Friday, 28 June 2024

భాగవతము - వామన చరిత్రము

 

భాగవతము - వామన చరిత్రము

(విభిన్న వృత్తములు)


 

21.

కామేశ          భభనజనగ    11వ అక్షరము

 

శ్రీపతి! వామన చరితము చెప్ప దలచితిన్

నాపయి నిల్పుచు కరుణను నవ్య పదములన్

జూపుచు బల్కెడి క్షమతను శుద్ధమన మికన్

హే పరమేశ్వర! నిను నిట నిమ్మని గొలుతున్.

22.

కాంతి   తజజలగ  8వ అక్షరము

 

తానావరభూషితదైత్యపతిన్

వానిన్ బలినాముని వంచుటకై

దీనావనుడౌ హరి దేవహితుం

డానా డతివామను డై వెలసెన్.

23.

కుసుమలతావేల్లితము         మతనయయయ      12వ అక్షరము

 

దైతేయేశుండౌ బలి గురుని సద్భావపూర్ణున్ మహత్ సం

ప్రీతిన్ బూజించన్ దెలిపె నతడున్ బ్రేమచిత్తంబుతోడన్

రీతిన్ విశ్వాఖ్యాధ్వరమునకు గోర్కెల్ ఫలించన్ జగానన్

ఖ్యాతిన్ సౌఖ్యం బంద విజయమిలన్ గాంచి లోకంబు లేలన్.

 

 

 

24.

కోకనదము    భభభస        7వ అక్షరము

 

దానవనాథుడు తాను సవనమున్

గానగు రీతిని గాంక్షలు వెలుగన్

ధీనిధి యన్విధి దీప్తిని విజయ

శ్రీనట గాంచగ జేసెను వ్రతియై.

25.

కోవిదారము  భతరతసజవ  10వ అక్షరము

 

యాగముచేతన్ ఫలంబుగా నాతండు బహుళంబుగా బలమున్

నైగమసత్వంబు జూపునా నానావిధములౌ శరాదికమున్

వేగమె పొందెన్ దదీయమౌ విస్తారమగు శక్తిచేత సురల్

దాగగ లేనట్లు నాకమున్ దామప్డు విడి బారజేసె గదా!

26.

కౌముది        నతతగ         6వ అక్షరం

 

త్రిదశదీనాతి దీనత్వ మా

యదితి గాంచెన్ హతాశాస్థితిన్

హృదయమందున్ హితంబెంచి యా

సుదతి భర్తృస్తుతిం జేసె తాన్.

 

 

 

 

 

27.

క్షమ(క్షప)       ననతతగ       8వ అక్షరం

 

తనదు విభుడు సద్భావపూర్ణుండు తా

ననిన వ్రతము తానప్డు చేయంగ త

జ్జనిత మహిమ నాచాన గర్భాన వా

మనుని యుదయసమ్మాన మాయెన్ భువిన్

28.

గజవిలసితము         భరనననగ     8వ అక్షరము

 

నాలుగు చేతులున్ ఘనతరమగు గదయు నా

మేలగు శంఖమా నిమిషమునను కరము తా

నాలయమైన చక్ర మటులనె వివిధములౌ

శ్రీలకు స్థానమయ్యె సిరిపతియుదయ మటన్.

 

29.

చంచరీకావళి  మమరరగ  7వ అక్షరము

 

శ్రీవైకుంఠుం  డట్లా రీతి దా జన్మ మందెన్

దేవారిన్ శిక్షింపన్ దేజమున్ జూపి యప్డున్

భావించెన్ బాలుండౌ వైన మవ్వేళ దా నా

ఠీవిన్ వీడెన్ గా పాటించి లోకప్రసక్తిన్.

30.

చంద్రకళ       రససతజజగ 11వ అక్షరము

 

వామనుండుగ దానయి యేగెన్ బావనమౌ బలియజ్ఞమౌ

భూమికిన్ నిగమంబులనెల్లన్  బూర్ణపటుత్వము తోడ నా

సీమపై పఠియించుచునుండన్ జిన్మయు నావటువున్ దితి

ప్రేమనందనుడా యెడలన్ దాన్ విస్తృతభక్తి నుతించుచున్.

