Friday, 28 June 2024

భారతము - కచుడు

 

శ్రీరామ

భారతము - కచుడు

(విభిన్నవృత్తములు)

41.

తోదకము (తామరసము) నజజయ 8వ అక్షరము

 

ఇకనిట భారత మింపగునట్లున్

సకల జగత్పతి! శౌరి! స్మరించన్

సుకరముతానగు సుందరరీతిన్

బ్రకటము జేయగ బ్రార్థన నీకున్.

42.

తురగము   ననననసజజగ     15వ అక్షరము

 

వరబలయుతుడయి వెలిగెడి వృషపర్వు నా యసురాధిపున్

సురుచిరమగు విధమున నిలుపుచు శుక్రు డాతని యొజ్జయై

నిరతము నభయమొసగుచును మరణించువారిని యుద్ధమం

దురుతరమగు జవమున నసువుల నొందజేయుచు నుండినన్..

43.

మురళి  సభరరర 9వ అక్షరము

 

మృతసంజీవనితోడ మేలౌవిధిన్ నిత్యమా

దితిజాళిన్ బ్రతికించి తేజంబుతో నిల్పి తా

నతులంబౌ విజయంబు లందించుచున్ గావగా

ధృతి దప్పెన్ సురలందు దీనత్వముల్ హెచ్చెగా.

44.

మేఘవిస్ఫూర్జితము       యమనసరరగ             13వ అక్షరము

 

సుపర్వాణుల్ శక్తుల్  తరుగ  భయమై సుందరున్ జీవపుత్రున్

స్వపక్షీయున్ నమ్రున్  గచుని గనుచున్ సత్వరం బేగిశుక్రున్

విపక్షస్థున్ దైతేయ గురు నచటన్ వేడి సంజీవనిన్ నీ

వపారాతిశ్రద్ధన్  గొను మనుచు తా మాయెడన్ బల్కి రిట్లున్

45.

తోటకము   సససస   9వ అక్షరము

 

గురుబాలక! నీవట కూరిమినిన్

గురుపుత్రికి జూపుచు గోరిన యా

వరవిద్యను బొందుము ప్రార్థనతో

గురుసేవలు చేయుచు గూడి యికన్.

46.

తోదకము (పాదపము)  భభభగగ   7వ అక్షరము

 

దేవత లావిధి దెల్పగ దానున్

బావన మౌగతి భావన చేసెన్

జీవసుతుండగు శ్రీకచు డాత్మన్

జేవను జూపగ క్షేమము గాంచన్.

47.

ద్రుతవిలంబితము - నభభర - 7వ అక్షరము

 

అతడు నావిధి నాత్మ దలంచుచున్

క్షితికి నాయెడ జేరెను శుక్రునిన్

వ్రతిగ గొల్చుచు బ్రార్థన చేయగన్

వితత దీక్షను విద్యను నేర్వగన్.

48.

నందిని     భతజగ    6వ అక్షరము

 

మ్రొక్కుచు నిల్వన్ ముదమందుచున్

చక్కనివానిన్ సదయాత్ముడై

యెక్కువ ప్రేమం బెదనిండగా

నక్కడ శుక్రుం డతనిన్ గొనెన్.

 

49..

నర్కుటము (కోకిలకాకము)      నజభజజవ     11వ అక్షరము

 

గురునట గొల్చుచున్ మిగుల కూరిమి జూపుచు నా

గురుసుత దేవయానికిని గోరిన రీతి మహత్

స్థిరతర నమ్రతన్ పనులు చేయుచు శుక్రునకున్

నిరుపము డైన ఛాత్రుడయి నిల్చెను విజ్ఞతతోన్.

 

50.

నలిని  ససససస 10వ అక్షరము

 

ప్రియశిష్యుడు తానగుచున్ వెలుగొందగ వా

రయయో యసురాత్మజు లాయవకాశమునన్

భయ మందగ జేయుచు నావనమందు కటా!

క్షయముం గొన జంపిరిగా కడు క్రూరతతో

 

51.

