Monday 10 June 2024

హరివంశము (శ్రీసామ్రాజ్యవేంకటేశ్వరము)

 హరివంశము

(శ్రీసామ్రాజ్యవేంకటేశ్వరము)

(పద్యకృతి)

ప్రార్థనాదికము

శా.

శ్రీమన్! విఘ్నవినాశకా! నతులయా! క్షేమంకరా! శాశ్వతా!

నీమాహాత్మ్యము నెంచ నాకు దరమా, నిన్నెల్ల కాలంబులన్

స్వామీ! గొల్చెద సర్వకార్యములలో ప్రారంభమందున్ మహత్

ప్రేమన్ జూపుచు గావుమా యనుచు గౌరీపుత్ర! లంబోదరా!

శా.

అమ్మా! భారతి! వందనమ్ము లివిగో హర్షాన్వితస్ఫూర్తి నా

కిమ్మా వాక్యవిశేషదీప్తి నిడి నిన్నేవేళ నర్చించెదన్

సమ్మోదమ్మున సన్నుతించెద మదిన్ శబ్దార్థసత్వంబు నా

సొమ్మై నిల్వగ జేయుమా విధిసతీ! సుజ్ఞానసంధాయినీ!

చం.

తిరుమల పర్వతాగ్రమున దీప్తులు చిమ్ముచు భక్తకోటికిన్

వరము లొసంగి ప్రోవగ శుభప్రదరూపము దాల్చియున్న యో

సురవర! వేంకటేశ్వర! యశోమయ! మత్కులదేవ! సన్నుతుల్

స్థిరతరభక్తిభావమున జేయుచునుంటిని స్వీకరింపుమా!

 

 

శా. 

ఛందోబద్ధ సువాక్యసంతతి నిటుల్ సవ్యంబుగా బల్కి యా 

నందంబున్ గనురీతి వత్సలతతో నన్ జూచి సద్విద్య నా

కందన్ నేర్పిన మద్గురూత్తముల కిప్డర్పింతు నమ్రాంజలుల్

“వందే సద్గురుమూర్తులార” యనుచున్ భక్త్యన్వితాత్ముండనై.

మ.

హరివంశంబు నరాకృతిన్ వసుధపై నందించె నాకీయెడన్

సురలారా! మహదన్వయంబయి సదా శోభిల్లు నద్దానినిన్

వరపద్యంబుల జెప్ప నెంచితి మదిన్ వాక్యార్థసంపత్తి నా

కురువాత్సల్యముతోడ జూపుడు మదీయోత్సాహ మొప్పున్ గనన్.

మ.

"హరిసామ్రాజ్యమ" "వేంకటేశ్వరులు" నన్నత్యంతమౌ ప్రేమతో

ధరకుం జేర్చిన తల్లిదండ్రులు మహద్భాగ్యంబు నాకబ్బె నా

కరుణామూర్తుల నందనత్వ మిచటన్ గల్గెం గదా నేడు నే

నరయం దల్చితి ధన్యతన్ బలికి సత్యశ్రేష్ఠ శబ్దంబులన్.

తే.గీ.

"సత్యనారాయణా"ఖ్యతో జనకులు నను

బిలిచినారలు దానినీ యిలను నేను

పొంది సతతంబు శుభముల నందినాడ

పలుక బూనితి వారల వైభవమ్ము.

****

కం.
శ్రీమంతంబై పెక్కురు
ధీమతులకు నిలయమౌచు తేజోమయమౌ
గ్రామము కృష్ణామండల
భూమిన్ మరి "మోగులూరు" భోగద మదియున్.                      1.
కం.
తరముల పూర్వము కొందరు
"హరివంశజు" లచటి నుండి హర్షోన్నతితో

సరియగు "సంగళ్ళా"ఖ్యపు
పురమున కిక జేరినారు పూజ్యు లనంగా.                                    2.

కం.

విపరీతపు చరితముగల

"విపరీతలపా"డొకండు విఖ్యాతంబై

నెపముల నెంచక ప్రజలకు

నుపకారము గూర్చుచుండు నొప్పారంగన్.                                 3.

ఉ.

