శ్రీ శ్రీ
శా.
ఛందోబద్ధకవిత్వధిక్కృతులతో సర్వత్ర యిచ్చోట నా
చందం బియ్యది విప్లవాత్మకముగా సాహిత్యమున్ గూర్చుటల్
మందత్వంబును వీడి రండు పలుకన్ మాన్యత్వముం గాంచగా
నందం బిందని కావ్యమార్గమున దా నందించె నూత్నత్వమున్. 1.
ఆ.వె.
అగ్గిపుల్ల యైన నాకుక్కపిల్లైన
సబ్బుబిళ్ళ యైన సత్య మిచట
వస్తు వేది యైన భవ్యకవిత్వంపు
సృష్టి కర్హ మంచు జెప్పె తాను. 2.
శా.
శ్రీశ్రీగా వెలుగొందె లోకమునకున్ శ్రేయంబులన్ గూర్చు కా
వ్యశ్రీలన్ వెలయించి విప్లవముగా నాంధ్రంబునందంత తా
నశ్రాంతంబుగ, గార్మికాళి
సుఖసమ్యగ్జీవనానందమే
సుశ్రీలన్ గురిపించు నియ్యెడ ననెన్ శుద్ధాంతరంగమ్మునన్. 3.
మ.
వరభావంబుల "ఖడ్గసృష్టి"యు, "మహాప్రస్థాన"కావ్యంబులన్
ధరణీరక్షణభావదీప్తి గొనుచున్ ధైర్యమ్ము లోకమ్మునన్
స్థిరమై నిల్వగజేయ వ్రాసె జనతా శ్రేయంబె కావ్యంబులం
దరయం గల్గెడి లక్ష్యమంచు దెలుపన్ హర్షప్రదైకేచ్ఛతోన్. 4.
కం.
యుగకర్తగ శ్రీ శ్రీ నీ
జగమున మంగళముగూర్చు సాహిత్యమునన్
దగురీతి బలుకు చుండెద
రగణితగౌరవముతోడ ననుచర గణముల్. 5.
హ.వేం.స.నా.మూర్తి.
19.06.2021.
No comments:
Post a Comment