31.

చంద్రరేఖ        మరమయయ        8వ అక్షరం

 

నీ యిచ్ఛన్ దెల్పుమంచున్ నిష్ఠాత్ముడై దైత్యు డన్నన్                 

స్వీయంబౌ వాంఛ యంచున్ జెప్పెన్ వటుండప్పు డందున్                  

న్యాయంబౌ రీతి నాకున్ నాదన్నచోటిప్పు డో దై             

తేయా! మూడడ్గులన్ బ్రీతిన్ దా నమిమ్మంచు దానున్       

 

32.

చంద్రవర్త్మ   రనభస 7వ అక్షరం

 

వామనుండు హరి వానికి నిపుడున్

భూమి నీవొసగ బొందెదవు క్షతిన్

క్షేమమిందు గన జేరదని గురుం

డేమి యన్న నత డీయగ దలచెన్.

33.

చంద్రశ్రీ         యమనసరగ           12వ అక్షరము

 

అతండే వైకుంఠుం డగు నయిన నందంగనౌ గా

హితంబౌ మోక్షంబున్ సుఖదపద మింపారనం చా

చతుర్వేదాకారున్ వటుని వరసంతోషయుక్తున్

వ్రతిన్ గొల్చెన్ దానం బిడె నసురపాలుండు వేడ్కన్.

 

34.

చంద్రిక          ననరవ          9వ అక్షరము

సతత మిడెడివాడు సత్య మీ

చతురు డిపుడు చేయి చాచె నే

నతుల సుకృతి నంచు నప్పుడున్

మతిని బలి దలంచె మాన్యుడై

 

35.

చంపకమాల   నజభజజజర           11వ అక్షరము

 

ధరణిని దానమిచ్చుటకు  దానొకమారు వచించి తప్పుటల్

నరునకు బాడిగా దికను నాదు శరీరము శాశ్వతంబె? యా

నరపతు లెందరేనియు గనన్ గతియించరె? పూర్వమంచు నా

వరదుని పూజచేసి బలి వాంఛిత భూమి నొసంగె నప్పుడున్.

 

36.

చంపకకేసరి   సజసససవ     9వ అక్షరము

 

బలినుండి దాన మటు ప్రాప్తిలగా వటుడున్ మహా

బలియుండు తానన నభంబునకున్ బెనిచెన్ గదా

యిలపై ధరించుచు సహించిన దేహము నప్పుడున్

కలయౌనె యంచు నట గాంచినవారు తలంచగన్.

 

37.

చంపకమాలి  భమసగ        7వ అక్షరము

 

పాదము నొక్కింటన్ వసుధన్ దా

నాదట నొప్పంగా నఖిలంబున్

మోదముతో గప్పెన్ మురహుం డిం

కేదిట స్థానంబో యిక నంచున్. 

 

38.

జలదము       భరనభగ       10వ అక్షరము

 

వామను డాగతిన్ వరుస పాదములన్

భూమిని దేవలోకమును బూర్ణముగన్

క్షేమము నిల్ప గప్ప తన శీర్షము నా

ధీమతి దైత్యనాథు డిక దెల్పెను తాన్.

 

39.

జలధరమాల            మభసమ      9వ అక్షరము

 

దైత్యేంద్రున్ వామనుడు విధం బొప్పంగా

సత్యాత్ముం డౌట సుతలసల్లోకంబున్

నిత్యం బేలంగ బనిచె నిష్ఠాత్ముండై

ప్రత్యక్షం బౌచు నిలిచె ద్వారం బందున్.

 

 

40.

తరలము(ధ్రువకోకిల)          నభరసజజగ            12వ అక్షరము

 

ధరణిపై నెవరైన వామన తత్వదీప్తిని సత్కథన్

సురుచిరంబుగ జెప్పుకొన్నను శుద్ధులౌచును విన్న నా

నరులపాపము లన్ని కూలును నవ్యశక్తులు గూడి యా

హరికృపన్ గని సౌఖ్య మందుదు రన్ని రీతుల నిత్యమున్.

 

No comments:

Post a Comment