సభ్యత
(విభిన్నవృత్తములు)
91. శాకాయతనము (నందభకార గకార) 9 భగణములు+ఒక గురువు 13,19,25 అక్షరములు
దైనిక జీవన సభ్యత యేమను దానికి టిప్పణి తానగు జూడగ దథ్యముగాన్
దేనెల మాటలు బల్కుచు నుండుట దీప్తులు చిమ్మెడి దివ్యమనంబున దేలుటయున్
దానయి చేరుచు దీనజనాళికి దానము చేయగ దన్మయతన్ గొని తల్చుటయున్
మానవులందరు సోదరులే యను మంచిస్వభావము మానక తాల్చుట మన్నికతోన్.
92. శాలూరము తన నన నన నన న లగ 17వ అక్షరము
బోధించు గురువులయెడ నెపుడు వలయును పుడమి గన వినయ మనునదియున్
శోధించు పనుల నతుల మయిన నిలకడ సురుచిరమయిన స్పృహ గలుగుటల్
బాధించు గుణచయమును వదిలి మనగల వరబలము సత మరయుట యికన్
వేధించు కినుక యది బెరుగుటను త్వరగ విడువగలుగుట లదె యిట నగున్.
93.కళ(కలా) నన నన నన నన న లగ 9,17 అక్షరములు
క్షితిజములను నరికి వనముల క్షతికి చెనటి తనమును సలుపమి యికన్
సతతము నదులను సకల కలుషములు సరి యనుచు గలుప కునికి జనుల్
వెతలను బడువిధి వివిధ దురితము లవిరళముగను గొనక నిలుచుటల్
చతురత కనుపడ సతమును బలుకుచు సమత గనుటయు నిదియన దగున్.
94. మణికిరణము నన మన జన నన నలగ 8,16,25 అక్షరములు
ధరణిని గొన సత్సాంగత్య మగును సభ్యత యిక శుభవచనము దయ గొనుటల్
వరమగు తలపున్ భవ్యంబయిన సుకర్మ పరమసుఖదమయిన బలయుతియున్
సురుచిరగతి సత్ సూక్తుల్ నలుగుర కంద జొనుపు మధురిమయును సుచరితయున్
నిరతము గురుసాన్నిధ్యంబును మనమందు నిలుపు కొన గలుగుట నిజ మిదియౌ.
95. ప్రమోదమహోదయము మత యత నన నర స లగ 13, 23 అక్షరములు
ఏదేశం బిద్ధాత్రిని జన్మం బందంగ నిపుడొక యవసరము తానిటన్ గలిగించెనో
మోదాత్ముండై నిత్యము తద్దేశంబందు మునినిభుడన శుభము లింపుగా ఘటియించగన్
వేదోక్తంబై వెల్గెడి సద్ధర్మం బందు విమలచరితమున స్పృహన్ విధుల్ త్యజియించకే
తాదాత్మ్యం బందున్ జనుడుంటౌగా సభ్యతయన సకల గతులలో ధరాతలమందునన్.
96. పిలీలిక మమ తన నన నజ భర 9,16 అక్షరములు
స్త్రీమూర్తిన్ శుభ్రాంగిన్ దివ్యాతివిమలగుణను స్థిరతరసరసభావదీప్తను హర్షదన్
క్షేమాకారన్ సంస్తుత్యర్హన్ సిరికి గురుతయి కృపకు నిలయగనుండు దానిని నిత్య మీ
భూమిన్ దోరంబౌ భక్తిన్ దాము నరు లరయగ బొడము గద శుభ మద్ది సభ్యత యంచు నా
ప్రేమస్వాంతుల్ విజ్ఞాళుల్ ధీవిభవమున నిట వెలుగు గురుజను లండ్రు పావను లింపుగన్.
97. లయహారిక నన నన నన నన నన గ 9,16,25 అక్షరములు
తనదు మతము నిట దడియక మదికి దనివి యగు విధమున దలగక కొనుచున్
ఘనమని పరులకు గలుగు మతముల క్రమములను దలపగ గడగి సమత తో
జనుడు మనగలుగ జయములు గనును సదమలమతి యను యశము నిట బడయున్
గన నదియె యిది యకలుషమతికిని గల గురుతగు బహుసుఖద మదియె యగున్.
98. లలితము 8 నగణములు + సననయ 11, 21, 30 అక్షరములు
నయము వదలని నడత నవసుఖకర మగుచు జననుతమయిన భావము నరుడు గొను శక్తుల్
భయపడ జనక సుకృతి వరమనుచు సలుపుటయు, పలుకున రుచిరత్వము వసుధను శుభంబుల్
జయములు గనుటకు గల సదుపకరణము లనియు చదువరుల వచస్సులు సరిగ నివియే యా
రయ నది యగు ననుచు ధరణిపయిని బలికెదరు ప్రణుతికి దగువారలు గ్రమ మనుచు దెల్వన్.
99.
ఘననినదము 4 నగణములు+జన జసస స భస 11,20, 29 అక్షరములు
తనకు వలెనె పరులు స్తుతమతులందరు సుఖము తాము బడయన్ దగువారు ధరన్ దప్పక యనుచున్
జనులకొరకు దలచుట సముచితం బనుట యది సభ్యత యగున్ వెస దా నిచటన్ దద్గతహృదితో
మనుట సురుచిరముగను మహిత వాక్యచయమున మానసములం దరుసం బమరం జేయుట లనయం
బనఘు డగుటకొరకయి యతనమున్ సలుపుటయు నౌను గద సభ్యత యా యహముం ద్రుంచుకొనుటయున్.
100.
లయహారి నన నన నన నన నన నస గ 11 11 11 ప్రాసయతి
జగము లిట నిలుచుటయు దగు విధమున సకలమున నగణితసుఖశుభచయ మొసగుట యెప్డున్
వగలు దొలగుట కలుములు గలుగుట విజయములకు నగు బలములు నమరుటకును గన దా నా
నిగమపథము సరియని భగవ దురుకృపను ధర గొనగలుగుటయు నిదియ యగు ప గయు గల్గన్
స్వగణము గతి సురుచిరముగ బలుకుచు నరయుటయు నగు నదియ యని పలికెదరు గద పెద్దల్.
No comments:
Post a Comment