లింగాకారము దాల్చిన
యంగజహరుడైన శివున కరయ సముండున్
సంగీతతుల్య మట్టులె
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 1.
శృంగారతుల్య రసమును
రంగులహోళీని బోలు రమ్యసుపర్వం
బంగనకు దూగు హితకరి
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 2.
గోంగూర యాంధ్రమాతయు
గోంగూరయె రుచ్యతరము కువలయమందున్
గోంగూరలేహ్య మతులము
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 3.
గోంగూర యున్న చాలిట
నంగనలకు వేరొకండు నవసర మగునే
సంగతమగు పాకంబున
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 4.
బెంగాలున నాంధ్రంబున
రంగూనున నైనగాని బ్రహ్మాండమునన్
మంగళకరమగు రుచిగల
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 5
No comments:
Post a Comment