Saturday 21 March 2015

శ్రీమన్మథనామసంవత్సరానికి స్వాగతం



శ్రీమన్మథనామసంవత్సరానికి స్వాగతం
పద్యోత్పలమాలిక
స్వాగతమోయి! మన్మథ! ప్రభావయుతంబగు నామధారివై
వేగమ యేగుదెంచితివి, విశ్వజనాళికి మేలు చేయగా,
సాగవలెన్ త్వదీయ పరిచర్యలు లోకుల గాచునట్టివై
త్యాగము, సాధువర్తనము, ధన్యత గూర్చెడు శీలసంపదల్
భోగము లందజేయు పరిపూర్ణ సుఖంబుల నిచ్చునట్టి స
ద్రాగమయాన్వితం బయిన రమ్యసుజీవన మాంధ్రభూమిలో
తేగలవీవు, సత్యమిది, ధీయుత! హాయనరాజరాజమా!
నీ గతి సాగుకాలమున నిత్యసుఖంబులు, శాంతివాయువుల్
జాగృతభావనల్, యశము, సన్నుతి కర్హములైన కృత్యముల్,
రోగవిహీనభాగ్యములు, రోషము జూపని సోదరత్వముల్,
వాగమృతంబుతోడ తమ భాగ్యము పంచెడు భావనాబలం
బాగని దానవీరతయు, హర్ష మొసంగు సమైక్యవాదనల్,
దాగని సాహసంబులును ధారుణిలో వికసింపగావలెన్
ప్రోగులు ప్రోగులై భరతభూమిని నల్దిశలందు నిత్యమున్
మూగెడు లంచగొండులకు, మూర్ఖత, స్వార్థము నింపుకొంచు స
ర్వాగమసూక్తిసంపదల వైభవమున్ గనకుండ ధూర్తులై
వాగెడు దుష్టబుద్ధులకు వాసి యణంగవలెన్, మునీంద్ర స
ద్యోగుల బృంద మందరికి తుష్టి యొసంగెడు ధర్మకార్యముల్
సాగుచునుండగా వలయు సత్యము వృద్ధిని పొందగా వలెన్
బాగగురీతి పాలనము భారతదేశమునందు సాగగా
తా గతి దప్పగావలయు దైన్యము, పేదరికంబు లుప్తమై
యోగము కూడగావలయు, నుత్సవముల్ ధరణీతలంబునం
దాగక సాగుచుండవలె నన్నిరకంబుల భాగ్యసంతతుల్
రాగలవన్న నమ్మకము రావలె మన్మథ నీదుకాలమం
దో గురుభావపూర్ణ! విమలోదయ! హాయనరాజ! సుందరా!
భోగమయా! వినీతపరిపూర్ణహృదంబుజయుక్త! నీకిదే
స్వాగతమంచు పల్కెదను సాధుజనావనదీక్షబూని నీ
వాగక రమ్ము మా హృదుల హర్షము నింపుము వర్షమంతటన్.

No comments:

Post a Comment