శ్రీరామ.
తిక్కన
మ.
కవిలోకంబున బ్రహ్మయై కవులకున్ కల్యాణదంబైన స
త్కవనావిష్కరణంపుయోగ్యగతులన్ దాజూపి కావ్యమ్మునన్
స్తవనీయాచ్ఛయశఃప్రభావయుతుడై ధాత్రీతలంబందునన్
ఛవికిం గారకుడైన తిక్కనకవీశప్రజ్ఞకున్ మ్రొక్కెదన్. 1.
సీ.
పదునైదు పర్వాల భారతరచనమ్ము
నొక్కచేతను జేసె నొప్పుమీర
నిర్వచనంబుగా నిష్ఠతో రామాయ
ణోత్తరభాగంబు నున్నతముగ
రచియించి తానందె బ్రహ్మాండ సత్కీర్తి
సోమయాగము చేసి క్షేమము గనె
నాటకీయతలోన దీటైనపాటవం
బనుపమంబుగ జూపి యందె నతులు
ఆ.వె.
మనుమసిద్ధిచేత "మామ"యం చును బ్రీతి
బిలుపు నందు కొనిన విమలు డగుచు
తిక్కనాఖ్యతోడ దేజరిల్లినయట్టి
వరగుణాఢ్యు డితడు వందనములు. 2.
సి.
హరిహరాద్వైతంబు సురుచిరంబుగ దెల్పి
మోదంబు జగతిలో పాదుకొల్పి
ఉభయత్ర కవులకు విభవ ప్రదాతయై
మిత్రుడై చరియించె మేలనంగ
నెల్లూరిసీమలో నిర్మలానందంబు
నిత్యసౌఖ్యంబులు నిండునట్లు
కావ్యసద్రచనతో కవితామృతరసంబు
ప్రవహింపజేసెను భవ్యగతిని
తే.గీ.
నాటినుండియు జూడంగ నేటివరకు
కవుల కాదర్శ ముగనున్న కవివరుండు
తిక్కనార్యుండు సత్కార్యదీక్షితుండు
భక్తి బ్రణమిల్లుదును కవిబ్రహ్మ కిచట.3.
మ.
అమలోదాత్తమనీషతోడ రచనావ్యాసంగమం దంతటన్
గ్రమమున్ జూపి కవిత్వదివ్యజగతిన్ బ్రహ్మత్వముం గాంచు నీ
రమణీయార్థమహత్వశబ్దచతురున్ బ్రజ్ఞామయాకారునిన్
విమలున్ గొల్తును తిక్కనార్య సుకవిన్ విజ్ఞానతేజోయుతున్. 4.
హ.వేం.స.నా.మూర్తి,
20.05.2021.
No comments:
Post a Comment