Thursday, 19 March 2026

స్వాగతం పరాభవా! స్వాగతం.

 

స్వాగతం పరాభవా! స్వాగతం.

సుమధుర వర్తనవై

సమరసనర్తనవై

సమస్వర కీర్తనవై

భ్రమలకు కర్తనవై

అమలిన భావనవై

సమతుల జీవనవై

ఫలమయ కామనవై

యతులిత పావనవై

కదలివచ్చిన పరాభవా!

మదులు మెచ్చిన పరాభవా!

"స్వాగతం, పరాభవా ! స్వాగతం''

 

దేశమంతటా ఎచ్చట చూచిన

రోషావేశము పెచ్చరిల్లినది,

ప్రపంచమంతా అపూర్వ రీతిని

యుద్ధోన్మాదపు టుద్రేకంబది

తాండవనృత్యము  చేయుచునున్నది.

 

కులం పేరుతో హలాహలమ్మును

"అలో లక్ష్మణా" యనియెడి మనముల

నింపుచు నున్నది నిస్తుల క్రౌర్యము

దాల్చియుంచినది దనుజాహంకృతి

 

మతములు మార్చుట చతురత యనుకొని

అతులిత దౌష్ట్యము ధృతిగొని సాగుచు

కలుషమనస్స్థితి విలసిలుచున్నది

ఖలతాసత్వము నెలకొని యున్నది.

 

నీతిబోధకే భూతలమందున

సమతాభావము భ్రమయై కనబడి

అమాయికత్వపు టవనిజాతులను

హేళన చేయుచు నెల్లెడ నున్నది.

 

దైవారాధన, ధర్మాచరణము

దానశీలమును, జ్ఞానార్జనము

 ప్రదర్శనార్థమె  ప్రతిరోజిచ్చట

కనబడుచున్నవి, ఘనముగ నున్నవి.

 

రాజకీయములు నైజశౌర్యమును

చూపుచు నేడిట దీపిలు చున్నవి

స్వార్థమె హితమై, సంస్కృతి మితమై

నిత్యనూతనముగ నిలబడి యున్నవి.

 

మాతాపితరుల చేతోమోదము

కాంక్షసేయగల కర్మవీరు లిట

ఒకరో యిద్దరొ ఉండియుండినను

కలిగతమాయాబలశౌర్యంబులు

వలదని నేరుగ పలుకుచునున్నవి.

 

హితకరవాక్యము లతులితదీక్షను

నుతగుణు లొక్కెడ మతికందించగ

యతనము చేసిన నతుకని వవియని

శ్రుతులను జేర్చని శూర శ్రేణుల

కదలిక మెండై కనబడుచున్నది.

 

జీవుల హింసను చేయబూనుటయె

పాపము లందున పెద్దపాపమని

చెప్పుచు నిత్యము కుప్పతెప్పలుగ

కుత్తుక లెన్నియొ ఉత్తరించుచును

జిహ్వ మెచ్చగా చేకొని మెక్కుట

మిక్కుటమైనది మేదినిపై నిట.

 

న్యాయసంహరణ ధ్యేయం బైనది

అనఘత్వం బది అపచారంబయి

సత్యపాలనము లత్యపరాధము

లైనవి నేడిట "హా" యనురీతిగ.

 

ఒకదేశంబున కొకదేశం బిల

ప్రమాదకరమై భారంబైనది

వైరత్వంబది పారము గాంచక

దవానలంబై తడయక యంతట

వ్యాప్తి చెందుచును వర్ధిలుచున్నది.

 

ఆధునికత్వం బతివిస్తృతమై

వివేకహీనపు విధులకు స్థలమై

విశ్వంఖలత్వపు వేదిక తానై

తకధిమి యంచును తాండవనాట్యము

చేయుచునున్నది సీమను గాంచక.

 

మానవత్వమను మాటకు స్థానము

ఎక్కడనోయని యెల్ల జగంబున

నన్వేషించుట కవసరమీయెడ

కలుగుచున్నయది, కనుమిది, వినుమిది.

