కాకి నేర్పే పాఠాలు
07.07.19
ఆ.వె.
కావు కావు మనుచు భావపూరితమైన
ధ్వనిని చేయుచుండి యనవరతము
జనుల కిలను నేర్పు ఘనతరమౌరీతి
కాకి పాఠములను క్రమము గాను. 1.
ఆ.వె.
తిండి బట్టలేక తిరిపెంబులై యుండి
సాయమించుకైన సర్వ జగతి
యందకునికి నిత్య మగచాట్లు పడువారి
గావరోరి జనుడ! కావు మనును . ౨.
ఆ.వె.
లోకమందు
ధర్మ మీకాలమందున
నామమాత్రమయ్యె ధీమతివయి
అట్టులిట్టు
లనక నద్దాని నె ట్లైన
గావరోరి జనుడ! కావు మనును . ౩.
ఆ.వె.
పెద్దవారలగుట వృద్ధాప్యముననేడు
కదలేక యున్న కన్నవారి
నీసడించుకొనక యెంతేని ప్రేమతో
గావరోరి జనుడ! కావు మనును . 4.
ఆ.వె.
దేశగౌరవంబు లాశాంతములదాక
విస్తరించె నాడు వినుము దాని
నరసి నేడు నీవు నశ్రద్ధ చేయక
కావరోరి జనుడ! కావు మనును . 5.
ఆ.వె.
తనకు రక్షగూర్చు ధరణీజముల గూల్చి
దనుజ తుల్యుడౌచు మనుజు డిలను
సంతసించు తుదకు చింతించు నెట్లైన
కావరోరి జనుడ! కావుమనును. 6.
ఆ.వె.
పరిసరంబులన్ని మురికి చేయుచునుండు
కలుషితంబు నదుల గలుపుచుండు
తగని పని యిదంచు మనుజునకుం దెల్పి
కావరోరి జనుడ! కావుమనును.
7.
ఆ.వె.
అనుదినంబు కాకి యర్థవంతంబుగ
చెప్పుచుండు హితము చేయదలచి
కావుకావు మనుచు కడు సంతసంబున
బంధుజనుల రాక బలుకుచుండి. 8.
ఆ.వె.
ధరణి వీడి చేరి పరలోక మందున
నున్న వారి కొరకు నుర్విజనము
లొసగునట్టి మెతుకు లుత్సాహమున నంది
వారి జేర్తునంచు బలికి యెగురు. 9.
No comments:
Post a Comment