Wednesday, 8 October 2014

శ్రీసత్యనారాయణ వ్రతకథ - నాలుగవ అధ్యాయము



శ్రీసత్యనారాయణ వ్రతకథ
(తెలుగు పద్యకావ్యము)
నాలుగవ అధ్యాయము
కం.   శ్రీవిభుని దివ్యచరితం
బీవిధి వివరించుచుంటి వింపలరంగా
నావైశ్యుని కథలో నిక
నావలి ట్టంబు తెల్పు మనిరా మౌనుల్.                                ౧. 

ఆ.వె. వల్లె యనుచు సూతు డుల్లసిల్లుచు నంత
శౌనకాదులార! సావధాన
చిత్తులౌచు వినుడు చెప్పుచునున్నాడ
ననుచు పలుక సాగె నావలికథ.                                            ౨.

సీ.     కారాగృహమునుండి వారిద్ద రారీతి
శ్రీమంతులై యాత్మధామమున్న
జనపదంబునకేగ సాగి మానసమందు
తీర్థయాత్రలు చేయు తీండ్ర కలిగి
క్షేత్రదర్శనమందు క్షితిసురాదుల నెల్ల
దానధర్మాలచే తనియ జేసి
యానందభరితులై యాత్మభాగ్యము నెంచి
హాయినందుచు ముందు కరుగువేళ
తే.గీ. వ్రతము చేయంగ వలెనన్న భావ మితని
తలపులోనైన  నొకయింత కలదొ లేదొ
చూడవలెనంచు భగవాను డాడ నపుడు
వారి యెదుటను దండియై తారసిల్లి.                                     ౩. 

ఆ.వె. అడుగుచుండె నిట్టు లవ్వారు మత్తులై
పలుకు చుండి రపుడు పలువలగుచు
సాధుజనుడొ లేక స్వామియో గాంచక
వారికిట్లు సాగె భాషణంబు.                                                ౪.

సీ.     వైశ్యసత్తములార! పడవలో సరుకేమి
భారంబు గానున్నదౌర గాంచ?
సన్న్యాసి! నీకు మా సరుకుతో పనియేమి
తీగలాకులె ముందు కేగవోయి,
మాబోంట్లతో నిట్లు మాయమాటలు బల్క
శ్రేయస్కరంబౌనె శ్రేష్ఠులార!?
ఓరి! బైరాగి! నీ వారగింతువ యేమి
మణులు రత్నాలున్న మహిమజూపి?
ఆ.వె. అట్టి వేమి లేవు కట్టె లాకులు దప్ప
యనుచు వార లనుట హరియు నపుడు
కట్టె లాకులె మీరు కాంక్షించుచున్నారు
కాన సత్యమగును కాంచు డనియె.                                      ౫. 

తే.గీ. అట్లు శపియించి భగవాను డచట కొంత
దూర మందున్న వృక్షంబు చేరి యచట
ధ్యానముద్రను గూర్చున్న తరుణమందు
పడవ వద్దకు వెళ్ళిరా వైశ్యులంత.                                       ౬.

సీ.     నౌక లోపలికేగి నవరత్న భరితమౌ
సంచుల కోసమై చాల వెదికి
వజ్రవైడూర్యాది వస్తుజాలంబంత
యదృశ్యమై పోయి యందులోన
కట్టెలాకులు తప్ప నరత్నములు లేమి
నమిత దు:ఖంబుతో నాత డప్పు
డీకట్టె లేమిటో నాకర్మ మదియేమొ
ధనమంత యేమాయె, మనుట యెట్టు
ఆ.వె. లనుచు శిరము మోదుకొనుచు, మూర్ఛిల్లెనా
శ్రేష్ఠి, యల్లు డతని సేదదీర్చి
శ్వశురవర్య! వినుము సన్న్యాసియే దీని
కారకుండు నిజము నుడు తాను.                                     ౭.

ఆ.వె. మాన్యు డతడు చూడ మాధవుండే యిట్లు
దండివలెను మనకు తారసిల్లె
నతని తోడ పల్కు నవహేళనోక్తులే
తోరమైన దు:ఖ కారణములు.                                             ౮. 

ఆ.వె. శరణ మాత డొక్క డరయుమా వృక్షంపు
ఛాయలోన యోగ సాధనంపు
ముద్రనూని యుండె భద్రమూర్తి యతండు
రమ్ము పోదమనియె సమ్మతముగ.                                      ౯.