దాని శివారు భూమిపయి తానది "సంగళపాలె"మెంతయున్

జ్ఞానదులై పురోహితము సర్వవిధంబుల గూర్చువారికిన్

స్థానముగా వెలుంగుచును సమ్యగమాయిక మత్స్యకారసం

తానగృహస్థకోటికి సుధామము తానయి యుండె మెచ్చగన్.       4.

 

 

కం.

పారును "కృష్ణానది" యట
జోరుగ, తత్తటముపైన శోభిల్లునుగా
నారయ "సంగళపాలెము"
తోరంబగు శాంతినిండి తుష్టిద మగుచున్.                                5.

ఆ.వె.

అచటి మత్స్యకారు లనుపమసద్భక్తి

గూడి విప్రవరుల తోడ నెపుడు

వినయ దీప్తు లొలుక మనుచుందు రొప్పార

సేవచేయ విమలభావు లగుచు.                                                  6.

సీ.

సస్యవృద్ధిని జేయు సన్నుతాంబువులతో

            ప్రవహించుచుండు స్రవంతి తాను,

స్వాదునీరమ్ముతో సర్వమానవులకు

            జలతృష్ణ దీర్చు సత్ఫలద తాను

పశుగణంబులకెల్ల వశవర్తిని యనంగ

            బ్రేమతో దరిజేర బిలుచు తాను

తనలోన స్నాతులౌ ధరణివారల లోని

            కలుషంబు లణచుచు మెలగు తాను

తే.గీ.

అఘము గూల్చగ దివినుండి యవనికి దిగు

గంగ కిలలోన సోదరిగా జెలంగు

రమ్యవాహిని సాగరగమ్యయగుచు

కృష్ణ వెలుగొందు హర్షవర్ధిష్ణ  యగుచు.                                                7.
కం.
సంగడులే నావలుగా

సంగతముగ కృష్ణమీద సాగుట వలనన్
"
సంగళ్ళపాలె"నామం
బంగీకృతమయ్యె నిజ మటందురు విబుధుల్.                            8.
కం.
"హరివంశీయుల" కాపురి
నిరతానందంబు లొసగి నిస్తులశుభముల్
వరగుణములు, సద్యశముల
నరమర లేకుండ గూర్చు ననవరతంబున్.                                   9.

.వె.

చిన్న గ్రామమైన మన్నన లందంగ

దగిన వినయ దీప్తి తాను దాల్చి

"సంగళాఖ్య పురము" సర్వత్ర స్తుత్యమై  

వెలుగు చుండె విప్రకులము గూడి.                                             10
కం.
సురుచిర రూపుడు బహుసుం
దరగుణములతోడ వెల్గు ధన్యు డతండున్
"హరికోటేశ్వరవర్యుడు"
చిరకాలము వాసముండె సిద్ధం బచటన్.                                    11.

మ.

"హరి కోటేశ్వరవర్యు" డా స్థలమునన్ హర్షోన్నతిన్ బంచె నా

పురవాసుల్ వినయాఢ్యులై నిలువగన్ బూర్ణానురాగమ్ము తో  

ధరణీదేవవరుండు సర్వగతులన్ తత్తచ్చుభాకాంక్షలన్

స్థిరమైనట్టి మనంబులోన వెలుగన్ జేసెన్ మహద్భావుడై.                         12.

ఆ.వె.

మూల పురుషు డగుచు ఫుల్లాఛ్చ యశమందు

నా మహామహునకు నమరినట్టి

ఆత్మజాళిలోన "నన్నప్ప వర్యుండు"

ముదము గూర్చె జనులు సదమలుడన.                                                 13.

