Friday, 28 June 2024

జనని (తల్లి)

 

జనని (తల్లి)

(విభిన్నవృత్తములు)

61.

భుజంగప్రయాతము     యయయయ 8వ అక్షరము

 

ధరిత్రీస్థలంబందు దామెవ్వరైనన్

జరించన్ భవంబందు సద్భాగ్యదీప్తిన్

వరంబౌచు గాంచంగ వారిద్ద రెప్డున్

స్థిరాధారభూతుల్ సుధీరాత్ము లెంచన్.

62.

మందాక్రాంత    మభనతతగగ   11వ అక్షరము

 

వారాధారుల్ వసుధ నిచటన్ వాస్తవం బెంచి చూడన్

లేరెవ్వారల్ పరులు మనుజుల్ లీలగానైన గావన్

ధీరత్వంబున్ నిరత సుఖమున్ దివ్యసత్వంబు లెందున్

జేరం జూడన్ సుతుల కెపుడున్ జేయరే యత్న మెందున్.  

63.

మత్తకోకిల        రసజజభర       11వ అక్షరము

 

మాతృదేవతకంటె ధాత్రిని మాన్య యొక్కతె లేదిటన్

బ్రీతి తోడను సర్వకాలము విస్తృతంబగు ప్రేమ తా

నాతతంబగు హర్షముం గొని యంద జేయుచు నుండు నా

మాత కెప్పుడు వందనంబను మాట పావన మన్నిటన్.

64.

మత్తేభము        సభరనమయవ             14వ అక్షరము

 

జననం బీభువిపైన గూర్చి సుఖముల్ సర్వానుకూలంబుగా

తనయుల్ బొందగ దల్చుచుండును గదా తద్రక్షకై స్వీయమౌ

ఘనసంతోషములైన వీడి సతమున్ గల్యాణభావాఢ్యయై

జనులం గాచెడి తల్లి దైవ మనుటల్ సత్యంబు నిత్యంబుగన్.

65.

మానిని             భభభభభభభగ             7,13,19 అక్షరాలు

 

తల్లిని మించిన దైవము లేదిది తథ్యము తథ్యము తథ్యమిలన్

బిల్లల కోసము విస్తృత కష్టము వీడని దీక్షను విజ్ఞతతో

నెల్లవిధంబుల నేమర కోర్చుచు నింతయు నొవ్వక యింపలరన్

సల్లలితంబుగ సాకుచు నుండును సన్మతి గూర్చును సంతతికిన్.

66.

మాలిని             ననమయయ   9వ అక్షరము

 

సురుచిరగతితోడన్ సూనులన్ జేర్చి పల్కున్

వరమగు గుణవృద్ధిన్ వారియం దెంచి నిచ్చల్

తరగని హితమెందున్ దాను బోధించుచుండున్

ధరణిని నొరులేరీ తల్లికంటెన్ మహాత్ముల్.

67.

రథోద్ధతము      రనరవ              7వ అక్షరము

 

తల్లిలేక యిల దాము జన్మమున్

గల్లయే యగును గాంచ జీవులున్

దెల్ల మియ్యదియు దీప్తి నిత్యమౌ

ఫుల్లమానసకు బూజ చేయగన్.

 

68.

వంశస్థము        జతజర            8వ అక్షరము

 

నిరంత రాయంబుగ నిష్ఠ బూనుచున్

జరించుటల్, సత్యము సవ్యరీతిగన్

వరం బటంచున్ గొని పల్కు చుండుటల్

ధరిత్రిలో బూజలు తల్లి  కెన్నగన్.

69.

వసంతతిలకము(మదనము, ఉద్ధర్షిణి)  తభజజగగ       8వ అక్షరము

 

ప్రత్యక్ష  దైవమగు భారతదేశమాతన్

నిత్యమ్ము  హర్షమున నిర్మలభావయుక్తిన్

బ్రత్యేక నిష్ఠగొని భక్తిగ జేరి గొల్వన్

సత్యమ్ము తల్లికగు సవ్యములైన పూజల్.

70.

శార్దూలము      మసజసతతగ   13వ అక్షరము

మాతం గొల్వక తద్ధితంబు కొరకై మర్యాదతో వర్తనం

బేతద్భూమిని జేయకుండగ మహా హీనత్వభావంబుతో

జేతం బెంతయు గుందజేయు సుతు డాచిద్రూపికిన్ ద్రోహియౌ

ఖ్యాతిం బొందగలేడు దుర్గతు లిటన్ గాంచున్ గదా నిత్యమున్.

 

సామాజికము - 2.      జన్మభూమి - భారతమాత

71.

భద్రకము          భరనరనరనగ               12వ అక్షరము

 

భారతదేశ మెందునను జూడ భవ్యమును శ్రేష్ఠమై యశములన్

దోరముగా గ్రహించినది తాను దోషులకునైన బ్రేమ నెపుడున్

నేరము లెంచకుండగనె కోరి నిత్యమును బంచునట్టిది యనన్

శ్రీరమ నిత్య కాపురము నిందు చేయుగద యంచు ఖ్యాతిని గొనెన్.

