Thursday, 30 March 2017

హేవళంబి.

సురుచిర చైత్రమాసమున చూతకిసాలపు భక్షణంబునన్
సరసముగాగ కోయిలలు సచ్ఛుభరావముతోడకూయగా
నరుసము గొల్పురీతి తరులన్నియు పచ్చదనాననిండగా
ధరపయి హేవలంబి సుఖదంబయి వచ్చెను దీప్తులీనుచున్.

మనుజులు చూతపత్రముల మాలలు ద్వారములందుగట్టిస
న్మునిగణ బోధితంబులయి మోదమొసంగెడు శ్లోకపంక్తులన్
నతర భక్తిభావమున గానము చేయుచు స్వాగతించగా
మునుపటి హేవళంబి ముదమున్ భువిబంచగ వచ్చెనూత్నయై.

మామిడి కాయ ముక్కలకు మైమరపించెడి గంధయుక్తయై
క్షేమము గూర్చునట్టి దగు శ్రీప్రద నింబసుమంబు గూడి యా
ప్రేమను జూపు తింత్రిణిని విస్తృతమైన గుడాదు లింపుగా
నామని వేళ జేర్చ దరహాసిని వచ్చెను హేవళంబియై.

విప్రవర్యులు పంచాంగ విషయములను
జనహితార్థము సర్వత్ర చదువుచుండ
సంతసంబును దాల్చుచు సత్వరముగ
నేగుదెంచిన దీవేళ హేవళంబి.

కవులు నుత్సహించి కవితల సౌరభా
లవని పంచుచుండ భువనమందు
సౌఖ్యరాశినింపు సంవత్సరంబౌచు
నేగుదెంచె నిపుడు హేవళంబి.

స్వాగతంబు గొనుము వత్సరరాజమా
హేవళంబి! జగతి నెల్లవేళ
నీదుకాలమందు నిరుపమానందంబు
పంచుమంచు జేతు ప్రార్థనంబు.


No comments:

Post a Comment