🙏🙏
శ్రీగురుభ్యో నమః
ఉ.
శ్రీయుతులై నిరంతరము శిష్యుల దక్షత నెంచి విద్య లా
ప్యాయతతోడ నేర్పుచు మహత్తరశక్తులు గూడునట్లుగా
స్వీయసుధామయోక్తులకు జిన్మయభావము జేర్చునట్టి స
ద్ధ్యేయుల మద్గురూత్తముల దీవెన లందగ భక్తి మ్రొక్కెదన్. 1.
మ.
పరమానందముతోడ శిష్యగణముల్ పాఠంబులన్ నేర్చుచున్
వరవైదుష్యమునందు మార్గ మెపుడున్ భవ్యానురాగమ్ముతో
గరుణన్ జూపినయట్టి మద్గురువులన్ గల్యాణభావైక సు
స్థిరులన్ మ్రొక్కెద నమ్రతాయుతుడనై 'జే'యంచు నిత్యంబిటన్. 2.
శా.
రారా, రమ్మని వత్సలత్వగరిమాప్రాగల్భ్య మేపారగా
జేరం బిల్చుచు సాహితీపరిమళశ్రీ లందు సామర్ధ్యమున్
దీరౌరీతిని నేర్పియున్న గురులన్ ధీమంతులన్ పాండితీ
పారావారుల నంజలించెద మహద్భావాఢ్యులన్ ప్రాజ్ఞులన్. 3.
చం.
సముచితవర్తనం బెపుడు సవ్యవిధంబున జేయుచుంట సు
క్షమతనుజూపి ఛాత్రులకు సన్నుతవిద్యను నేర్పుచుండుటల్
సమతను జిత్తవీధి గొని సాధువచస్సుల నాడుచుంట లా
యమలినభావులౌ గురుల యాయతసత్కృప యంజలించెదన్. 4.
శా.
ఈనా డీగతి నాల్గుశబ్దములు స్వీయేచ్ఛానుసారమ్ముగా
నానందప్రదభావజాలవిలసద్యత్నమ్మునన్ బల్కుటల్
జ్ఞానస్థానగురూత్తమప్రకరముల్ నైజప్రకాశమ్ముతో
గానం జేసిన దీప్తి హేతువు కదా కైమోడ్తు నవ్వారికిన్. 5.
సీ.
ఆదిని గురువులై యవనీస్థలంబందు
సంచరించుట నేర్పు జన్మదులకు,
అక్షరంబుల జ్ఞాన మారంభమున జూపి
యుత్సాహమును జేర్చు నొజ్జలకును,
సుజ్ఞానసజ్జ్యోతి శోభిల్లగా గాంచ
మార్గదర్శకులైన మాన్యులకును,
లలితశబ్దము లంది పలుకగల్గిన రీతు
లరయ జేసిన యట్టి గురువరులకు
తే.గీ.
హరిహరాజుల రూపులై యవనిపైన
స్వప్రకాశమ్ము జిమ్మిన సద్గురువర
కోటి కీవేళ శబ్దముల్ గూర్చి యిచట
నందజేయుచు నున్నాడ వందనములు. 6.
ఉ.
నాలుగుదిక్కులన్ బరమనైష్ఠికతన్ గొని సంచరించి ధ
ర్మాలయుడై జగంబున మహత్వము దెల్పెడి పీఠరాజముల్
మేలని నిల్పి బోధనల మేటి ముదంబును గూర్చినట్టి యా
కాలడి శంకరార్యఘను గారణజన్ముని సన్నుతించెదన్. 7.
శా.
వేదశ్రేణికి రూప మీగతి యగున్ విందౌ పురాణంబులన్
మోదం బందుచు నేర్వగానని పయిన్ బూర్ణాచ్ఛవిజ్ఞానదంబై
వేదాభంబగు భారతాఖ్యసుకృతిన్ విన్పించి విఖ్యాతికిన్
బాదై నిల్చిన వ్యాసమౌనికి మహద్భక్తిన్ బ్రణామించెదన్. 8.
🙏🙏
హ.వేం.స.నా.మూర్తి.
21.07.2024
No comments:
Post a Comment