Tuesday 1 October 2013

“కోడి పందెములు”

“కోడి పందెములు”
తెలుగునేలపైన వెలుగొందుచున్నట్టి
సాంఘికంబులైన సంస్కృతులకు
నుదహరించదగిన దదియేమిటని యన్న
కోడిపందె మందురు రేడ జనిన.


మకరసంక్రాంతి పర్వాన సకలజగతి
కాత్మవిక్రమవైభవ మద్భుతముగ
చాటి చెప్పంగ బూనుచు మేటివైన
కుక్కుటంబుల నాటకై కూర్చుచుంద్రు.

కాళ్ళసందున పదునైన కత్తి గట్టి
పోరు సల్పంగ నుసిగొల్పి, చేరదీసి
ధనము, ప్రాణంబు, మానంబు లనుపమముగ
పణము గావింతు రెల్లెడ బహుళగతుల.


కుక్కుటముల స్పర్థల నిల
మక్కువతో జరుపుచుండి మాన్యదములుగా
లెక్కించుచుందు రెల్లరు
నక్కట! దయయించుకైన నగుపించదహో!


నోరులేనిజీవు లేరీతినైనను
పలుకలే వటన్న తలపుగాక
కువలయంబులోన కోళ్ళపందెముజూడ
సముచితంబు కాదు సన్మతులకు. 

1 comment:

  1. sir , your poems are so nice to read.
    with
    regards
    varaprasad. (knvara12@gmail.com)

    ReplyDelete