72.

భాస్కరవిలసితము        భనజయభననసగ        13వ అక్షరము

 

దేవతలకును   నివాసము తానై   దివ్యములగు గతులకు  నిరవౌచున్

బావనతకు జిరునామయు నౌచున్ భాగ్యదములగు సవనములతోడన్

జేవను జగమున జూపుచునుండున్  క్షేమము  లనవరతము  కలిగించున్

శ్రీవిభవము గల భారతదేశ శ్రీలను  దెలుప గలుగుటన నౌనా?

73.

భూతిలకము     భభరసజజగ    12వ అక్షరము

 

వేదములున్ మరి శాస్త్రముల్ బహువిజ్ఞతన్ ఘటియించుచున్

మోదము గూర్చెడి కావ్యముల్ మతముల్ కళల్ శుభకర్మలున్

ఖేదము గూల్చెడి ధర్మముల్ ప్రభుకీర్తనల్ వ్రతజాలమున్

శ్రీదము  లెప్పుడు   నీభువిన్   విలసిల్లజేయును తామిటన్.

 

 

 

74.

భూనుతము      రనభభగగ        10వ అక్షరము

 

భిన్నతన్  గనగ  నేకత  విజ్ఞత దెల్పున్

మిన్నగా  సకల రీతులు  మేదిని యందున్

మన్ననల్  సతము  భారత మాతకు గూర్చున్

సన్నయంబు లవి సంతతశక్తిని నిల్పున్. 

75.

మంజుభాషిణి                          సజసజగ          9వ అక్షరము

 

మనమందు నన్యులను మాట తా గొనం

జన దెవ్వరైన  నరుసంబు గాంచగా

ఘనకాంక్ష చేయు  హితకారి భారతిన్

మనతల్లి యంచనెడి మాట సూక్తియౌ.

76.

లాటీవిటము     ససససమతయ            13వ అక్షరము

 

శుభముల్ గలుగున్ సుఖముల్ పొడమున్ శుద్ధస్వాంతం బందుచునుండున్

విభవం బమరున్ విధముల్ దెలియున్ విస్తారంబౌ విజ్ఞత కూడున్

ప్రభవించును భారతమున్ దలపన్ బ్రజ్ఞాయుక్తప్రాభవ మెందున్

సభలన్ యశముల్ సతతం బమరున్ సద్భావేచ్ఛన్ సన్నుతి సేయన్.

77.

వంశపత్రపతితము  భరనభనవ 11వ అక్షరము

 

శాంతిని గోరుచుండునది సర్వవిధముల నిలన్

సంతతసస్యభాగ్యమున సన్నుతులను గొనుచున్

స్వాంతమునందు విశ్వజనసద్ధితము దలచుచున్

జింతలు దీర్చు మానవుల క్షేమము నిలుపునదై.

11వ అక్షరం యతి స్థానంతో సవరించినది.

శాంతిని గోరుచుండునదియై సకలవిధములన్

సంతత సస్యభాగ్యములతో జయములు గొనుచున్

స్వాంతమునందు విశ్వహితభావమును నిలుపుచున్

జింతలు దీర్చు మానవులకున్ స్థిరసుఖమిడుచున్.

78.

శిఖరిణి             యమనసభవ   13వ అక్షరము

 

కవీంద్రుల్ వాల్మీక్యాదు లిచట మహత్కావ్యములలో

బ్రవీణత్వంబున్ జూపి రచనలకున్  భవ్యపుగతుల్

నవీనుల్  పొందంగా  దెలిపిరి కదా  నైష్ఠికతతో

స్తవంబుల్  నిత్యంబున్  భరతవసుధన్  దాము గనుచున్.

79.

సుందరి            భభరసవ          9వ అక్షరము

 

భారతభూమిని యోగ్యభాగ్యచయాన్వితన్

వీరుల ధీరుల   గన్న విస్తృతసద్యశన్

వైరులు సైతము  మెచ్చు భవ్యగుణాన్వితన్

గూరిమి బంచెడి దాని గొల్తును నిచ్చలున్.

80

సీసము             స్పస్టము

నదులతో నిండిన సదమలస్థానంబు

            పావనక్షేత్రాల భవ్యభూమి

అద్రిరాజంబుల కావాసమై యొప్పి

            యందాల మురిపించు నట్టి నేల

జలపాతములతోడ నలఘుకానలతోడ

            దన్మయత్వంబున దనియు ధరణి

నైగమకృతులతో గోగణంబులతోడ

            బూజ లందుచునుండు పుణ్యసీమ

తే.గీ.

ఇందు గలయట్టి దగుపించు నెందునేని

నరయలేమెందు నిట లేని దన్య మొండు

సత్యమను ఖ్యాతి నందె నాజన్మభూమి

జోతలర్పింతు భారత మాత కిపుడు.

No comments:

Post a Comment