Saturday 15 February 2014

మంథర-కైకేయి

శ్రీరామున కారాజ్యపు
భారంబును కట్టబెట్టు భాగ్యమునందున్
ధీరుడు దశరథభూపతి
తోరపు హర్షాతిశయముతో నున్నపుడున్ 1.


చెనటి మంథర కైకను చేరి యిట్లు
పలుకసాగెను క్రోధాన పడతి నీవు
లెమ్ము నిద్రింపగానేల యిమ్మహినిక
కష్టకాలము మున్ముందు కాంచ గలవు. 2.


నాప్రాణనాథుండు నాదైవ మాతండు
..........ప్రేమానురాగాల ధామ మతడు,
సవతులందరిలోన సన్మానమందించి
..........గౌరవించును నన్ను ఘనముగాను,
నామాట జవదాట కామోదమును దెల్పి
..........యేమి కోరినగాని యిచ్చుచుండు,
నేనె సర్వస్వంబు నిక్కమియ్యదియంచు
..........సంతసించెదవేల సన్నుతాంగి!
మూర్ఖురాలవు బేలవై మోదమంద
దగునె? యాతడు నాథుండె? పగతునివిధి
నిన్ను వంచించు చున్నాడు నిజము కనుము
భర్త రూపాన నున్నట్టి వైరి యతడు. 3.


యువరాజపీఠాన నవనీశుడక్కటా!
..........రామచంద్రుని నిల్ప రయముతోడ
ఆదేశములు చేసె నభిషేక కార్యంబు
..........జరుగనున్నది రేపు తరుణి! వినుము
మాయమాటలు చెప్పి మమకారమును జూపు
..........కైకేయి! యాతండు కపటి నిజము
రమణి! భావిని నీకు రాబోవు కష్టముల్
..........తలచి యోర్వగలేని దాన నగుట
హితము కోరుచుండి సతతసౌఖ్యము గూర్చు
తలపుతోడ నేను పలుకుచుంటి
రామచంద్రమూర్తి రాజ్యాభిషేకంబు
జరుగనీయ రాదు సర్వగతుల. 4.


అనుచు మంథర వచియించ నమితముగను
హర్షమందుచు విలువైన హార మొకటి
అందుకొనుమంచు కైకేయి యామె కొసగి
మంచివార్తను తెలిపినావంచు బలికె. 5.


రామచంద్రునికన్న రమణీయగుణుడెవ్వ
..........డతడు పుత్రుడునేను నంబగాదె?
భరతుడెట్టులొ నాకు పావనచరితుడౌ
..........రాముడట్టులె భేదమేమి లేదు,
పరమాత్మతుల్యుడై సరసుడై వెలుగొందు
..........శ్రీరామచంద్రుని సేవలోన
తరియించు భాగ్యంబు భరతుని కబ్బిన
..........ధన్యుడై వెలుగు నా తనయు డవని
నింతకంటెను వేరొక్క టిహమునందు
సౌఖ్యదాయక మగునేమి? సర్వగతుల
రామ పట్టాభిషేకంబు భూమిజనుల
కన్నివేళల శుభకర మనెను కైక. 6.


అని పలికిన కైకేయిం
గని మంథర మూర్ఖురాల! ఘనతాపమునన్
మునుగం దగు సమయంబున
ననుపమమగు రీతి హర్ష మందెదవేలా? 7
.

రాజ్యాధిపతి యౌచు రామంచంద్రుండుండ
..........బంటౌను సర్వదా భరతు డికను
కౌసల్య మాతయై గౌరవంబును పొందు
..........దాసివౌదువు నీవు తథ్యమిద్ది
వర్ణింప దరమౌనె వసుధలో దాస్యాన
..........కలుగబోయెడి తీవ్ర కష్టతతులు?
నీపట్టి రాజైన నిత్యసౌఖ్యము గాంచి
..........హాయినందగవచ్చు ననవరతము
అనుచు మంథర దుష్టయై యామె హృదిని
విషము నింపంగ కైకేయి విస్తృతమగు
క్రోధమును బూని రయమున కోపగృహము
చేరె భర్తను సాధించు కారణమున. 8.

No comments:

Post a Comment