Friday, 26 July 2019

జయ జగదంబ


జయ జగదంబ

మానిని

మల్లెలు జాజులు మైమరపించుట మానక పూసెడి మంకెనలున్
కొల్లలు కొల్లలు కోరిక దీరగ గూరిచి నీకయి కోవెలకున్
తల్లివి నీవని తన్మయ మందుచు తాళని నిష్ఠను దండలతో
నుల్లము దీపిల నొప్పుగ దెచ్చితి నో యుమ! గావగ నొప్పునులే.

శంభుని రాణివి, సర్వజగంబుల సన్నుతులందెడి శక్తివిలే
శాంభవి నిన్నిట చల్లని తల్లిని చక్కగ గొల్చెద సర్వదవై
శుంభనిశుంభుల చొప్పడగించిన సుందర మూర్తివి శోకహవై
కుంభినివారల  గోడడగించుచు గూర్మిని జూపగ గోరెద నిన్.

విశ్వములో గన విస్తృత మయ్యెను విజ్ఞత గూల్చెడి భేదము లా
శాశ్వతమౌ నసౌఖ్యము గూర్చెడి సత్యపథంబులు శత్రువులై
నశ్వరమై సుఖనాశము జేసెడి నవ్యవిధానమె  నమ్మెడిదై  
శశ్వదనంతవిషాదమునింపుచు సాగుచునున్నది  సంమునన్.

రావలె నీవని ప్రార్థన జెసెద రమ్యసువర్తన రాజిలగన్
దీవెన లిచ్చుచు ధీవిభవంబిట దీపిల జేయుచు ద్వేషములన్
పావన రూపిణి! పారగ ద్రోలుచు భక్తుల పాలిటి భాగ్యదవై
కావగ వేడెద కాంక్షలు దీర్చెడి కల్పకమౌచు జగంబులకున్.

నిత్యము గొల్చెద నిష్ఠను బూనుచు నిర్మలభావము నీవిడుచున్
సత్యమునందున సాగెడి శక్తిని సన్నుత వర్తన సద్గుణముల్
భృత్యుడు వీడని ప్రేమను బంచుచు వీడక గావగ విన్నపముల్
దైత్యవినాశిని! ధర్మవిహారిణి! దక్షజ! చేకొను దండములన్.  

No comments:

Post a Comment