సీ.     అల్లుడారీతిగా ఫుల్లారవిందాక్షు
కడకు తోడ్కొనిపోవ గాంచి యతని
పాదాల కడజేరి భక్తితో ప్రణమిల్లి
దేవ! నీవేనాకు దిక్కు నన్ను
కావుమో గోవింద! క్షమియించి యపరాధ
మానందమును గూర్చు మయ్య! యనగ
నీవంటి మూర్ఖుల న్నేను గాచుట కల్ల
మారాడకుండగా మరలిపొమ్ము
ఆ.వె. తొలగు మనుచు స్వామి పలుకంగ నోదేవ!
మరచినాడ నిన్ను మారుమారు
దయను జూపవయ్య! తప్పకుండగ నీదు
వ్రతము చేయువాడ వైభవముగ.                                       ౧౦.

శా.    నీమాహాత్మ్యము బ్రహ్మరుద్రులు, సురల్ నిష్ఠాగరిష్ఠాత్ములౌ
నా మౌనీంద్రులు సైత మెంచగలరా? యానందసంధాయకా!
స్వామీ! కరుణామయా! సకలదా! సత్యస్వరూపా! హరీ!
యీ మూఢాత్ముని నన్ను గావుము ప్రభూ! యిప్పట్టునన్ మాధవా!౧౧.
దండకము
శ్రీసత్యనారాయణా! సచ్చిదానందరూపా! సమస్తాసంహారకా! దేవ! వైకుంఠవాసీ! కృపాళూ! రమాసంయుతా! శార్ఙ్గి! సర్వార్థసంపత్ప్రదా! భక్తరక్షారతా! సజ్జనానందసంధాయకా! వేదవేద్యా! మహత్సౌఖ్యకారీ! సురేంద్రాదిసర్వామరశ్రేణి నీపాద పద్మద్వయిన్ సంతతానందసంయుక్తులై యర్చనల్ సేయు భాగ్యంబునందంగ సర్వప్రయత్నంబులన్ జేతు రెల్లప్పుడున్, నీదయాదృష్టి కాంక్షించి బ్రహ్మాదు లత్యంత నమ్రాంగులై  గొల్తు రేవేళ, యోగీంద్రులున్, మౌనులున్ దేవసంఘంబులున్ నీ మహత్త్వంబు వర్ణింపగా లేరు నిన్నెంచ నేనెంతవాడన్? మహామూర్ఖుడన్, శుద్ధమూఢాత్ముడన్, స్వార్థభావైకచిత్తుండ, ద్రవ్యప్రధానుండ, సామాన్యుడన్, మర్త్యుడన్ తొల్లి దారిద్ర్యసంతప్తులైయున్న యాబ్రాహ్మణున్, కాష్ఠవిక్రేతనున్ భాగ్యమందించి కాపాడినా వాధరాధీశు నుల్కాముఖాఖ్యున్ సుసంతానసౌభాగ్యసంపత్ప్రభావాన్వితుం జేయుటే కాదు సంతానహీనుండనైయున్న నాయందు కారుణ్యమున్ జూపుచున్ పుత్రికారత్న మందించినావయ్య, యద్దానికిన్ యోగ్యుడౌ లక్షణాఢ్యున్ ప్రసాదించి, ప్రాణేశుగా జేసి సంతోషమందించి, సర్వార్థముల్ గూర్చి యున్నావు, వైకుంఠవాసీ! జగద్బాంధవా! సత్యదేవా! జగన్నాథ! సంతానకాలంబునన్ నిన్ను పూజించలేనైతి, పుత్రీవివాహంబునందైన ధ్యానించబోనైతి గర్వాంధుడన్, మత్తుడన్, సత్యదూరుండ, నజ్ఞానినై నిన్ను దూషించి యున్నాడ నోదేవ! మన్నించవయ్యా! ప్రభూ కాదు పొమ్మన్న నన్బ్రోచువారెవ్వరయ్యా! దయాసాగరా! నీదయం జూపవయ్యా! వ్రతం బిప్పుడే మద్గృహం బేగి నేజేసెదన్  బాంధవానీకముం  గూడి నైర్మల్యభావంబుతో దోషముల్ సైచి మన్నించి రక్షించవయ్యా! జగద్రక్షకా! భుక్తిముక్తిప్రదా! దేవదేవా! నమస్తే నమస్తే నమస్తే నమ:                                                                               ౧౨.
ఆ.వె. బహువిధంబులిట్లు వైశ్యుండు ప్రార్థింప
సత్యదేవు డపుడు సంతసించి
ముదము నందుమోయి మొదటి నీసంపదల్
పొంది వత్స! సుఖము లందుమోయి!                                ౧౩.

ఆ.వె. అనుచు పలికి యప్పు డదృశ్యుడై పోవ
శ్రేష్ఠి నావకడకు చేరి యందు
రత్నరాశి జనిత రమ్యత్వముం గాంచి
యంతులేని హర్షమంది యంత.                                        ౧౪.

