Thursday 23 January 2014

శంకరాభరణ ప్రశంస

శంకరాభరణ ప్రశంస
ఏరోజునంగాని యిసుమంత యలసత్వ
..........మందక యిద్దియే విందటంచు,
ఆరోగ్యసహకార మందకున్ననుగాని
..........కవుల కానందంబు కల్గజేయు
బహుసమస్యలనిచ్చి ప్రతిదినంబును కావ్య
..........రచనంబు చేయించి రమ్యముగను

శంకరాభరణాఖ్య సత్కళావేదికన్
..........నిర్వహించుచునుండి నేర్పుమీర

అస్మదాదులైన యల్పజ్ఞజనులకు
జ్ఞానభిక్ష పెట్టి మాన మొసగు
కందిశంకరార్య! కవివర్య!గుణధుర్య!
వందనంబు లిప్పు డందుకొనుడు.


వివిధమార్గాలలో విస్తృతంబగురీతి
..........పద్యాలు రచియించు పద్ధతులను
ఛందస్స్వరూపంబు నందమొప్పగ నేర్పి
..........దొసగులు సవరించి యసదృశమగు
మార్గదర్శన చేసి మామానసంబుల
..........నుత్సాహమును నింపుచుండి సతము
శంకరాభరణాన సత్కావ్యరచనంబు
..........చేయించుచుండెడి ధీయుతుండు

కవివరేణ్యు డౌచు ఘనయశంబులనంది
క్రమత నెన్నియేని గ్రంథములను
వెలువరించినట్టి విద్వజ్జనాగ్రణిన్
పండితార్యఘనుని ప్రస్తుతింతు.


ఏసమస్యకునైన నింపారు కవితలన్
..........దారి చూపుచునుండు వారలకును,
వర్ణనాంశములంది బహుసమర్ధతతోడ
..........పద్యాలు రచియించు వారలకును,
శంకరాభరణాన సర్వకాలములందు
..........వ్యాఖ్యానములు చేయు వారలకును,
మేటివాక్యాలతో మిత్రులకుత్సాహ
..........వర్ధనం బొనరించు వారలకును,

సాధుహృదయు లౌచు సద్భావపూర్ణులౌ
బంధుతుల్యులైన పాఠకులకు,
అస్మదీయులైన ఆత్మీయజనులకు
వందనంబు లార్యు లందరకును.


శంకరాభరణాన సత్కావ్యరచనంబు
..........సాగుచుండెడుగాత! సంతతంబు,
ఈకళాస్థలియందు నింపుగా నెప్పుడు
..........వేవేల పూరణల్ వెలయుగాత,
సాహిత్యనిలయమై సన్మానములనందు
..........నీదివ్య ధామంబు నెల్లగతుల
విద్వద్వరేణ్యులౌ విజ్ఞుల యాశీస్సు
..........లందుచుండెడుగాత యనవరతము

సంతసంబు గూర్చి సాహితీప్రియులకు
మిత్రతుల్యమౌచు మేదినిపయి
సద్యశంబుగూడి శంకరాభరణంబు
చిరము వెలుగుగాత స్థిరతనంది.

No comments:

Post a Comment