సీ.
"అన్నప్పవర్యుండు" హరికులశ్రేష్ఠుడై
            బహుకీర్తి బడసిన భవ్యగుణుడు
విజ్ఞానఖని యౌచు విప్రవర్యులలోన
            ఖ్యాతినందినయట్టి ఘనుడు తాను,
సద్గుణంబులరాశి సన్మార్గవర్తిని
            సత్యనిష్ఠోపేత సాధుచరిత
"దుర్గాంబ" నామాన దు:ఖదూరిణి యంచు
            పేరు గడించిన  విజ్ఞురాలు
తే.గీ.
వారి నోముల పంటయై సూరిజనుల
గొల్చి వెలుగొందు వాడౌచు కువలయమున
నఖిలసద్గుణ సంపన్ను డనగ నపుడు
"
వేంకటేశ్వరు" డుదయించె వినయశీలి.                                              14.
సీ.
బాల్యంపు దశయందె బాలభానుని భంగి
            దివ్య దేహంబుతోఁ దేజరిల్లె
ఆటపాటలతోడ నాతల్లిదండ్రికి
            నత్యంతమోదంబు నందజేసె
చదువుసంధ్యలలోన సత్కీర్తి నందుచు
            బ్రహ్మతేజంబుతో పరిఢవిల్లె
వృద్ధసేవలలోన విజ్ఞుడై వెలుగొంది
            వినయవర్తనుడన్న ఘనత బొందె,
తే.గీ.
స్వీయగుణముల జననికిఁ జిత్తమందు
హర్ష మొందింప జేయుచు నాత్మజుండు
జనకు నాశీస్సు లందుచు ననవరతము
"వేంటేశుండు" వర్తిల్లు విమలగుణుడు.                                                15.
కం.
నవవర్ష ప్రాయుండును
సువిమల వర్తనుడునైన సుతునకు జరిగెన్
భవుకరుణను నుపనయనము
వివిధాగమపఠనఁ జేయ విస్తృత బుద్ధిన్.                                                 16.

 

చం.

మరువక వార్చి సంధ్యలను, మానక చేయు వటుండు నిత్యమున్

వరమని యగ్నికార్యము, లవారితరీతిని సంస్కృతాంధ్రముల్

నిరతము నేర్చుచుండె నతినిష్ఠను మంత్రములన్ బఠించుచున్

సురుచిరమైన మోదమును జూపుచు జన్మదులైన వారికిన్.         17.
ఆ.వె.
నిఖిల వేదశాస్త్ర నిష్ణాతుగావింప
నిత్యధర్మ సూక్త నిపుణుఁ జేయ
కూర్మితోడ గోరి గురువుల చెంతకు
పంపినారు వారు బాలు నపుడు.                                                18.

చం.

గురువులచెంత బాలకుడు కోరిన రీతిని వేదవిద్యలో

స్థిరతరమైన దక్షతను జేకొన శ్రద్ధను జూపుచున్ నిరం

తరముగ నొజ్జలన్ గని ముదంబున గొల్చుచు నేర్చుచుండె నా

కరణికి సాధు సాధనిరి కాంక్షలు దీరగ పెద్ద లాయెడన్.               19.

ఉ.

చెప్పిన మంత్రపాఠము లశేషముదంబున వల్లె వేయుచున్

చప్పున నేర్చుచుండి గురుసంఘము చేత నిరంతరమ్ముగా

మెప్పును పొందుచుండ హృది మిక్కిలి మోదము నందుచుండి రా

చొప్పును గాంచి జన్మదులు సూరివరుం డగునన్న కాంక్షతోన్.     20.

 

 

ఉ.

వేదము నేర్చుచుండగనె విప్రకులోత్తము "డన్నయార్యు" డ  

త్యాదరలీల మానసమునందు దలంచెను శీఘ్రమే వివా

హాదిక మీసుపుత్రునకు హర్షము నిండగ జేయగావలెన్

మేదినిపై గృహస్థునకె మించు యశంబులు గల్గు గావునన్.         21.

తరలము.

అనెడి భావము తోడ నప్పుడు హర్షమానసు డౌచు స

ద్వినయవర్తన యైన కన్యను దెచ్చి గూర్చగ గోరుచున్

ఘనుల బంధుల మిత్రకోటిని క్ష్మాసురాన్వయవర్తులన్

గనుచు యోగ్యను దెల్పు డంచును గాంక్ష చేయుచు నుండినన్. 22.

శా.

"చందర్లాఖ్య పురంబు"నందు ఘనుడై సన్మార్గ సంచారియై

సౌందర్యోన్నత భావనా విభవుడై శుద్ధాంతరంగుండునై  

కుందాచ్ఛాయత కీర్తిసంయుతుడునై "కోదండరామార్యు" డా  

నందస్థానుడు పెండ్లిచేయ దలచెన్ దా నాత్మసంజాతకున్.         23.

