Friday, 28 June 2024

సూర్యుడు

 

సూర్యుడు

సీ.

సప్తాశ్వరథముపై సన్నుతం బగురీతి

నాకాశమార్గాన నరుగువాడు

అగణితచైతన్య మవనీస్థలంబందు

ప్రత్యహంబును జేరి పంచువాడు

సకలకార్యములందు జగతిలో సర్వత్ర

సాక్షియై నిత్యమ్ము సాగువాడు

నిస్స్వార్థబుద్ధితో నిస్తులానందంబు

లిలలోన నంతట నిలుపువాడు

తే.గీ.

పరమపావను డౌచును నిరుపమగతి

తన కరస్పర్శతోడను ధరణిపైన

హాయి చేకూర్చుచుండెడి యనుపముండు

భవ్యచరితుండు సృష్టిలో భాస్కరుండు.

ఉ.

వందన మోప్రభాకర! శుభప్రద! సన్నుతసత్వసంయుతా!

సుందరభావశోభిత! విశుద్ధయశోమయ! లోకపాలకా!

డెందము లుబ్బు నిన్గన వడింజను భీతియు ధైర్యవాయువుల్

బృందములౌచు జేరును నవీనముగా బలమందు నెల్లెడన్.

No comments:

Post a Comment