Monday 18 July 2016

బమ్మెర పోతన



బమ్మెర పోతన
శా.    శ్రీమంతంబగు కల్పవృక్ష నిభమై, చిద్భావసందీప్తమై
క్షేమం బెల్ల జనాళికిచ్చుచు బృహత్ శ్రేయంబులందించుచున్
భూమిన్ వెల్గెడు భవ్యకావ్యరచనన్ పుణ్యాత్ముడైనట్టి యా
ధీమంతుండగు పోతనార్యు దలతున్ దివ్యాంగు నిప్పట్టునన్.
సీ.     రాముడా జ్ఞాపించ రమణీయమై యొప్పు

కావ్యంబు రచియించు నుడు తాను,
రాజాంకితము చేయ నోజన్మదాయిని!

విశ్వసింపు మటన్న విజ్ఞవరుడు,
పొలము దున్నిన రాదె యలఘుసౌఖ్యంబంచు

సంతసంబున బల్కు సజ్జనుండు,
నన్నయాదులు తాము మున్నంటకుండుట

తన భాగ్యమని యెంచు ధన్యజీవి,
పలికించు వాడుండ పలుకకుండుట యేల

పలికెద నేనంచు పలుకువాడు,
భాగవతాఖ్యంబె భవహర మంత్రమౌ

నని తెల్పియున్నట్టి యనఘు డతడు
సహజ పండితు డంచు సాహిత్యలోకాన

యశమంది యున్నట్టి యసదృశుండు
అనితర సాధ్యమై అద్భుతంబగు రీతి

పద్యంబులల్లిన పండితుండు
తే.గీ. ఆంధ్ర పాఠక జనముల కనుదినంబు
వందనీయుడు తానౌచు వరలుచున్న
పరమ భాగవతోత్తము పదయుగళికి
ప్రణతు లర్పించు చున్నాడ భక్తితోడ.

No comments:

Post a Comment