నవనందిని  సజసనగగ  9వ అక్షరము

 

పసు లన్నియింటికయి వచ్చిన గచుండా

దెసలన్ని చీకటుల దేలినను రాలే

దసువందు బాసె నవు నన్న తనపుత్రిన్

వెస దెల్పె శుక్రుడట బ్రేమమున తానున్.

 

52.

పంచచామరము జరజరజగ 10వ అక్షరము

 

వనంబునందు దానవాళి వాని జంపి చెట్టునన్

గనంగ లేని స్థానమందు గట్ట దివ్యదృష్టితో

మనంబునందు గాంచి స్వీయ మాన్యభవ్యశక్తితో

దనూజ మెచ్చ వాని జేర్చె తత్స్థలంబు నందునన్.

 

 

53.

పద్మకము         నభజజజగ       11వ అక్షరము

 

పిదప వానిని వనంబున వేగముతోడ నా

యదయు లెల్లరు వధించిరి యగ్నిని గాల్చియున్

వదలకుండగ సురన్ గొని భస్మము గల్పి తా

మిదియె యంచును గురుం గని యిచ్చిరి త్రాగగన్.

54.

పరమేశ            సనజభగగ        10వ అక్షరము

 

అతడాగతిని గచుండు హర్షము గూలన్

మృతుడై పడినను వాని మాన్యుని దెల్వన్

సుత గోర నపుడు జూచి శుక్రుడు కుక్షిన్

బ్రతుకారి పడిన చట్టు వైన మెరింగెన్.

55.

పృథ్వి    జసజసయవ    12వ అక్షరము

 

గతించె గచుడాతనిం దలచ గాదు భావ్యం బనన్

వెతన్ విడువలేని పుత్రికయి విజ్ఞశుక్రుండు స

న్మతిన్ దలచె మార్గ మాతనిని నైజరూపంబుతో

క్షితిన్ నిలుపగల్గ గోరుచును శీఘ్ర మీరీతిగన్.

56.

ప్రభాతము        నజజరగ          8వ అక్షరము

 

సురగొని త్రాగితి జూడకుండగన్ నే

నరసితి కీడిపు డందుచేత నింకన్

ధరణిసురాదులు తాము మద్యమున్ ద్రా

గ రుజలు గల్గును కల్మషంబు లందున్.

 

57.

ప్రహరణకలిత   ననభనవ          8వ అక్షరము

 

అనుచు బలికి తానతనికి నసువుల్

తనకు నమరు విద్య దెలిపి యిలపై

మునుపటిగతి చూపుచు నరుసము తా

మనగ బలికె క్షేమము గను మనుచున్.

58.

ప్రహేయము     ననమయ         8వ అక్షరము

 

గురుడు తనకునై కూర్మిన్ వచించన్

వరగుణుడయి సద్భావాఢ్యుడౌచున్

స్థిరముదమున నాచిత్తంబు నిండన్

చిరమున మృతసంజీవిన్ గొనెన్ దాన్.

59.

ప్రహర్షిణి          మనజరగ         8వ అక్షరము

 

ఆరీతిన్ గచుడు మహాముదంబు తోడన్

జేరెన్ రూపమొదవ శీఘ్ర మాధరిత్రిన్

తోరంబౌ వినయముతోడ శుక్రు నొజ్జన్

గారుణ్యాత్ము బ్రతుకగా నొనర్చె నప్డున్.

 

60.

ప్రియకాంత      నయనయసగ              11వ అక్షరము

 

సురగురున్ దాకచుడు మహద్భక్తివెలుంగన్

సుధపయిన్ గొల్చి మృతులు ప్రాణంబులు గాంచన్

దెసలను దీప్తిన్ గొనుగతి దివ్యౌషధమంత్రం

సదృశమౌనట్ల రసెను హర్షం బెద నిండన్.

 

 

 

 

హరి వేంకట సత్యనారాయణ మూర్తి

 

 

49.

పంక్తి భభభగ  7వ అక్షరము

 

మిక్కిలి నమ్రత మేలనగన్

చక్కని మాటల సవ్యగతిన్

సృక్కక చేయగ సేవలటన్

మ్రొక్కుచు నిల్చెను మోదమునన్.                           

 

 

No comments:

Post a Comment