Tuesday, 30 July 2019

భావదారిద్ర్యము


భావదారిద్ర్యము
దారిద్ర్యానుభవంబు భూత మగుచున్ తర్జించ భావంబునం
దేరీ పద్యము హృద్యమై వెలుగున ట్లీవేళ సృష్టించి స
త్కారం బందగలట్టి వార లిచటన్ తథ్యంబు పద్యస్థితుల్
చేరంబోవు సమానమౌచు వచనశ్శ్రీయుక్తమౌ కైతకున్
మీరెట్లన్న నటంచు బల్కదగునే? మేలౌనె యీ భావనల్?
సారోదాన్విత నిమ్నగా సదృశమై సన్మార్గదస్ఫూర్తితో
జేరున్ దాను హృదంతరాళములకున్ క్షేమంకరంబైన యీ
పారావారనిభప్రభావయుతమౌ పద్యప్రపంచంబు స
ర్వారాధ్యం బగు సాధుభావ సుమహ ద్భాగ్యాతిరేకంబుతో
వారు న్వీరని చూడకుండ శుభముల్ పంచంగ సంసిద్ధమై
యౌరా! యంచను రీతి భావపటలిన్ హర్షంబుగా గూర్చి దు
ర్వారోగ్రామయ సత్వసంహతిని క్షిప్రం బంత మొందించు నూ
త్నారంభంబులు చేయుచుండ, యిచటన్ దక్షత్వముం జూపుచున్
గోరం జేయరె సత్ప్రబంధరచనల్ కోటానుకో ట్లందులో
ధారల్ గట్టుచు పారుచుండదె మహద్భావప్రకాశంబు తత్
క్షీరాభాచ్ఛవిశేషదీధితులలో జిత్సౌఖ్యమందించు సం
స్కారానేకపరీమళంబు లవనిన్ సర్వత్ర వ్యాపించవే ధీ
పారమ్యంబు లభించదే జనులకున్ వాదేల? సత్యమ్ము నే
డారమ్యాద్భుత పద్యవాహిని నిటన్ హర్షంబుతో నందుచున్
తోరంబైన ప్రయత్నముల్ సలిపి యస్తోకంబులౌ కావ్యముల్
తా రీవేళ సృజించుచుండిరిగదా తత్సాహితీవార్ధిలో
తీరైనట్టి శుభాశయంబులు, లసద్దివ్యేతిహాసంబులున్,
స్వైరప్రాభవదీప్తు, లీక్షణములో సంఘంబు నందున్న త
ద్ఘోరాఘాదిసమస్తరోగతతులన్ గూల్చంగనౌ పద్ధతుల్,
నారీలోకమహత్వరక్షణకునై నవ్యంబులౌ యోచనల్,
వీరత్వంబులు, ధర్మరక్షణకునౌ విద్యల్, తదర్ధంబులున్,
దారుల్ సౌఖ్యవివర్ధనంబునకునై, ధన్యత్వమీ జన్మకున్
నైరాశ్యంబును గూల్చి గల్గు విధముల్ నానాప్రకారంబులై
తారుణ్యంబు వహించియుండ నిటులన్ తత్పద్యసంసృష్టిలో
దారిద్ర్యం బిట భావమందు గలదో ధన్యాత్ములారా! యటం
చౌరా! పల్కుట లొప్పునా? నిజముగా నానందముం గూర్చు న
ట్లేరోజైన ప్రజాఖ్యపద్యసభలో నిందున్న వారిచ్చటన్
బ్రారంభింతురు గాదె పద్యరచనన్ ప్రహ్లాద మీ సంమం
దారోగ్యాది సమస్తసౌఖ్యములచే నందించగా గోరి, య
వ్వారిన్ సాధుమహత్ప్రభావ యుతులన్ భావానుగుణ్యంబుగా
సౌరుల్ నింపిన పద్యముల్ పలుకుచున్  సన్మానసంపత్తి కా
స్కారంబైన బలంబు నందెడి శుభాకారార్యసంఘంబులన్
ధీరత్వంబు సమస్త పాఠకులలో దీపిల్లగా జేయు స
చ్చారిత్రస్థితులన్ స్మరించదగు లేశం బైన భావంబునన్
దారిద్ర్యంబిట నెంచగా దగదు సద్భావంబు లందం దగున్.


No comments:

Post a Comment