Thursday, 30 March 2017

శ్రీ హేమలంబీ(బా) నీకు స్వాగతము

శ్రీ హేలంబీ(బా) నీకు స్వాము
శా.    
శ్రీలాలిత్యము, సర్వకార్యములలో క్షిప్రప్రమోదంబు సత్
   శీలౌన్నత్యము, సాధుసేవయు, మహిన్ చిత్సౌఖ్య సౌభాగ్యముల్
   మేలై వెల్గెడు భావజాలము మదిన్, మిన్నంటు సత్కీర్తు లే
   కాలం బెల్లెడ హేమలంబి! ప్రజకుం గల్గంగ నేతెంచుమా!.

శా.    
హేమాలంకృత! హేమలంబి వినుమా హెచ్చైన సౌఖ్యంబు లీ
   భూమిం బంచగ వేగ రమ్ము కొనుమా పూజ్యా! నస్వాగతం
   బేమీయన్ హృదిలో దలంచి యిలపై కేతెంచి యున్నావు? రా
   యీ మాదేశపు దుర్దశన్ మనుపగా నిచ్ఛన్ మదిం దాల్చుచున్.

కం.   
రియాదను నేర్పించగ
   సరసాత్మక! హేమలంబి! సత్వరగతితో
   నరుదెంచితి విదె స్వాగత
   మురుతర సౌఖ్యప్రదాత! యూహాతీతా!

కం.   
లంకల, బీళ్ళను, బొలముల
   నంకిత భావంబుతోడ నద్భుతరీతిన్
   సంకటహరమగు వృష్టిని
   గొంకక నో  హేమలంబి! గురిపించవలెన్.

కం.   
బీదలు ధనికులు ననియెడి  (బాదలు పెట్టక నీనా)
   భేదంబును జూపకుండ విమలాత్మకవై
   శ్రీదముగహేమలంబీ
   మోదంబున సాగిరమ్ము మురిపించుటకై.

శా.    
నీవాసంబున భారతావని నికన్ నిత్యం బనాథ ప్రజా
   సేవాకార్యము వృద్ధిచెందవలయున్ శీఘ్రాతి శీఘ్రంబుగా
   భావావేశము ధర్మకర్మములకై పౌరాళి కబ్బన్వలెన్
   ధీవిస్తారము హేమలంబి మహదుత్తేజంబు లందన్వలెన్.


చం.   
కువలయ మంతటన్ గనగ కూర్ముల పేర్ములు మానవాళిలో
   స్తవమున కర్హమౌ విధిని సభ్యత నిండగ హేమలంబి నీ
   సువిదిత కాలచక్రమున శోభనమై వెలుగొందగా వలెన్
   భవదభిమాన భాగ్యమిక పౌరుల కెల్లర కందగా వలెన్.

కం.   
స్వార్థంబున నిధులన్నియు
   వ్యర్థం బొనరించువారి యత్నము లికపై
   సార్థకనామా! విను ని
   న్నర్థించెద హేమలంబి యణచుట కొరకై.

కం.   
తి దప్పిన జనజీవన
   మతివేగమె నవ్యదీప్తు లందగ వలయున్
   క్షితిపయిని హేమలంబీ
   యతి సౌఖ్యము గూడవలయు నన్ని విధాలన్.

చం.   
రముల సంస్కృతుల్ ప్రజలు దాల్చెడి మానస మీయరమ్ము నీ
   వరయుము నేటి కాలమున నంతట నిండు విదేశ పద్ధతుల్
   సురుచిర భావనాభరిత! సుందరనామక! హేమలంబి యీ
   భరత మహీస్థలంబుపయి పావనతన్ బ్రసరింప జేయుమా.

చం.   
ముదితలు సన్నుతుల్ గొనుచు మోదముతో జరియించుచుండి యే
   యదనున కష్టముల్ గొనక యిమ్మహి నుండెడి భవ్య గౌరవా
   స్పదమగు కాల మిత్తరిని సత్వర మీయగ హేమలంబి నీ

   మదిని దలంచి యెల్లెడల మాన్యత నందగ స్వాగతించెదన్. 

No comments:

Post a Comment