ఉగాది
సీ.
వేపపూతకు జేర్చి వినుతతింత్రిణి కొంత
గుడమిశ్రితంబుగా
గూర్చి పిదప
చూతంపుఫలఖండజాతి నందున నుంచి
షడ్రసోపేతమ్ము, స్వాదుతరము
గా ప్రసాదము చేసి కాలకంఠాదుల
గొల్చిన పిమ్మట
కోరికోరి
యామిశ్రణము చేతనంది సద్భక్తితో
స్వీకరించుచు
నరుల్ శ్రీప్రదమని
తే.గీ.
తెలుగు సంవత్సరాదిని దీప్తు లొలుక
పర్వరాజుల నాదిగా బహుళముదము
కలుగ నాబాలవృద్ధమ్ము ఘనతరముగ
జరుపుకొందురు సుఖముల నరయగోరి. 1.
సీ.
ద్వారబంధాలలో తోరణంబులు గట్టి
మామిడాకులతోడ
మంగళముగ
ముంగిళ్ళలో మంచి రంగవల్లులు దిద్ది
సదమలభావంబు
నెదల నింపి
వరనూత్న వస్త్రాలు ధరియించి ముదముతో
దేవతార్చన
చేసి పావనముగ
తిథివారనక్షత్ర దీప్తయోగంబులు
కరణముతో
జేర్చి క్రమముగాను
తే.గీ.
సంతసంబున పంచాంగ శ్రవణములను
చేసి, మధురసత్కవితలు వ్రాసి చదివి
క్రొత్తవత్సర మిలపైకి కోరివచ్చు
సమయమందున గూర్తురు స్వాగతమ్ము. 2.
తే.గీ.
భవ్య "విశ్వావసూ "నామవత్సరమ్ము
తప్పుకొన నేడు నేతెంచె ధరణి కిదియె
వర "పరాభవ " మనుపేర వర్షరాజ
మందజేసెద స్వాగత మందమొప్ప.
3.
కం.
స్వాగతము "పరాభవ!" యో
రాగాత్మ! పరాభవమ్ము రాదగనిగతిన్
నీగమనము ధాత్రీస్థలి
సాగవలెన్ ప్రజలు మిగుల సంతస మరయన్. 4.
ఆ.వె.
ధరణిలోన నీవు సురుచిరగమనవై
సుఖము లెల్లగతుల జూపవలయు
నన్నిదిశలలోన హర్షదీప్తులు నింపి
విను "పరాభవాబ్ద!" విమలమతిని. 5.
హ. వేం. స.
నా.మూర్తి.
పద్యాలు చాలా బాగున్నాయి గురువు గారు🙏
ReplyDelete