 

నూత్న హాయనమ! యత్నశీలివయి

యీస్థితి నీయెడ నెంచగ రమ్మని,

అంతో,యింతో, ఎంతో కొంతయు

మార్పు దీనిలో తీర్పరి వౌచును

అవసరమైతే అన్వర్థాభిధ

వౌచును రమ్మని యభ్యర్థించుచు

సన్నుతి చేయుచు స్వాగతించెదను.

 

స్వాగతం పరాభవా! స్వాగతం.

సుమధుర వర్తనవై

సమరసనర్తనవై

సమస్వర కీర్తనవై

భ్రమలకు కర్తనవై

అమలిన భావనవై

సమతుల జీవనవై

ఫలమయ కామనవై

యతులిత పావనవై

కదలివచ్చిన పరాభవా!

మదులు మెచ్చిన పరాభవా!

"స్వాగతం, పరాభవా ! స్వాగతం''


హ.వేం.స.నా. మూర్తి.

ఉగాది

 

ఉగాది

సీ.

వేపపూతకు జేర్చి వినుతతింత్రిణి కొంత

            గుడమిశ్రితంబుగా గూర్చి పిదప

చూతంపుఫలఖండజాతి నందున నుంచి

            షడ్రసోపేతమ్ము, స్వాదుతరము

గా ప్రసాదము చేసి కాలకంఠాదుల

            గొల్చిన పిమ్మట కోరికోరి

యామిశ్రణము చేతనంది సద్భక్తితో

            స్వీకరించుచు నరుల్ శ్రీప్రదమని

తే.గీ.

తెలుగు సంవత్సరాదిని దీప్తు లొలుక

పర్వరాజుల నాదిగా బహుళముదము

కలుగ నాబాలవృద్ధమ్ము ఘనతరముగ

జరుపుకొందురు సుఖముల నరయగోరి.           1.

సీ.

ద్వారబంధాలలో తోరణంబులు గట్టి

            మామిడాకులతోడ మంగళముగ

ముంగిళ్ళలో మంచి రంగవల్లులు దిద్ది

            సదమలభావంబు నెదల నింపి

వరనూత్న వస్త్రాలు ధరియించి ముదముతో

            దేవతార్చన చేసి పావనముగ

తిథివారనక్షత్ర దీప్తయోగంబులు

            కరణముతో జేర్చి క్రమముగాను

తే.గీ.

సంతసంబున పంచాంగ శ్రవణములను

చేసి, మధురసత్కవితలు వ్రాసి చదివి

క్రొత్తవత్సర మిలపైకి కోరివచ్చు

సమయమందున గూర్తురు స్వాగతమ్ము.                        2.

తే.గీ.

భవ్య "విశ్వావసూ "నామవత్సరమ్ము

తప్పుకొన నేడు నేతెంచె ధరణి కిదియె

వర "పరాభవ " మనుపేర వర్షరాజ

మందజేసెద స్వాగత మందమొప్ప.                    3.

కం.

స్వాగతము "పరాభవ!" యో

రాగాత్మ! పరాభవమ్ము రాదగనిగతిన్

నీగమనము ధాత్రీస్థలి

సాగవలెన్ ప్రజలు మిగుల సంతస మరయన్.     4.

ఆ.వె.

ధరణిలోన నీవు సురుచిరగమనవై

సుఖము లెల్లగతుల జూపవలయు

నన్నిదిశలలోన హర్షదీప్తులు నింపి

విను "పరాభవాబ్ద!" విమలమతిని.                                 5.

హ. వేం. స. నా.మూర్తి.