చం.

తనయలు మువ్వు రాయనకు దారొక యిర్వురు నందనుల్ మహ

జ్జననుతవర్తనుండయిన సాధుగుణాఢ్యుడు స్వీయపుత్రియై

మనెడి ద్వితీయనందనను మన్నన గూర్చ వివాహసత్క్రియా

ధనమున దల్చుచుండె సుఖదంబగు జీవన మందజేయగన్.       24.

 

 

సీ.

"సామ్రాజ్య లక్ష్మి"యా సన్నుతాంగికి బేరు

            సచ్ఛీల సద్గుణస్థాన యామె

తల్లిదండ్రులయందు దానెల్ల రీతుల

            నసదృశ సద్భక్తి మసలుచుండు

పెద్దవారలపట్ల విస్తృతాదరముతో

            వినయాంజలులు చేయు ననుదినంబు

సూనృతవాక్యయై శుద్ధాంతరంగయై

            దీవెనల్ గొనుచుండు దీప్తు లలర

తే.గీ.

బాలికారత్న మీయమ భవ్య చరిత

యంచు జనులెల్ల బలుకంగ మించు హర్ష

మందుచుండిరి జన్మదు లాత్మ పుత్రి

ఘనత గృహిణియై  యిల నందగల దటంచు                              25.

సీ.

శాస్త్రోక్త రీతిలో సన్నుతస్వాంతయౌ

            తనయ కుద్వాహంబు ఘనతరముగ

చేయ నెంచెడివేళ శ్రీయుతుం"డన్నయ

          వర్యుండు" సుతునకై వధువుకొరకు

చూచుచుండె ననెడి సూక్తిని విని స్వీయ  

            పుత్రిక గొనుడంచు ఫుల్లమతిని

 

గోర నా బాలలో తీరైన గుణములు

            గాంచి యంగీకార మంచిత మగు

తే.గీ.

స్నేహ దీప్తిని బ్రకటించి స్థిరయశులగు 

వేదవేత్తలు సుముహూర్తవిధిని దెలుప

పెండ్లి జరిపించి బాల నావిమలమతిని

గోడలిగ నందె నతులమౌ కూర్మి జూపి.                                      26.

చం.

సుతుని సుతాదిసంపదను చూచెడి భాగ్యము  జూపబోక “యీ

క్షితిపయి జాలు వర్తనము, చేరుము నాకెడ” కంచు శీఘ్ర మా

స్తుతమతి "నన్నపార్యు" నతిశుద్ధచరిత్రుని స్వీయ సన్నిధిన్  

సతతము నిల్వ బిల్చుకొనె శంకరు డాయన లీల దెల్పుచున్.        27.

కం.

జనుడొకటి తలంచిన నా

ఘనతరకరుణామయుండు కైవల్యదుడౌ

మునిజననుతుడగు దైవము

తనలీలగ నన్యమొకటి తా దలచుగదా.                                       28.

ఆ.వె.

దైవనిర్ణయమ్ము దాటంగ శక్యమే

యేరికైన నెంత వారికైన

అతని కృపను గాదె యనిశ మీలోకమ్ము

నిలిచి యన్నిగతుల వెలుగుచుండు.                                           29.

తే.గీ.

వసుధ మీదకు జేరంగ బంపు నపుడె

ప్రాణికోటికి నాయుష్యపరిమితులను

నిర్ణయించును దైవమ్ము  నిజము దాని 

మార్చ శక్యమె యెట్లైన మనుజున కిట.                                       30.

ఉ.

"అన్నపవర్యు" డాఫణితి నా భగవానుని జేరియుండగా

గ్రన్నన నింటి బాధ్యతల కారణ మాయెడ హెచ్చరించ వి

ద్వన్నుతు డైన తత్సుతుడు భాగ్యము వంచన సేయ వేదమం

దున్న యశేషమంత్రముల నొప్పుగ నందగలేక యాయెడన్.        31.

చం.

