Tuesday, 28 June 2022

బెంగుళూరు-బన్నేరుఘట్ట"

 ది. 27.06.2022వ తేదీన బెంగుళూరు(కర్నాటక)లోని "బన్నేరుఘట్ట జంతుప్రదర్శనశాలను"దర్శించిన సందర్భమున కలిగిన భావములకు పద్యరూపము.


"బెంగుళూరు-బన్నేరుఘట్ట"


మ.

అభయారణ్యము బెంగుళూరు పురిలో నత్యున్నతంబౌగతిన్

బ్రభవింపంగను జేయుచుండి ముదమున్ బ్రఖ్యాతినిం గాంచె స

ద్విభవం బన్నివిధాల జంతుతతికిన్ దివ్యానురాగస్ఫురత్

ప్రభలం జూపుచు గూర్చుచున్ నగరికిన్ బ్రాముఖ్యతన్ నిచ్చలున్. 1.


కం.

బన్నేరుఘట్ట ప్రాంతము

సన్నుతమయి యలరుచుండె సద్విభవముతో

నన్నింట జంతుతతులకు 

నున్నతవాసస్థలంబు నొప్పుగ నగుచున్.    2.


మ.

పులులున్ సింహము లేనుగల్ వనములో బూర్ణంబుగా స్వేచ్ఛతో

చలియింపం దగు వీలు జూపి రచటన్ సద్భావముం దెల్పుచున్

దలపించున్ భరతావనీమహిమ మా స్థానంబు దర్శించువా

రలఘుశ్రేష్ఠసుహర్షదీప్తి యుతులై యాశ్చర్యముం బొందగన్.   3.


ఉ.

జంతువులన్ బ్రదర్శనకు సన్నుతరీతిని నిల్పినారలా 

ప్రాంతమునందు మానవుల భావములన్ గ్రహియించునట్లుగా 

నింతులు బాలకుల్ జనము లెల్లరు జూడగ జేరవచ్చుచున్

సంతస మందుచుందు రనిశంబును వానిని గాంచి యెంతయున్.    4.


చం.

అదియె 'సఫారి' నామమున నా వనసంస్థిత జంతుజాలమున్

పదిల మటంచు జూపగల వాహనరాశి జనప్రవాహమున్ 

ముదమును బంచ నెక్కుడని పోడిమి మీరగ నిల్చియుండు నే

యదనుననైన నిక్కమిది యద్భుత మాయెడ ద్వారమందునన్.    5.


సీ.

వాహనంబున నెక్కి వనసీమలో సాగ

భల్లూకసంఘముల్ స్వాగతించు 

ముందుకేగిన వేళ నందు శార్దూలముల్ 

కనిపించి యలరించు ఘనతరముగ

మృగరాజు లచ్చోట నగణితానందంబు 

జేకూర్చ గ్రమముగా జేరుచుండు

కరిసమాజము గాంచ పరమహర్షంబున

గున్నలతోనందు గూడియుండు

ఆ.వె.

వనచరాళి మధ్య జనసమూహం బేగి 

తనివి దీర గాంచి తన్మయులయి 

యనుపమంబు సత్య మద్వితీయం బౌర!

యనుచు బలుకు చుందు రరయ నచట.   6.


సీ.

అట బెద్దమెడతోడ నరయ జిరాఫీయు

గన్నులవిందుగా గానుపించు

తోరంపుటందాల చారలన్ ధరియించు 

గుర్రంబు లచ్చోట గూర్చు ముదము

చిత్రవర్ణాలతో జింకలా వనమందు 

నానందమును బంచు నందరకును

నక్కలు తోడేళ్ళు నానావిధంబులౌ

వన్యస్థ జీవాల వాస మచట

తే.గీ.

ఖడ్గమృగములు పక్షులు కపికులంబు

స్వపరదేశీయ పశుగణ స్థానమగుచు 

దర్శకాళిని మురిపించు దనివి దీర్చు

ఘనత నందిన బన్నేరుఘట్ట నిజము.   7.


చం.

సురుచిరమైనప్రాంతమయి సుందరతన్ వెలుగొందు బెంగుళూ

ర్పురమున రాజమార్గములు పూర్ణతరాచ్ఛమనోహరంబులై 

యరయగ జేరువారలకు హాయిని గూర్చు సువృక్షరాజితో 

హరితవనంబు లంతటను హర్షము నింపును  మానసంబులన్.    8.


కం.

విద్యలపురమై యియ్యది

యద్యతనానంతదీప్తి నందెడి చదువుల్

సద్యశము నొసగు దక్షత

లుద్యోగస్థిరతజనుల కొసగుచునుండున్.    9.


మ.

ఇట టాటా మహనీయు డున్నతముగా నింపారు విద్యాస్థలిన్

పటుశక్తిన్ రచియింపజేసె గొనగా భవ్యంపువిజ్ఞాన మి

చ్చట విద్యార్థులు  చేరి కాంతురుగదా శాస్త్రోక్తమౌ దక్షతల్

మటుమాయం బయి పోవ  నజ్ఞతలు సన్మానంబు చేకూరగన్. 10.


ఉ.

ఇచ్చటి పుష్పసంపదయు నిచ్చటి పచ్చదనంపుశోభలున్

హెచ్చగు పారిశుద్ధ్యగతు లీయెడలన్ గల సౌధదీప్తులున్ 

మెచ్చగనొప్పు సత్యమిది మించు యశంబును బెంగళూరిలన్

నిచ్చలు గాంచగావలయు నిర్మలతావిభవప్రపూర్ణయై. 11.


హ.వేం.స.నా.మూర్తి.

29.06.2022.

No comments:

Post a Comment