Friday, 28 June 2024

శ్రీ పరమేశ

 శ్రీ పరమేశ

 (పరమేశ వృత్తము - స న జ భ గగ -10వక్షరము యతి) 

"పరమేశ" యనెడి భవ్య పద్యము నందున్

కరుణాత్ముడవయి మమ్ము గాచెడి నిన్నున్

వరదాత వగుట చేత ప్రార్థన చేయన్

స్థిర శక్తి నొసగుమయ్య శ్రీ పరమేశా!

 

 కరుణామయుడవు నీవు కావున దేవా!

ధరలోన నిడుము లంది త్రాహి యటంచున్

స్థిరదీప్తి యడుగు నన్ను జేరుము కావన్

సిరులీయ మనుట లేదు  శ్రీపరమేశా!                             

 

సతతంబు గొలుతు నిన్ను శంకర! శర్వా!

నుతులంది భువిని నన్ను నొవ్వనిరీతిన్

జతచేసి బలము నెందు సజ్జయ మందన్

క్షితిలోన నిలుపు మయ్య శ్రీపరమేశా!                              

 

శివరాత్రిసమయమందు జేసెదనయ్యా

భవదీయ మహిమదెల్పు పాఠము లిందున్

భవబంధములను ద్రుంచి భక్తుని నన్నున్

శివ! కావు మభవ! భర్గ! శ్రీపరమేశా!                                 

 

అనుమాన పడుట లేక యాయతభక్తిన్

నినుగొల్తు సతము మ్రొక్కు నీకు నొనర్తున్

ధనవృద్ధి యడుగ బోను తావకభక్తిన్

చినవాడ నగుట నిమ్ము శ్రీపరమేశా!                                

 

మదిలోన నిలిపి నిన్ను మానక కొల్తున్

నదిలోని జలము దెచ్చి స్నానము గూర్తున్

వదలంగ దలచకుండు పాపచయంబున్

చిదుమంగ నడుగుచుంటి శ్రీపరమేశా!                           

  

హరినామ జపము చేయ నందును సౌఖ్యం

బురుదీప్తి కలుగునెప్పు డున్నతలీలన్

ధరపైన మనుజు డందు ధన్యత తానున్

చిరకాల యశము వచ్చి చేరుచునుండున్

 

హరికంటె ప్రభు డొకండు నన్యుడు లేడీ

ధరలోన నిజము గాన తన్మయు లౌచున్

నరులెల్ల గతుల దీని నమ్ముచు నుండన్

మురహంత దయను జూపి మోదము గూర్చున్

 

హరి! నిన్ను దలచుచుందు నన్ని విధాలన్

స్థిరభక్తి గొలువ బూని చేరుచు నుందున్

గరుణించు మనిన జాలు గావగ జేరున్

వరమిచ్చి మను మటంచు భాగ్యము లిచ్చున్.

 

ఇలలోని గతుల జూడు మీశ్వర నీవున్

కలనైన నిజము బల్కు కాంక్షయె లేదీ

కలికాలమునను దేవ! కామ్యద నీవే

పలికించవలయు దీనపా! పరమేశా!

 

గురులందు జనకులందు  గూడక యుండెన్

నరజాతి కిచట భక్తి నాగసుభూషా!

పరికించ దలచ వేమి భాగ్యవిధాతా!

ఉరుభావ మొసగలేవె యోపరమేశా!

 

తనకంటె ఘనులు చూడ ధాత్రిని లేరం

చనుచుండి జనుడు తానె యన్నివిధాలన్

ఘనమత్సరమున గూలి కష్టము లందున్

తనదీప్తి యుడుగ గుందు దా బరమేశా

No comments:

Post a Comment