సముచితమైన కార్యమయి సాగును నేను పురోహితాఖ్యమై

అమలినమైన కీర్తులకు నాస్పదమై వెలుగొందుదానినిన్

క్షమతను జూపి చేకొనుట సవ్యవిధంబగు నంచు నెంచి త

త్క్రమము నెరింగి స్మార్తమున గైకొనె వృత్తిగ సత్వరంబుగన్.        32.

ఆ.వె.

వేంకటేశ్వరుండు సంకోచరహితుడై

సాహసించె నాపురోహితమును

సవ్యవృత్తి యనెడి సద్భావమున జేయ

స్వజనపోషణకయి సమ్మతించి.                                                             33.

 

 

మాలిని.

పురహితశుభదీక్షన్ మోదచిత్తంబుతోడన్

నిరతము నట దాల్చెన్ నిర్మలానంద మందెన్

హరిహరసురకోటిన్ హర్షితస్వాంతయుక్తిన్

వరగతి భజియించెన్ బ్రాహ్మణశ్రేష్ఠు డౌచున్.                              34.

మ.కో.

ఎల్లవేళల గ్రామవాసుల కీప్సితార్థము లందగన్

ఫుల్లమానసుడౌచు ధర్మము బోధ చేయుచు సత్కృతుల్

పల్లెవారలు చేయ జూచుచు భాగ్యదీప్తికి మార్గముల్

మెల్లమెల్లగ గాంచ జేసెను మేటియై వెలుగొందుచున్.                35.

చం.

పరిసరవాసులందరకు బ్రాప్తిల జేయగ భాగ్యరీతులన్

వరగతి మంత్రరాజములవైభవమున్ బ్రజ లొప్పుమీరగా

నరయు విధాన పూజల నహర్నిశ లత్యతిదీక్షతోడ సు

స్వరయుతుడౌచు దెల్పె జనసంఘము లెల్ల నుతించునట్లుగన్.     36.

కం.

"వెంకయగా"రయి యందరి

సంకటములు మడియజేయు శౌరి నిభుండై

శంకరకృపతో నఘనా

శంకరసత్పథము దెల్పు సన్నుతు డయ్యెన్.                                 37.

 

 

సీ.

"సంగళ్ళపాలెమ్ము" సన్నుతావాసమై

            సంతోష మందించు స్థానమయ్యె

"రామచంద్రాఖ్యమై"క్షేమంకరంబైన

            పల్లె యాహ్లాదంబు బంచుచుండె

"విపరీతపా"డట్లె విస్తార గౌరవం

            బందించుచుండె నానంద మొదవ

"ఏటూరు"గ్రామంబు చోటౌచు భుక్తికి

            సమ్మోదమును గూర్చె సర్వగతుల

తే.గీ.

ఇట్టు లానాలుగూళ్ళెప్పు డింపుమీర

సహకరించుచు నుండంగ సద్విజవరు

డైన వేంకటేశ్వరు డందు మానితమగు

యశము గాంచెను పొడలేని శశియనంగ.                                38.

చం.

వ్రతములు పూజలున్ శుభవివాహములున్ జపహోమకార్యముల్

సతతము గ్రామవాసుల వశం బొనరించగ భాగ్యరాశులన్

నుతగుణుడై పొనర్చె నొకనోటనె నందరు జేలు బల్కుచున్

బ్రతిదిన మాత్మదీప్తికయి వందనముల్ ఘటియించుచుండగన్. 39.

 

 

 

మ.

వరమీ "వెంకయగారు" నిల్చె నిట మాభాగ్యంబుచే జూడ భూ

సురశబ్దంబున కర్హు డీయన కదా! శుద్ధాత్ముడై మమ్ములన్

బరమానందములోన ముంచును సదా, వర్ధిల్లి యైశ్వర్య మం

దిరవై మాపురముండ నందురు జనం బింపారు శబ్దంబులన్.     40.

తరలము.

సురల గాంచగ శక్యమా యిల జూచినా మిదె యీయనన్

హరిహరాదుల తుల్యుడై శుభ మందజేయును మాకు సు

స్థిరసుఖంబులు గాంచు మార్గము దెల్పుచుండును నిత్యమున్

బరమహర్షము కల్గు నీయన వాక్యముల్ వినుచుండినన్.           41.

