అన్నమయ్య
శా.
శ్రీమంతంబగు భక్తితో దలచెదన్ 'చిద్రూపియై క్షేమముల్
భూమిన్ గల్గగ జేయుచుండి విలసత్ పుణ్యప్రభావమ్ముతో
నామూలమ్ముగ పాపముల్ దునుముచున్ హర్షంబులన్ గూర్చు నా
శ్రీమద్వేంకట నాయకార్చకకవిశ్శ్రీనన్నమయ్యన్ ఘనున్. 1.
కం.
పదకవితల కీయిలలో
నుదయించు బితామహుండు నున్నతుడు ఛవిన్
సదమలు డన్నమయార్యుడు
మది నచ్యుతు నిలిపినట్టి మాన్యుం డతడున్. 2.
శా.
ఈపుణ్యాత్ముడు స్వీయభావధనమిం దింపారు రాగమ్ముతో
పాపప్రావృతలోకమం దనిశమున్ భవ్యాచ్ఛసౌఖ్యంబులన్
దీపిల్లంగను జేయగల్గిన మహాదేవున్ సమర్చింపగా
జూపెన్ పుష్పచయంబుగా తిరుమలేశున్ మ్రొక్కి హర్షంబునన్. 3.
సీ.
శ్రీహరివాసంబు స్థిరపై యట "నదిగో
నల్లదిగో"యంచు ననినవాడు
"బ్రహ్మ కడిగినట్టి పాద"మియ్యది యంచు
నిలవారలకు బూని తెలుపువాడు
"కొండల నెలకొన్న కోనేటి రాయని"
నలఘుభక్తిని సదా కొలుచువాడు
"తందనానా"యంచు దగ సమానత్వంబు
భవ్యమౌ రీతిని బలుకువాడు
తే.గీ.
జీవనం బెల్ల శ్రీహరి సేవలకయి
యర్పణముచేయు కవివర్యు డనఘు డతడు
తాళ్ళపాకాన్వయాబ్ధికి ధవళయశము
లంద జేసిన ఋషితుల్యు డన్నమయ్య. 4.
No comments:
Post a Comment