Saturday 15 February 2014

సినీ ప్రముఖులు

రావుత్రయమును(రావులు మువ్వురు) గాంచుడు
ధీవైభవనిధులు భువిని స్థిరయశులగుచున్
జీవనము కళల కర్పణ
గావించిన వారు వీరు ఘనులన్నింటన్. 1.


వరుస నందమూరివంశాబ్ధి చంద్రుండు
యావదాంధ్రభూమి ననుపమమగు
ఖ్యాతి నంది తెలుగుజాతికి జగతిలో
ఘనత గూర్చిపెట్టు కర్మఠుండు. 2.


తారకరామారావను
పేరున నటుడౌచు వెలిగి విపులాదరమున్
గౌరవము గాంచి నాయక
ధీరుండై యవనిఁ దెలుగు తేజము చాటెన్. 3.


రాముడై కృష్ణుడై రణరంగభీముడై
..........సోముడై సన్మునిస్వామి యౌచు,
పౌరుడై వ్యవసాయదారుడై వీరుడై
..........శూరుడై సంగీతకారుడౌచు,
నేతయై భువనాల జేతయై మిత్రుడై
..........త్రాతయై విశ్వవిఖ్యాతుడౌచు,
పేదయై దాతయై విజ్ఞసత్తముడౌచు
..........మోదకారకుడై వినోది యౌచు
ఒక్కటననేల పాత్రలు పెక్కులిట్లు
చిత్రములయందు పోషించి సిరులు గాంచి
ఆంధ్రదేశాన "నటరత్న"మౌచు యశము
లంది యున్నట్టి యాంధ్రుండు నందమూరి. 4.


పౌరాణికములైన చారిత్రకములైన
..........సామాజికములైన సత్యమిద్ది
పాత్రలెట్టివియైన వాటిలో లీనుడై
..........ప్రియముగూర్చెను సదా ప్రేక్షకులకు
వచనమాధురితోడ రుచిరాభినయముతో
..........దేహసౌందర్యంపు దీప్తితోడ
నటనలో మేటియై నవ్యమార్గములంది
..........హర్షమందించువా డక్కినేని
అతడు నాగేశ్వరుండు తానభినయమున
ఘనుడు, "సమ్రాట్టు"గా కీర్తి గాంచినట్టి
నటశిఖామణి సత్కళానైష్ఠికుండు
మాన్యుడౌచును బ్రతికిన ధన్యజీవి. 5.


మధుబిందునిభములై మానసంబులు దోచు
..........నెవ్వాని వచనంబు లెల్లవేళ,
అమృతోపమానమై హాయిగొల్పుచునుండు
..........నెవ్వాని గాన మీ యిలను జూడ,
నిత్యప్రసన్నమై నిర్మలంబై వెల్గు
..........నెవ్వాని ముఖసీమ యింపుమీర,
సన్నుతి కర్హముల్, సద్భావపూర్ణంబు
..........లెవ్వాని కృత్యంబు లెల్లగతుల
అతడు మహనీయచరితుడై యవనిలోన
ననుపమంబైన యశముల నందియున్న
సద్గుణాఢ్యుడు సంగీతచక్రవర్తి
ఘనుడు సుందరహృదయుడు ఘంటసాల. 6.

నోరు తెరచిన సంగీతసౌరభంబు,
పలుకులందున మధువులు చిలుకునట్టి
మధురగాయకు డన్నింట మహితగుణుడు
వేంకటేశ్వరరాయు డా విజ్ఞవరుడు. 7.


నందమూరిని సంతతానందయుతుని,
అక్కినేనిని నాగేశ్వరాఖ్య ఘనుని,
ఘంటసాలను నిత్యమింటింట జనులు
స్మరణ చేయుట సర్వథా సముచితంబు. 8.

No comments:

Post a Comment