Tuesday, 21 May 2024

శ్రీసత్యనారాయణా

 

ఏటూరు గ్రామములోని సత్యనారాయణ స్వామివారి స్తుతి.

(ది.19.05.24వ తేదీ స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా)

శా.

శ్రీమత్పావనరూపశోభిత! మహచ్ఛ్రేయఃప్రదా! శ్రీయుతా!

క్షేమప్రాపక! సంతతీవిభవదా! చిత్సౌఖ్యదా! శాశ్వతా!

హేమాద్యాయతభాగ్యదా! సురనుతా! యేటూరుగ్రామస్థితా

శ్రీమన్! వందనమందుమా ఘనగుణా! శ్రీసత్యనారాయణా!                      1. 

మ.

కరుణాసాగర! మానవాళి యిచటన్ గల్యాణభావమ్ముతో

"వరదాతా! మము గావుమా" యని నినున్ భక్త్యన్వితస్వాంతులై

నిరతంబున్ భజియించ బల్కి సుఖముల్ నిత్యంబుగా నిల్పుచున్

సిరులన్ గూర్చెడి నీకు సన్నుతులయా! శ్రీసత్యనారాయణా!                     2.

శా.

ఈ యేటూరున సర్వమానవులకై యింపారు భాగ్యంబులన్

ధ్యేయంబుల్ ఘటియిల్లి యా హృదయముల్ దీపిల్లగా గూర్చుచున్

న్యాయాధారితవర్తనైకమనమున్, హర్షంబులన్ నిల్పుచున్

శ్రేయంబుల్ సమకూర్చు నీకు బ్రణతుల్ శ్రీసత్యనారాయణా!                    3.

మ.

రమతోగూడి సమస్తలోకములకున్ రమ్యోన్నతక్షేమముల్

సమతాదృష్టిని వత్సలత్వగరిమాసంయుక్త! చూపించుచున్

"నమ"యంచున్ నిను గొల్వ గూర్చెదవు మానాథా! యివే సన్నుతుల్

భ్రమలన్ ద్రుంచుము, ప్రోవుమా సతము దేవా! సత్యనారాయణా!                         4.

శా.

నీకల్యాణము భక్తకోటి కిలలో నిత్యమ్ము శ్రేయస్కరం

బై కల్గించును సంతతిన్ విభవముల్, హర్షంబు సౌఖ్యంబులన్

జేకూర్చున్ సకలార్థసిద్ధులు హరీ! శ్రీనాథ! నీసద్వ్రతం

బేకాలంబును జేయువారి గతి వీవే, సత్యనారాయణా!                             5.

మ.

వరదా! నిన్నిట నిల్పి భక్తజనముల్ ప్రహ్లాదసంయుక్తులై

కరుణాపార! రమాపతీ! సకలదా! కల్యాణమున్ జేయగా

వరభావంబున నున్నవారలు దయన్ వాత్సల్యమున్ జూపి సు

స్థిరభాగ్యంబులు వీరికిమ్ము ఖలహా! శ్రీసత్యనారాయణా!                          6.

మ.

వరమౌ శంఖము, చక్రశార్ఙ్గగదలన్ వాంఛించి పూమాలయున్

నిరతంబున్ ధరియించి ఫుల్లవిలసన్నీరేజపపత్రేక్షణా!

ధర నీ భక్తుల బ్రోచుచుందువు జగత్త్రాతా! ప్రణామించెదన్

సురకోట్యర్చిత! సౌఖ్యముల్ నిలుపు మంచున్ సత్యనారాయణా!                         7.

శా.

నీ మాహాత్మ్య మనంత మద్భుతమయా! నిష్ఠాయుతిన్ గొల్చినన్

స్వామీ! పేదకు నర్థసంచయముతో సన్మానముల్ గూర్తు వీ

భూమిన్ సంతతిలేక కుందెడి జనున్ పుత్రాదిసౌఖ్యంబుతో

ప్రేమస్వాంతము నిల్పి ప్రోతువు నతుల్ శ్రీసత్యనారాయణా!                     8.

శా.

"నేనున్నాడను గుందుటేల" యనుచున్ నీభక్తకోటిన్ సదా

మానంబున్ సమకూర్చ బిల్చినతరిన్ మన్నించి "యో"  యంచు స

త్యానందంబు లభింపజేసెదవయా! ధర్మస్వరూపా! ప్రభూ!

శ్రీనాథా! ప్రణతుల్ గ్రహించు మివియే శ్రీసత్యనారాయణా!                       9.

శా.

ఒప్పారంగను నాడు గాచితివయా! ఉల్కాముఖాఖ్యాధిపున్

గొప్పల్ గావివి కూర్చి సంతతి నికన్ గోరంగ వ్యాపారికో

యప్పా! నీమహిమంబు జూపి ఫలముల్ హర్షించగా నీయవే

చెప్పన్ శక్యమె నీమహత్వ మిలలో శ్రీసత్యనారాయణా!                            10.

శా.

తప్పుల్ సేయుట మానవాళి కిలలో దానౌ గదా సాజ మే

ముప్పున్ వారికి గూర్చకుండ జనకామోదంబుతో వారలే

తప్పంచున్ గ్రహియించునట్లు మది సంధానింపగా జేసి సౌ

రొప్పం గాతువు సన్నుతుల్ గొనుమయా! ఓ సత్యనారాయణా!                11.

సీ.మా.

ఏటూరు గ్రామాన్ నెల్లకాలములందు

            సంతోషములు నిల్పు సత్యదేవ!

సస్యానుకూలమౌ సద్వృష్టి గురిపించి

            సౌఖ్య మందించుమా సత్యదేవ!

ఫలదాయకములైన పంటలతో దీప్తి

            నిత్యమ్ము నిలుపుమా సత్యదేవ!

వాంఛితార్థము లిచ్చి వైభవంబులు గూర్చి

            జనుల గాపాడుమా సత్యదేవ!

సర్వవర్ణాలలో సద్భావభాగ్యంబు

            సమకూర్చి కావుమా సత్యదేవ!

వ్యాపారములలోన వాణిజ్యములలోన

            సత్ఫలముమ్ముల నిమ్ము సత్యదేవ

వ్యవసాయకృషిలోన నతులితైశ్వర్యంబు

            నిత్య మందించుమా సత్యదేవ!

విద్యార్థివర్గాల విపులయత్నములందు

            జయము జూపించుమా సత్యదేవ!

ప్రజలంద రీయూర భక్తితో జరియించు

            సత్వ మందించుమా సత్యదేవ!

ధర్మ మారాధ్యమై తప్పకుండెడి శక్తి

            జనులకు నిమ్మయా సత్యదేవ!

పండితాళికి నిందు నిండుగౌరవదీప్తి

            యత్యంత మొసగుమా సత్యదేవ!

పెద్దవారలపట్ల పిన్నల కాదర

            సాన్నిధ్యముల నిమ్ము సత్యదేవ!

సత్యమ్ము, ధర్మమ్ము, శాంతమ్ము, న్యాయమ్ము

            సభ్యత లిటనిల్పు సత్యదేవ!

ఆయురారోగ్యంబు లందించి యీయూరి

            జనులను గావుమా సత్యదేవ!

ఆ.వె.

సత్యదేవ! నీవు సర్వకాలములందు

రక్షకుండవౌచు రమ్యగతిని

నింపుమీర గాచి యేటూరి ప్రజలకు

నండవగుము నతుల నందుకొనుచు.

No comments:

Post a Comment