Friday 28 June 2024

రామాయణము - గంగ

 

రామాయణము - గంగ

(విభిన్నవృత్తములు)

1.

            ఛందము          :           అంబురుహము 

            గణములు        :           భభభభరసవ

            యతిస్థానము   :           13వ అక్షరము 

శ్రీయుత రాఘవ! శక్తి నొసంగుము, శ్రీలనీ భువిపైన దా

నాయతవత్సలతన్ జను లందరి కందజేయుచు బాపముల్

స్వీయబలంబున గూల్చెడి గంగను క్షేమదన్ నరపాలు డ

ప్డీయవనిన్ బ్రవహింపగ జేయుట లింపుగా మది నెంచగన్.

2.

            ఛందము          :           ఉత్పలమాల

            గణములు        :           భరనభభరవ

            యతిస్థానము   :           10వ అక్షరము

కీర్తన చేసి బ్రహ్మను భగీరథు డాయెడ గంగ భూమిపై

ర్తిలునట్లు సద్వరము భవ్యవిధంబున బొంది యాపగా

ర్తనవేగతీవ్రతను నైజ శిరస్థజటావళిన్ భవుం

డార్తిహరుండు నిల్పి జయ మందగ జేయువిధాన వేడినన్. 

3.

            ఛందము          :           అపరాజితము

            గణములు        :           ననరసవ

            యతిస్థానము   :           9వ అక్షరము

శివుడు జటలయందు జేర్చగ స్వర్ధునిన్

వివిధగతుల మ్రొక్కి విస్తృతభక్తితో

వని కరుగజేయు మయ్యరొ నీవనన్

వుడు ధరణినాథు ప్రార్థన చేకొనెన్.

 

4.

            ఛందము          :           అశ్వగతి

            గణములు        :           భభభభభగ

            యతిస్థానము   :           10వ అక్షరము

శ్వగతిన్ విను, భవ్యజలాన్వితబిందువునన్

విశ్వహితంకరివై చని వేగమె చేరు మనన్

శ్వదఘాపహ యౌచును స్వర్నది యాసరమం

దీశ్వరసన్నుతి చేయుచు నింపుగ నిల్చెనుతాన్.

5.

            ఛందము          :           అశ్వలలిత

            గణములు        :           నజభజభజభవ

            యతి స్థానము :           13వ అక్షరము

రముననుండి యేడుగతులందు సాగుచు ననేకనామము లటన్

సురనది పొంది భవ్యమగునట్టి శోభను సతంబు గాంచుచు మహ

త్తరయన నందు భూపతికి వెన్క తానొకటి యేగుచుండ నపుడం

దరయగ మత్స్యసంపదలరాశి యందున జరించె కోర్కె లలరన్.

6.

            ఛందము          :           అసంబాధ

            గణములు        :           మతనసగగ

            యతిస్థానము   :           12వ అక్షరము

రాజన్యా ధ్వమ్మందు నరుసము కరం బొప్పన్

దేజోవ్యాప్తిన్ గాంచి సురనది మదిన్, జేరన్

నైజంబౌ తృష్ణన్ బహుఖచరగణం బప్డ

వ్యాజానందంబున్ గొనగ గని రహాయంచున్.

7.

            ఛందము          :           ఆటవెలది

భగీరథునకు నట్టులా యాపగ

వెనుక జేరియుండి విమల యగుచు

నేగుచుండ గాంచి రెంతేని ముదమున

దేవగణము తనివి దీరునట్లు.

8.

            ఛందము          :           ఇంద్రవజ్ర

            గణములు        :           తతజగగ

            యతిస్థానము   :           8వ అక్షరము

భాగీరథీనామను బాపహారిన్

యోగుల్ మునీంద్రుల్ ముదమొందు రీతిన్

వేగాన్వితన్ జూడగ బ్రీతితోడన్

జాగింతయున్ జేయక సాగి రప్డున్.

9.

            ఛందము          :           ఇల

            గణములు        :           సజననస

            యతిస్థానము   :           8వ అక్షరము

కతావునం గన నురుతరమగు వడిన్

కచోట వక్రత నొకటను విపులతన్

బ్రకటించు స్వర్నది వరగతి నరుగుచున్

కలము తానయి సరసతను నిలిపెన్.

10.

