 ఆటవెలదులు

మధుర మౌచు సతము మానసం బలరించు
చుండి యంద మొలుకు చుండు రూప
మంది యుండునట్టి యత్యున్నతంబైన
బాదుషాకు జయము పలుక వలయు.              ౧.

ఒంపు లంది యుండి యొయ్యారి కత్తెయై
తనను జూచు వారి మనము దోచి
చెంత జేరి మిగుల సంతసంబును గూర్చు
బాదుషాకు జయము పలుక వలయు.              ౨.

పెండ్లిలోన నైన పేరంట మందైన
సర్వజగతిలోన బర్వియుండి
పిండివంట లందు పెద్దయై చరియించు
బాదుషాకు జయము పలుక వలయు.              ౩.

రమ్యమైన దిలను రాణి యన్నింటను
మధురభక్ష్యరాశి మధ్య జేరి
మనుజకోటి నెల్ల తనదాసులను జేయు
బాదుషాకు జయము పలుక వలయు.              ౪.

నాటినుండి భువిని నేటి కాలముదాక
పోటి పడగ దలచు భోజ్యవస్తు
జాలమందు జూడ సర్వోన్నతంబైన
బాదుషాకు జయము పలుక వలయు.              ౫.

ఎట్టు లైన పొంది లొట్టలు వేయుచు
పిన్నవార లైన పెద్ద లైన
భాగ్య మొదవె నంచు భక్షింపగా జూచు
బాదుషాకు జయము పలుక వలయు.              ౬.

దేహదీప్తి చేత మోహంబు పుట్టించి
రుచిని మించి మిగుల శుచిని జూపి
కవుల హృదుల జేరి కవితలు పలికించు
బాదుషాకు జయము పలుక వలయు.              ౭.

పెరుగు నేతు లందు సురుచిరంబైనట్టి
మైదపిండి యటులె మోదమొసగు
పంచదార గూడ  నంచితంబుగ నుండు
బాదుషాకు జయము పలుక వలయు.              ౮.

తనను తినెడి వారి కనుగుణంబైనట్టి
మార్దవంబు తోడ మమత జూపి
విమల మతిని బ్రజకు బ్రియతరంబైవెల్గు
బాదుషాకు జయము పలుకవలయు.               ౯.


సందియంబు లేదు స్వాదు భక్ష్యంబుగా
యశము నందు చున్న దవనిలోన
సాటి లేని రీతి మేటియై తలపించు
బాదుషాకు జయము పలుక వలయు.              ౧౦.


హ.వేం.స.నా.మూర్తి.


No comments:

Post a Comment