తరలం.

అనుచు నాయెడ గ్రామవాసుల నంద రందురు భక్తితో

ననఘు డంచును మ్రొక్కుచుండెద రన్నివేళల నమ్ముచున్

మనపురోహితవర్యు డౌచును మాన్యు డిచ్చట నుండుటల్

మన యదృష్టము సత్య మందురు మానవాళి యటన్ భళా!        42.

ఉ.

ఆవిధి "వేంకటేశ్వర"మహాత్ముడు తాను పురోహితత్వమున్

దైవము గూర్చు వృత్తియని తన్మయ మందుచు జేయుచుండి స

ద్భావము చిత్తమం దెపుడు దాల్చుచు గ్రామజనాళి యందునన్

బావనరూపుడై వెలిగె భవ్యయశస్సును గాంచె నాయెడన్.           43.

 

 

ఉ.

ఒక్క పురోహితత్వమున నొప్పుగ వెల్గుచు నుంట కాదు తా

నక్కట! సత్కృషీవలుని యాకృతి దాల్చుచు సస్యసంపదన్

జక్కగ నిల్పు రైతుల వచస్సులు భేషనురీతి సాగగా

మిక్కిలి శ్రద్ధతో సతము మేలని యెంచుచునుండి యంతటన్.     44.

తే.గీ.

పొలము దున్నెను, వ్యాపార మలఘుగతిని

జేసి యుండెను, గోమాతృ సేవ జేసె

గైహికములైన పనులన్ని వాహ యనెడి

రీతి నొనరించె నాయన ప్రీతితోడ.                                              45.

మ.

సతియై నిల్చెను "వేంకటేశ్వరు"నకున్ "సామ్రాజ్య"మాఖ్యన్ జగత్

స్తుతికర్హత్వసుశీలసద్గుణమహచ్ఛోభావిశేషోన్నతిన్

బతిదీక్షాపరయై ధరించి సతతప్రహ్లాదభాగ్యాఢ్యయై

జతగా నుండెను భర్తృచిత్తమునకున్ సత్వంబు నందించుచున్.   46.

మ.

పతి కేనాడు విరోధభావనలతో బల్కంగ దానెంచ దా

క్షితి యోర్మిన్ దన కుద్ది యన్నటులుగా క్లేశంబు లెన్నేనియున్

ధృతితో నాత్మను దాల్చెగాని యెపుడున్ ధీరత్వమున్ వీడ కా

యతమోదంబున బెంచె సంతతిని దా నత్యున్నతస్వాంతయై.      47.

 

 

సీ.

పెనిమిటి ముదమంద తనకు మోదంబంచు

            మనమందు నెంచెనా యనఘ సతము,

పరివారసుఖమందె సురుచిరసౌఖ్యంబు

            నరసెను సతతంబు నిరుపమ యన

కష్టముల్ గములౌచు కలత పెట్టిన వేళ

            పతికిధైర్యము చెప్పె చితుకనీక

ధర్మనిర్వహణమ్ము తనకు బాధ్యత యంచు

            నిరతమ్ము భావించె నిష్ఠబూని

తే.గీ.

బహుళ సంతానవతి యయ్యు భార మనుచు

నెంచకుండగ దారిద్ర్య మెల్లగతుల

పీడ నొసగిన హృచ్ఛక్తి వీడకుండ

తన సుతాళిని బెంచిన తల్లి యామె.                                           48.

కం.

అత్తకు "దుర్గమ"నామకు

జిత్తంబున నిల్పియుంచి స్థిరతరభక్తిన్

బెత్తనము నొసగి నమ్రత

నత్తనువున నింపుకొనియె నాయమ మెచ్చన్.                              49.

 

 

 

మ.

సతతానందము గూర్చువార లరయన్ "సామ్రాజ్యలక్ష్మ్యంబ"కున్

సుతలై మువ్వురు, పుత్రులై నలువురున్ శోభిల్లి రాపైన నీ

క్షితిపై జేరియు నల్పజీవనముచే శ్రీలందకే దైవమే

గతియై యేగినవారు నల్వురు శుభాకారుల్ విధిన్ గెల్తుమే?      50.