            ఛందము          :           ఉత్సాహము 

            గణములు        :           7సూ+1గురువు

            యతిస్థానము   :           5వగణాద్యక్షరము

దూకుచుండి యెత్తునుండి తోరమౌ జవంబుతోన్

బ్రాకుచుండి పథములందు భాగ్యదాయి తాననన్

స్వీకరించి యఘవినాశ విమలదివ్యకార్యమున్

నాకతటిని యేగె మనుజనాథు వెన్క వేడ్కతోన్.

11.

            ఛందము          :           ఉపస్థితము

            గణములు        :           తజజగగ

            యతిస్థానము   :           8వ అక్షరము

చ్చోట తరంగము లారయంగా

హెచ్చైన నినాదము లింపు మీరన్

మెచ్చంగ సురావళి మింటిపైనన్

పెచ్చైన ముదంబట వెల్గ జేసెన్.

12.

            ఛందము          :           ఉపేంద్రవజ్ర

            గణములు        :           జతజగగ

            యతిస్థానము   :           8వ అక్షరము

గిరీశ జూటంబున గీర్తి నందెన్

రంబు తానంచును బాపకర్ముల్

నిరంతరం బాధుని నీటియందున్

శిరంబులన్ ముంచిరి క్షేమమందన్.

13.

            ఛందము          :           ఏకరూప

            గణములు        :           మభజగగ

            యతిస్థానము   :           8వ అక్షరము

గీర్వాణుల్ మౌనులును గిన్నరుల్ గం

ర్వుల్ పక్షుల్ దితిసుతప్రకాండుల్

ర్వార్యుల్ యక్షులును సర్పకోటుల్

ర్వారాధ్యన్ గొలువ సాగి రందున్. 

14.

            ఛందము          :           కందము

ఆరీతి భగీరథునకు

జేరువగా వెంటనంటి శీఘ్రగయై తా

నారమణీయసురాపగ

చేరుచు జహ్నుని కుటీర సీమను ముంచెన్.

15.

            ఛందము          :           కందుకము

            గణములు        :           యయయయగ

            యతిస్థానము   :           8వ అక్షరము

సాధారణుండైన యాతండు నవ్వేళన్

సిన్ జూపి గంగన్ స్వకార్యావరోధిన్ దా

దెసల్ నిండు జీవుల్ మదిన్ జోద్య మందంగా

వెసన్ మ్రింగె నౌరా! ఛవిన్ గొప్పవాడౌటన్.

16.

            ఛందము          :           కనకలత

            గణములు        :           6నగణములు+స

            యతిస్థానము   :           13వ అక్షరము

మునులును దివిజులు నట కరము వినయమున నతులన్

నుడగు ఋషివరున కిడి యకలుషమతి యగు నదిన్

ననుతను తనయగను గొన సరియనుచు ననగ నా

నఘుడు సురనదిని విడిచె నచట నపుడె చెవులన్.

17.

            ఛందము          :           కవిబృంహితము

            గణములు        :           భనభనభనర

            యతిస్థానము   :           13వ అక్షరము

ముని విడువ నాయమరనది హర్షము గలుగ జాహ్నవీ

నామమును గొని శీఘ్రముగ నరనాథుని వెనుక నేగి యా

భూమిని బలిగృహంబున నతని పూర్వుల బసుమమందు నా

జాముననె ప్రవహించియు ననిపె సద్గతులకయి వారలన్.

18.

            ఛందము          :           కలరవము

            గణములు        :           సనననలగ

            యతిస్థానము   :           8వ అక్షరము

సుతవై నృపునకు శుభకరివయి యీ

క్షితిపై యఘముల జిదుము మనుచు నా

తురానను డట జని పలికిన దా

తులంబుగ నది యరసిన దరుసమున్.

19.

            ఛందము          :           కలితాంతము (గీతాలంబనము)

            గణములు        :           తజజలగ

            యతిస్థానము   :           8వ అక్షరము

భాగీరథియై సురవాహిని తాన్

రాగాత్మకయై యఘరాశి నిలన్

వేగంబుగ ద్రుంచుచు బ్రేమ మెయిన్

రోగాపహగా నెనరుల్ బడసెన్.

20.

            ఛందము          :           కవికంఠభూషణము

            గణములు        :           సజసససజగ

            యతిస్థానము   :           9వ అక్షరము

సురవాహినీగతులు సుందరగాథలు శ్రద్ధతో వినన్

ధరవారి కల్మషము తత్క్షణ మారుట వాస్తవం బిలన్

నిరతంబు గంగ యన నిస్తుల పాపములైన దూరమై

రిసన్నిధాన మది యందును మానవభక్తకోటికిన్. 

No comments:

Post a Comment