ఆ.వె. సత్యదేవు మహిమ నత్యున్నతంబుగా
భావనంబు చేసి భక్తితోడ
మనములోన ప్రణతు లనుపమంబుగ జేసి
జాగులేక యింటి కేగ దలచి.                                             ౧౫.

సీ.     జామాతతో బల్కె శ్రీమంతుడా! యిప్పు
డింటి కేగుట యుక్త మెంతయేని,
జాగు చేసితి మేని సత్యదేవుని మాట
మరచిపోవుచునుంటి మెరుగనట్లు,
తీర్థయాత్రలు చాలు వ్యర్థంబుగా కాల
యాపనం బొనరించు టనుచితంబు,
వ్రతము చేయుట ముఖ్య మతులాదరముతోడ
నస్మదీయుల గూడి యందువలన
ఆ.వె. వెళ్లవలయు నిపుడు వేగంబుగా నంచు
వైశ్యుడాడ నతడు వల్లె యనియె,
నౌకసాగె నపుడు నవ్యతేజంబుతో
రత్నపురము వైపు రయముతోడ.                                        ౧౬.

సీ.     ఆరీతి నావతో వారేగుచుండంగ
నల్లంత దూరాన నాత్మపురము
కాన్పించగా జూచి కరము సంతసమంది
యల్లున కెరిగించి యరయు మనుచు
నొకదూత నీక్షించి యొప్పుగా నీవిప్పు
డీమార్గమున బోయి యింటి కేము
వచ్చుచుండెడి వార్త మెచ్చంగ నందించు
మేము చేరగవత్తు మింతలోన
తే.గీ. అనుట నాదూత గృహమేగి యచట గాంచె
వైశ్యునర్థాంగి, కొమరిత భక్తితోడ
సత్యదేవుని వ్రతమును జరుపు విధము
భక్తి ప్రణమిల్లి మగవారి వార్త దెలిపె.                                     ౧౭.
కం.   లీలావతి సుతతో ననె
బాలా! నావెనుక రమ్ము భగవత్పూజా
కాలము ముగిసిన పిమ్మట
నాలాగున నేగుచుంటి నాథుని కడకున్.                               ౧౮.
ఆ.వె. అట్లు తల్లి యేగ నాకళావతికూడ
పూజనెట్టులేని పూర్తి చేసి
తీసుకొనుట మాని తీర్థప్రసాదాలు
విభుని జూడగోరి వేగ మరిగె.                                            ౧౯.
సీ.     ఆగ్రహించిన దేవు డానౌక నల్లునిన్
ముంచి వేసెను నీట మూర్ఖులనుచు,
వైశ్యు డయ్యది గాంచి భార్యతో తనయతో
శోకసంతప్తుడై స్రుక్కి యుండ
నాకళావతి యప్పు డాత్మనాథుడు లేక
జీవనం బొకయింత చేయలేక
పెనిమిటేగిన దిక్కు ననుగమించుట యుక్త
మనుచు నిశ్చయమూని యనుమతిగొని
తే.గీ. భర్తృపాదుకలను గొని భక్తితోడ
శిరముపై దాల్చి శీఘ్రంబు పరము జేర
జలములో దూక యత్నంబు సలుపుచున్న
తనయ గాంచిన వైశ్యుండు తలచె నిట్లు.                               ౨౦.
తే.గీ. అల్లుడీరీతి నీటిలో నణగిపోవు
కారణం బేమియును సుంత కానరాదు
నావ మునుగుట కాజగన్నాథుడైన
కమలనాభుని మాయయే కారణంబు.                                  ౨౧.
తే.గీ. కాన యిటనుండి యించుక కదలరాదు
ప్పుడే చేతు వ్రతరాజ మిక్కడనుచు
భక్తి యుతుడౌచు  నిర్మలభావదీప్తి
సత్యదేవుని పలుమారు సన్నుతించె.                                   ౨౨.
కం.   దేవా! యేయే వేళల
నేవిధమగు మాయజూపి యిలవారలకున్
భావావేశము గూర్తువొ
తావక మహిమలను దెలియ దరమా మాకున్.                         ౨౩.
తే.గీ. కావగాదగు మముబోంట్ల కరుణతోడ
సత్యనారాయణా! దేవ! సన్నుతింతు
ననుచు వైశ్యుండు మ్రొక్కంగ నంబరంబు
నుండి మాటాడె హరియు తానండయగుచు.                         ౨౪.
తే.గీ. వినుము వైశ్యుడ! నీపుత్రి మనమునందు
శ్రద్ధనూనక పూజావసానమందు
భక్తితో జేయక ప్రసాదభక్షణంబు