శ్రీ ప రా భ వ నా మ సం వ త్స ర ము న కు స్వా గ త ము

 శ్రీ ప రా భ వ నా మ సం వ త్స ర ము న కు స్వా గ త ము

శా.
శ్రీమత్పావనధార్మికత్వగరిమాశ్రేయోమయస్ఫూర్తి యీ
భూమిన్ నూత్న"పరాభవాబ్ద"మలరన్ బూర్ణంబుగా గల్గుచున్
క్షేమస్థైర్యము లందుచుండవలయున్ చిచ్ఛక్తి స్వాంతమ్ములన్
స్వామిత్వంబు వహింపగావలయు సర్వస్తుత్యమౌనట్లుగన్. 1.
మ.
పరమానందము యోగ్యకార్యములలో బ్రాముఖ్యతన్ గాంచగా
ధరణిన్ భవ్య"పరాభవాబ్ద"సరణిన్ దైవప్రకాశమ్ము సు
స్థిరమై నాస్తికభావనాపటలులన్ ఛేదించి సౌఖ్యంబు లం
దరకున్ జేరెడి రీతి జూపవలయున్ ధర్మానుసారమ్ముగన్. 2.
శా.
రాముం డాయుగమందు నెల్లయెడలన్ రమ్యత్వమున్ నింపె నా
క్షేమం బంద "బరాభవా! " నిలువుమా, చేయూతవై యెప్పు డో
శ్రీమంతా! భవదీయయాత్ర యిచటన్ శ్రేయస్కరంబై మహత్
ప్రేమార్ద్రంబయి యుండగావలయు నుర్వీస్థాన మొప్పారగన్. 3.
మ.
భవదీయాగమనంబుచేత ఖలులౌ పాపాత్మసంఘంబునం
దవనిన్ నిత్య పరాభవం బొసగుమా, హర్షప్రదా! నీవు సం
స్తవనీయాబ్ద! "పరాభవా" సతతమున్ త్వత్కాలమం దెల్లెడన్
నవచైతన్యము గూడగావలయు సన్మానంబు సంధిల్లగన్. 4.
మ.
వరవై హాయనసంఘమందు భువిలో భవ్యానురాగాఢ్యవై
స్థిరసౌఖ్యప్రదవై మహఛ్ఛుభకరశ్రీదాయివై యొప్పుచున్
పరమానందము గూర్చ నిల్వుము భవత్ప్రాముఖ్యతన్ దెల్పుచున్
కరుణం దాల్చి "పరాభవా!" బుధనుతా! కల్యాణభావాన్వితా! 5.
ఉ.
నాయకులందు నిర్మలత, నమ్మి జయం బిట గూర్చువారికై
శ్రేయ మొసంగు భావములు చిత్తములందున నిల్పి మాతృదే
శాయతకీర్తిసంపద కహర్నిశమున్ శ్రమియించుభావ మీ
వోయి! "పరాభవా!" నిలుప నొప్పగు నంచు దలంతు నమ్ముమా! 6.
చం.
మహితములైన వారములు, మాసచయంబు, శుభాయనంబులున్
విహిత ఋతుప్రకారములు విస్తృతరీతిని వచ్చునట్టి వా
యహములు రాత్రు లన్నియును హాయనరాజ! "పరాభవా" భవత్
సహకృతి దెల్పుచుండగ బ్రశాంతత గూర్చుము లోకమందునన్. 7.
ఉ.
సంతత దేవతార్చనము సల్పుచు నెల్లెడ దీనకోటులం
దెంతయు సత్కృపాగరిమ నింపలరంగను నిల్పువారి కా
వంతయు హాని కల్గని మహత్వము నీశుభకాలమందునన్
సంతస మంద జూపు మనిశంబు "పరాభవ"! వర్షరాజమా! 8.
చం.
వసుధ "బరాభవా!" వినుము పావనసంస్కృతి మృగ్యమయ్యె తా
మసమయభావజాలమున మానవసంఘము హద్దుమీరుచున్
కసిగొని సాగుచున్ సత మకారణవైరము దాల్చుచుండి రో
