నానీస్ మహతీ చానల్ తృతీయ వార్షికోత్సవము సందర్భముగా
శా.
ఈమహతీ సుసంస్థ యిపు డీవిధి వర్షములొక్కమూడిటన్
నీమముబూని యందినది నిత్యము భారతి కర్చనంబులన్
ప్రేమము జూప చేయుచును విస్తృత నిర్మల సద్యశంబు లీ
భూమిని తాను పొందవలె పోడిమి నందుచు నన్నిరీతులన్.
మ.
నరసింహార్యుడు నిత్యదీక్షగొనుచున్ నానాప్రకారంబుగా
వరవిజ్ఞాన ధనంబు నీభువిపయిన్ పంచంగ యోచించి యీ
పరమానందద మైన సంస్థ కిచటన్ బ్రారంభముం జూపె సు
స్థిరసత్కీర్తికి స్థానమై వెలుగు నీ సుశ్లోకు యత్నం బిలన్.
సీ.
పద్యంబు హృద్యమై బరమ హర్షదమౌట
దాని సేవకు నిల్చె తాను గోరి
అవధానములతోడ నతులదీప్తిని నింప
వానికై యనిశంబు తాను దలచె
సంగీత మాధుర్య మంగీకృతంబౌట
నద్దాని నిటజేర్చె నద్భుతముగ
మహదుపన్యాసాల మహితత్వ మిచ్చోట
జూపించుచుండెను శుద్ధమతిని
స్థిరకీర్తిసహితులై ధరపైన వెలిగెడి
వారితో పరిచయ భాగ్యమొసగె
శుభపురాణంబుల విభవంబు తెనుగున
తేటతెల్లము జేయ తివిరెనుగద
తే.గీ.
ఒక్క టనగ నేల పెక్కులీ రీతిగ
మహతి చేయుచుండె నహరహమ్ము
ఇట్టు లెల్ల గతుల నీసంస్థకృత్యాలు
సాగవలయు భవ్య జయము లంద.
No comments:
Post a Comment