Monday, 18 April 2022

ఎర్రన

 

ఎర్రన

 

.

అల నన్నయ్యయు  దిక్కనార్యుడును దామత్యంత సామర్ధ్యమున్

వెలయం జేయుచు వ్యాసభారతకథావిష్కార మాంధ్రమ్మునం

దలఘుత్వం బలరంగ దీర్చునెడ వారచ్చోటునన్ వీడు భా

గలవంబున్ గొని వారిశైలియ యనన్ గల్పించె నెర్రన్న తాన్. 1.

 

ఇలలో "శంభునిదాసుడై"నిలిచె నీ యెర్రన్న విద్వత్కవీ

శుల కారాధ్యుడునై  "ప్రబం ధపరమేశుం"డన్న విఖ్యాతితో

బలికెన్ గావ్యము వర్ణనాత్మకముగా బ్రహ్లాదసద్భావముల్

తలపున్ నింపెడురీతి బాఠకులకున్ దానద్వితీయంబుగన్. 2.

 

సీ.

రమ్యాతి రమ్యమౌ "రాముని చరితమ్ము"

రచియించె నవ్వేళ రాణ కదుర

"హరివంశ" కావ్యంబు నత్యతి దక్షతన్

వెలయించి తానందె నలఘుయశము

"నరసింహసత్కృపా పరిమళత్వంబును"

వరపురాణముగాగ ధరకు బంచె

భారతంబు నరణ్య పర్వభాగంబును

వారధి యనురీతి గోరి పలికె

తే.గీ.

రెడ్డిరాజుల కత్యతి ప్రియతముడగు

నెర్రనార్యుని దెలుగుల కెల్లగతుల

నిరుపమానందదుండౌచు వరలినట్టి

విభవసంయుతు నలికాక్షనిభుని దలతు.

 

.వేం..నా.మూర్తి.

29.05.2021.

No comments:

Post a Comment