శ్రీ సరస్వత్యై నమః.
కం.
శ్రీలిచ్చి కాచు దానవు
లాలితముగ విద్యలొసగి లక్ష్యంబునకున్
మేలైనరీతి జేర్చుచు
బాలించెడి నిన్ను సతము బ్రాహ్మీ! కొలుతున్. 1.
కం.
భారతి! వీణాపాణీ!
శారద! పరమేష్ఠిరాణి! సన్నుతి, వాణీ!
వారిదమేచకవేణీ!
తీరుగ గావుము ప్రణమిత దివిషచ్ఛ్రేణీ! 2.
కం.
రసనాగ్రమందు నిలుచుచు
నసదృశసుఖ మందజేసి యవనీస్థలిలో
దెసలన్ని నిండు యశముల
నొసగెడి శబ్దస్వరూప! యోయమ!ప్రణతుల్.
3.
కం.
భాషాయోష! సరస్వతి!
భూషితసౌజన్యతత్వ! పుడమిని గల దుర్
వైషమ్యంబుల కంటని
భాషను నాకొసగుమమ్మ! ప్రణుతింతు నినున్.
4.
కం.
చదువులతల్లి! కృపామయి!
సదమలహృదయారవింద! సంస్తుతబృందా!
వదలని భక్తిని మ్రొక్కెద
మది నమలత నింపుమమ్మ మన్నన లందన్. 5.
No comments:
Post a Comment