ప్రాణనాథుని గాంచగ వచ్చె నిటకు.                                    ౨౫.
సీ.     భర్తపోయినచోటు కార్తితో దానేగ
వలసిన పనిలేదు భక్తులార!
నామాయగా నెంచు డేమాత్రమును దు:ఖ
మందంగ వలదంచు నంబరాన
సత్యదేవుని పల్కు లత్యంత హర్షంబు
గూర్చ వైశ్యుని పుత్రి కూర్మితోడ
తనయపరాధంబు మనములో గ్రహియించి
శ్రీఘ్రమే పరుగుతో చేరి గృహము
తే.గీ. దేవదేవుని భక్తితో స్థిరమతియయి
మ్రొక్కి తీర్థప్రసాదముల్ ముదముతోడ
తాను భక్షించుటే కాదు మానితముగ
భక్తజనులకు బంచె నా బంధువులకు.                                 ౨౬.
తే.గీ. సత్యనారాయణా! దేవ! సన్నుతాంగ!
దీనజనపాల! విశ్వేశ! దివ్యచరిత!
కామితార్థద! కారుణ్యధామ! శౌరి!
నిత్యకల్యాణదాయకా! సత్యమూర్తి!                                  ౨౭.
కం.   అనుచు కళావతి వెన్నుని
నతను స్మరియించుచుండి క్రమముగ జననీ
జనకుల కడగేగి యటన్
తనభర్తను గాంచగలిగె దైత్యారి కృపన్.                              ౨౮.
కం.   అందరు సంతస మందిరి
వందనములు చేసి యపుడు వైకుంఠునకున్
మందిర నిభమగు గృహమున
కందంబుగ చేరదలచి రాసమయమునన్.                           ౨౯.
సీ.     ఆశ్రేష్ఠి తనయల్లు, నర్థాంగి, పుత్రికన్
ప్రేమతోడుత గాంచి ప్రియముమీర
పలికె నీరీతిగా పలుతలంపులు వద్దు
వైభవంబుగ నేడె వ్రతము మనము
చేయంగ వలెనిందు సేవించవలె ముందు
సత్యనారాయణున్ సర్వగతుల
జాగు చేసితిమేని స్మరణశక్తి నశించు
కదలరా దిటనుండి కమలనాభు
ఆ.వె. పూజ ముగియువరకు పోజెల్ల దనిపల్క
వల్లె యనుచు వార లెల్లరంత
యుత్సహించి యప్పు డుదధితీరంబందు
నిలిచియుండి రెంతొ నిష్ఠబూని.                                         ౩౦.
సీ.     తాటియాకుతోడ దీటైన పందిళ్ళ
నిర్మాణ మొనరించి నియతితోడ
అరటి తోటకుబోలె యాప్రాంతమందంత
నరటియాకులు తెచ్చి యతికి పిదప
ఐదురంగులతోడ నలరారు చూర్ణాల
మ్రుగ్గులు పెట్టించి ముదముతోడ
బంధువర్గమునంత వరుసగా బిలిపించి
బ్రాహ్మణాదేశంబు బడసి యంత
ఆ.వె. భక్తిభావమలర శక్తికందిన యంత
వస్తుతతిని గూర్చి వైభవముగ
సత్యదేవు వ్రతము సమ్యగ్విధానాన
నాచరించె నాత డనుపమముగ.                                         ౩౧.
ఆ.వె. భక్తియుక్తుడౌచు భక్తకోటికి తీర్థ
వితరణంబు చేసి విస్తృతముగ
ధనము నందజేసి ధరణిసురావళిం
దనియ జేసి పంపె నతరముగ.                                      ౩౨.
ఆ.వె. ధన్యుడయ్యె నతడు మాన్యుడై వెలుగొంది
బ్రతికియున్న వరకు భక్తితోడ
మాసమాసమందు మరువకుండగ సత్య
దేవువ్రతము చేసి దీప్తులొలుక.                                        ౩౩.
కం.   ఒకసారి వ్రతము చేయగ
రకరకముల పాట్లు పడిన తనాలనరుం
డకటా! జీవన మంతయు
సకలావనదక్షు గొలిచె సత్యప్రభునిన్.                                  ౩౪.
కం.   ఆవైశ్యుడు వ్రతమహిమను
శ్రీవిభు శ్రీ సత్యదేవు చేరెను తుదకున్
హేవిజ్ఞులార! యంచును
ధీవైభవమొప్ప సూత ధీమణి తెల్పెన్.                                ౩౫.
నాలుగవ అధ్యాయము సమాప్తము.





No comments:

Post a Comment