ప్రాప్తమగుగాత
యిపుడు పరాభవమ్ము.
(తేటగీతులు)
శ్రీకరంబైన ధర్మమున్ జెనటు లగుచు
చెరుప యత్నంబు చేయుచు ధరణిలోన
వెరపు లేకుండ జరియించు నరగణమున
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 1.
కులమతంబులపేరుతో నలఘుపీడ
సంఘమున నింపి వైరముల్ సర్వగతుల
సతము సృష్టించుచుండెడి జనుల కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 2.
తోటివారలవృద్ధికి తోరమైన
ఈర్ష్య చేయుచు నవ్వారి నెల్లగతుల
నాశ మొనరించ యత్నించు నరుల కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 3.
తల్లిదండ్రులు ప్రత్యక్షదైవము లయి
జన్మ నొసగుట దలపక సన్మతి గొని
వారలకు సేవ చేయనివారి కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 4.
ధర్మమార్గానుయాయులై ధరణియందు
సంచరించెడి సజ్జనసంఘమునకు
బాధ కలిగించుచుండెడివారలకును
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 5.
సత మసత్యమ్ము పల్కుటే సవ్యమైన
పనిగ నెంచుచు నన్నింట ననుచితముగ
వ్యవహరించుచునుండెడివారి కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 6.
జిహ్వ నొకకొంత కట్టడి చేయకుండ
నిచ్చవచ్చిన రీతిగ నెన్నియేని
కారుకూతలు కూసెడివారి కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 7.
చిన్న నాబొజ్జ నిండుచునున్న చాలు
ఎవరి కేమైన నగును నాకేమి గాక
యనుచు భావించుచుండెడి జనున కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 8.
తాను సన్న్యాసి నని చెప్పి మానబోక
సర్వసుఖములు భోగియై సంతసమున
ననుభవించుచునుండెడి జనున కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 9.
ఉదరమును నింపుకొనుటకై ముదముతోడ
జీవహింసను సతతంబు చేయుచుండు
కఠినచిత్తుల కిలలోన ఘనతరముగ
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 10.
ఉర్వి నాకంటె విజ్ఞాని యొకడు లేడు
నేనె సర్వజ్ఞజనుడను జ్ఞానధనుడ
నని యహంకరించెడివాని కనుపమముగ
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 11.
పాపమను భీతి యొకకొంత చూపకుండ
పలు కుకర్మలు చేయుటే పనియటంచు
వానిలో మున్గి ముదమెంచువారలకును
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 12.
సవ్యమార్గంబునందుండి సన్మతులయి
పరహితంబును గోరెడి వారి నెపుడు
దుష్టభావాన బాధించు తులువలకును
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 13.
కలహములతోడ నిరత మీ యిలను కష్ట
గర్తమందున బడద్రోయు ధూర్తమతుల
సంతసము గూలి యహమిక శకలమౌచు
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 14.
ప్రకృతిచేతను హాయిగ బ్రతుకుచుండి
కలుషజాలమ్ముతో దాని కమ్రతలను
భగపరచుట పనియైన వారలకును
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 15.
వేతనములంది పుష్టిగ వెలుగుచుండి
బాధ్యతలు వీడి చరియించు స్వార్థమతుల
భావజాలమ్ము నశియించి చేవ యణగి
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 16.
స్వీయసంస్కృతిలోనుండు శ్రేష్ఠగతుల
నెరుగకుండను బూర్వికు లెట్లు మనిరొ
తెలియబోనట్టి యురుగర్వితులకు నిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 17.
దేవు డిచ్చిన సంపద పావనముగ
దీనజనులకు కొంతైన తివిరి పంచ
కుండ ధనమదయుతులౌచు నుండ నిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 18.
కట్టు కథలల్లి సంఘాన ఘనతరమగు
భీతి కల్పించి బొంకులే నీతులట్లు
పూని వచియించు ధూర్తుడౌ వాని కిలను '
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 19.
వస్త్రధారణ జనునకు వలయు గౌర
వంబు సమకూర్చు ననియెడి పండితోక్తి
వినక స్వేచ్ఛతో జరియించు జనుల కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 20.
ఆశలకు లొంగి అవినీతు లగుచు సతము
ధనము నార్జించుటే లక్ష్య మనెడి భావ
మంది యుండిన కుమతుల కెందునున్న
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 21.
దానకార్యంబులందున దైవములను
గొల్వబూనుట యందున కువలయమున
ననుపమంబుగ నటియించు జనున కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 22.
మెత్తమెత్తగ మాట్లాడి చిత్తసీమ
లలర జేయుచు నమ్మించి యాత్మలోన
ద్వేషభావంబు దాల్చెడి వేళలందు
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 23.
వాక్కు లందున స్వేచ్ఛకు హక్కు కలదు
నాకటంచును గర్వంబు దాక మదిని
సభ్యతను వీడి పలికెడి జనున కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 24.
సన్నుతాచారులైనట్టి సాధుజనుల
యశములకు హాని గూర్చ ననిశము బూని
యత్నములు చేయు కుజనాళి కన్నిగతుల
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 25.
ఆశలకులొంగి నిజముపై ధ్యాసలేక
యిచ్చవచ్చిన రీతి దా నిలను సతము
రెచ్చిపోయెడి వానికి నిచ్చ లిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 26.
ధనము
గడియించు టొక్కటే తనదు లక్ష్య
మనుచు భావించి వ్యాపారమందు గోరి
కల్తి చేయుచు బ్రతికెడి కఠినమతికి
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 27.
తనను గెలిపించి నిలిచిన జనులయందు
కరుణ జూపక యవ్వారి నురుతరమగు
కష్టమునద్రోయు నాయక ఘనునకిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 28.
హితము గోరెడి మిత్రుల యెదలలోని
భావ మెంచక వారలపట్ల కోరి
వంచనను జేయుచుండెడి వారలకును
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 29.
కష్టపడకుండ ధనమును కరము పొంద
వసుధ నన్యాయపథముల వర్తనమ్ము
సలుపుచుండెడి వారల కలఘుగతిని
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 30.
సంఘహితమును గోరుచు సజ్జనాళి
అలఘుహర్షాన కార్యముల్ సలుపువేళ
మెచ్చలేనట్టి జనున కీ మేదినిపయి
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 31.
స్వర్గమునకన్న మిన్న యీ జన్మభూమి
జనని యందురు పెద్దలు, స్వాంతశుద్ధి
వాని గీర్తింపలేనట్టి వాని కిలను
ప్రాప్తమగుగాత యిపుడు పరాభవమ్ము. 32.
No comments:
Post a Comment