యసదృశ! నీదుకాలమున నాపగ యత్నము చేయవేడెదన్. 9.
చం.
త్సరుకుడు యుద్ధరంగమున శౌర్యము జూపి చరించురీతిగన్
ధరను "పరాభవా!" ఖలుల దౌష్ట్యము ద్రుంచగ నీవు నిల్చి కా
వరుల పరాభవంబునకు కారణమై సుజనాళియందునన్
తరగని ధైర్యసంపద ముదంబున నిల్పుమటంచు గోరెదన్. 10.
(త్సరుకుడు = ఖడ్గయుద్ధకుశలుడు)
మ.
రమణీయప్రకృతిన్ ఖలాత్ములగుచున్ రక్షస్స్వభావంబుతో
తమకేమన్న విధాన గూల్చు నరులన్ త్వత్కాలమందైన నో
సమతాస్థాన! "పరాభవా"! స్వకృతులన్ స్వాంతమ్ములం దెంచి స
త్క్రమమున్ నేర్చెడి భావ మందు గతికిన్ రాజిల్లగన్ జేర్చుమా! 11.
చం.
మునిజనభూషితంబగుచు ఫుల్లయశస్సుల నందుకొన్న యీ
ఘనతరభారతావనికి కల్మషజాలము నంటగట్టు భా
వనగొని భీతిలేని గతి వర్తిలుచుండిరి కొందరెప్డు హా
యనమ! "పరాభవా" స్పృహ లణంచుము వారలలోన నీవిటన్. 12.
మ.
నవచైతన్యము భారతావనిపయిన్ గన్పింపగా నొప్పు సం
స్తవనీయంబగు సద్వికాస మిచటన్ సర్వత్ర వ్యాపించుచున్
ఛవిమచ్ఛాంతి సమానతాబలముతో సన్మాన మన్నింట సం
భవమై యుండ "పరాభవా!" సతము సద్భాగ్యంబు లందన్వలెన్. 13.
మ.
కుజసంఘంబును గూల్చువారలపయిన్ గోపంబు చూపించుచున్
నిజకార్యోద్భవహాని తా మెరుగుచున్ మేలైన భావంబుతో
సుజనత్వంబున తత్కృతుల్ విడుచుచున్ శోభిల్లు సంకల్ప మీ
ప్రజకున్ నీవు "పరాభవా!" తెలుపుమా, భవ్యానురాగమ్మునన్. 14.
ఉ.
స్వాగతమో "పరాభవ!" శుభప్రదభావముతోడ పృథ్వికిన్
రాగమయాత్మవై జయకరంబుగ వచ్చితి వీవు నిచ్చలున్
సాగుచునుండ జేయు మిట సవ్యవిధంబున ధర్మకార్యముల్
త్యాగమయోపకారజనితాతులసత్కృతు లీ ధరాతలిన్. 15.
మ.
గతకాలంబున జీవనాధ్వమునకున్ గన్పించు కష్టంబు లీ
క్షితిపై నీసమయంబునందు నెచటన్ జేరు ప్రయత్నంబుతో
నతుకం జూడగరాదు, మానవకులం బత్యంత సత్వస్థితిన్
వెతలన్ వీడి "పరాభవా!" నిలుచుచున్ విఖ్యాతి నందన్ వలెన్. 16.
చం.
తనయులు జన్మదాతలకు తన్మయతంగని సేవచేయుటల్
గననగు నీదుకాలమున, కర్కశభావము లంతరించ తా
మనుదినసఖ్యతాస్థితులనందుచు సోదరులట్టు లందరున్
మనవలె నో "పరాభవ!" సమానత గూడవలెన్ ధరాతలిన్. 17.
చం.
ముదమిట నో "పరాభవ!" యపూర్వగతిన్ విలసిల్లునట్లుగా
సదమలభావజాలమది సర్వజనాత్మల నిండునట్లుగా
ముదితను గౌరవించగల పూజ్యశుభాశయ మందునట్టు లీ
యదనున నీవు నిల్చి సుఖ మందగ జేయుము రాగదీప్తితోన్. 18.


హ. వేం. స. నా.మూర్తి.