వాంఛాసిద్ధి
ఉ.
పద్యము వ్రాయ బూనితిని
భవ్యపదంబుల భావదీప్తితో
సద్యశమున్ గడించగల
సన్నుత శైలిని నింపి యందులో
హృద్యములైన సూక్తులకు
నింపుగ స్థానము గూర్చి సంఘమం
దద్యతనేతిహాసముల
నందర కందగ జేయు కాంక్షతోన్. 1.
ఉ.
నాదుమనోరథంబులను
“నమ్మితి గావున నిన్ను దైవమా
కాదనకుండ దీర్చుమయ!
కామిత సత్ఫలదాతవీవు నా
పైదయజూపుమా” యనుచు భక్తిగ దేవుని సంస్మరించితిన్
మీదట లేఖినిన్ గొనుచు
మిక్కిలి యత్నము చేయబూనితిన్. 2.
ఉ.
కాగితముల్ పరంపరగ గ్రమ్మిన వంతట చిత్తు చుట్టలై
యాగక నేగుచుండె
గడియారపు ముళ్ళు జవంబుతో గనన్
సాగనిదాయె లేఖిని
యశక్తత ద్యోతక మౌట స్వాంతమం
దీగతి కేమి కారణమొ
యెంచగ నిట్లని దోచె నాయెడన్.
3.
ఉ.
సవ్యవిధాన లక్షణ
విచారము చేయకపోవుచుండుటల్,
కావ్యము వ్రాయ బూనుటకు
కానగు పద్ధతి నేర్వకుండుటల్
దివ్యములైన పూర్వకవి
దీప్తులు నేర్పెడి గ్రంథసంఘమున్
సేవ్యముగా దలంచక
ప్రసిద్ధిని గోరుట లిందు హేతువుల్. 4.
ఉ.
నాయెడనున్న వస్తువె
యనంతము, శ్రేష్ఠము, సన్నుతం బికన్
శ్రేయద మన్నభావన
యశేషముగా మనమందు దూరి యీ
కాయమునందు జేరుట
సుఖంబుగ నిందు వసించి యుండుటల్
జ్ఞేయము లీపరిస్థితికి
జేర్చెడి హేతువులంచు నిచ్చలున్. 5.
ఉ.
దైవములన్ దలంచినను,
దాళక కాంక్షలు బూనుచుండినన్
పావనసాహితీసుధలు
పానము సేయక కావ్యసృష్టికై
యేవిధి సల్పినన్
జతన మేర్పడ దందు ఫలంబు చూడగా
నావలె కోరికల్ మిగులు
నమ్మదగున్ హితకాంక్షులందరున్. 6.
No comments:
Post a Comment