సీ.

"సామ్రాజ్యలక్ష్మ్యంబ" సన్నుతాచారయై

            జతగూడి తనతోడ సాగుచుండ,

"దుర్గాంబ" తల్లిగా తోరంపు దీవెన

            లందించుచును క్షేమ మరయుచుండ,

పురజనుల్ గౌరవాదరములు చూపించి

            పలుకరించుచునుండ బహుళగతుల

ధీశక్తియుక్తుడై తేజోమయుం డౌచు

            "వేంకటేశ్వరు"డన్నివిధముల నిల

తే.గీ.

తుష్టి నందుచు సంపదల్ పుష్టిగూర్చు

చుండి యున్నను లేకున్న మెండుగాను

కష్టములపంక్తి యెదురైన నష్టములవి

వచ్చుచుండిన జంకడు వాస్తవముగ.                                          51.

 

 

 

కం.

సుతలకు వైవాహిక కృతు

లతులితమగు శ్రద్ధతోడ నందరు మెచ్చన్

వ్రతమని తలచుచు జేసెను

సతిగూడగ "వేంకటేశశర్మా"ర్యు డటన్.                                                52. 

సీ.మా.

చదువుతో సుతులకు సంస్కారమును నేర్పె

            "వేంకటేశ్వరశర్మ" విజ్ఞవరుడు

సంస్కృతాంధ్రములందు సామర్ధ్య మందించె

            పెద్దవానికి నొజ్జ లొద్ద నాడు

వేదవిద్యను జూపి విస్తార యశమంద

            జేసె నొక్కని నిలన్ భాసిలంగ

స్మార్తంబు బోధించి సన్నుతాచారాన

            వర్తిల్లగా జేసె పట్టి నొకని

తెలుగుభాషాజ్ఞాన మిలను జేకొన జేసె

            సుతునొక్క వాని నాసూరివరుడు

ధనము ముఖ్యము కాదు ఘనతరైశ్వర్యంబు

            విద్య తా నందించు వివిధగతుల

ననెడి భావముతోడ నాత్మజు లందర

            కందించె విజ్ఞాన మంద మొప్ప

తనయల కత్యంత వినయసౌశీల్యంబు

            నేర్పించి ఘనతతో నిలువ జేసె

తే.గీ.

ఆ మహాత్ముని కృపచేత ధీమతులయి

యశము గాంచిరి సంతాన మవనిలోన

సుతులు, పౌత్రులు, దౌహిత్రు లతులముగను

నిర్మలానందసందీప్తి నిల్పి మదిని.                                                   53.

మ.

సతతంబున్ దలవంచి మ్రొక్కెద నిటన్ "సామ్రాజ్య లక్ష్మ్యంబ"గా

క్షితిపై కీర్తిని గాంచు నా జననికిన్ "శ్రీవేంకటేశా"భిధన్ 

నతులన్ పొందిన నాదు తండ్రికి లసన్నవ్యానురాగమ్ము మా

కతులస్థాయిని బంచు "బామ్మ"కు శుభం బాశించి "దుర్గాంబ"కున్.  54.

ఉ.

నాలుగు మాటలీవిధిని నామతి కందినయట్లు దేవతల్

మేలని యందజేసినవి మిక్కిలి శ్రద్ధను బల్కినాడ నీ

వేళను, తల్లిదండ్రుల బవిత్రులనున్ బ్రణుతించి వార లే

కాలము మచ్ఛుభాన్వయము గాతురు గావుత ప్రేమపూర్ణులై.           55.

ఇది

బుధజన విధేయుండును,

హరివంశసంభూతుండును, శ్రీమత్సామ్రాజ్యలక్ష్మీవేంకటేశ్వరపుణ్యదంపతీతనూజుండును, గౌతమసగోత్రజుండునగు

వేంకటసత్యనారాయణమూర్తి ప్రణీతంబైన "హరివంశము(శ్రీసామ్రాజ్యవేంకటేశ్వరము)అను పద్యకృతి.   

No comments:

Post a Comment