శ్రీసత్యనారాయణ
వ్రతకథ
(తెలుగు పద్యకావ్యము)
మూడవ అధ్యాయము
కం.
శ్రీసత్యదేవు
వ్రతమును
చేసిన మరియొకరి కథను చెప్పెద ఘనులౌ
నో సంయములారా! యని
యాసూతుడు పల్కె నిట్టు లాదరమొప్పన్. ౧.
మ. కలడుల్కాముఖుడన్నరాజు ప్రజలన్ కారుణ్యపూర్ణాత్ముడై
పలుమార్గంబుల కన్నబిడ్డలవిధిన్
పాలించి రక్షించుచున్
కలలోనైనను కీడొనర్చగ మదిన్ కాంక్షించ కెల్లప్పుడున్
నిలిపెన్ ధర్మము నాల్గుపాదములుగా నిష్ఠాగరిష్ఠుండనన్. ౨.
సీ.
ఇంద్రియంబుల గెల్చి యినుమడించిన దీప్తి
సత్యవాక్పాలుడై నిత్యమలరు,
విప్రోత్తముల గొల్చి విస్తృతంబగు రీతి
సన్మానములు చేసి సంతసించు,
దైవసన్నిధి జేరి దేవాలయంబులో
నర్చనల్ జరిపించు ననుదినంబు,
సత్సంగమును బొంది సర్వకాలములందు
హితవాక్యముల నెన్నొ యతడు వినును
ఆ.వె.
ధర్మవిభుడవంచు ధరవారలందరు
కీర్తనంబు చేయ నార్తి నణచి
రాజ్యపాలనంబు రమ్యంబుగా చేయు
చుండి యశము లందె మెండుగాను. ౩.
తే.గీ. దాన నొకనాడు సంతానహీను డగుట
భాగ్యముల పంట తనధర్మపత్నితోడ
చేరి భద్రశీలానదీ తీరమందు
సత్యదేవుని వ్రతమును జరుపసాగె. ౪.
తే.గీ. అరటిబోదెల పందిళ్ళు, నందమొలుకు
రంగవల్లులు, వాద్యాల రమ్యనినద
మౌర! కాంచంగ నానదీతీరభూమి
యిలను వైకుంఠతుల్యమై వెలుగుచుండె. ౫.
సీ.
ఆనదీమార్గాన యానంబు చేయుచు
వ్యాపారకాంక్షియౌ వైశ్యు డొకడు
బహుమూల్యదములైన వజ్రవైడూర్యాది
నవరత్నయుతమైన నావతోడ
చరియించు వేళలో నరపతి తటముపై
వైభవంబుగ జేయు వ్రతము జూచి
పడవనాతీరాన బంధించి పైకేగి
పూజావసానాన పుడమిమగని
ఆ.వె. నడిగె నిట్లు రాజ! యన్యథా తలపక
సందియంబు దీర్చ మందు నిన్ను
స్వామి నితని గొలువ నేమేమి సిద్ధించు?
నేమిటార్య! నీదు కామితంబు? ౬.
కం.
అనియడిగిన నరపతి యనె
వినుమో వైశ్యాగ్రగణ్య! వినయాన్విత! యీ
ఘనచరితుడు
నారాయణు
డనుమానము లేక యొసగు నఖిలసుఖంబుల్. ౭.
తే.గీ. సత్యనారాయణాఖ్యమౌ సద్వ్రతంబు
పరమహర్షాన నొనరించు భక్తతతికి
కలుగు సంతానభాగ్యంబు తొలగు దు:ఖ
మాచరించుచు నున్నాడ నందువలన. ౮.
తే.గీ. అనిన వ్యాపారి మనములో తనకుగూడ
కాంక్ష చేరగ సంతతి కలిగెనేని
తాను నద్దాని జేసెద తప్పననుచు
క్షితిపు ముందట భక్తితో ప్రతినబూనె.
౯.
ఆ.వె. ఉరుగుణాఢ్యుడౌచు నుల్కాముఖుం డట్లు
వ్రతము చేసి మేటి సుతులగాంచి
సకలసుఖములంది సత్యదేవుని పూజ
మరువకుండ చేసి హరిని జేరె. ౧౦.
శా.
వ్యాపారంబు ముగించి చేరి గృహమున్ భద్రాపగా
భూమిపై
భూపేశుం డొనరించియున్న వ్రతమున్, భూనాథు పుత్రేచ్ఛ, తా
నాపుణ్యాత్ముడు తన్ను జేయుమనుటల్ హర్షాతిరేకంబుతో
నో పద్మాయతనేత్రి! యంచు సకలం బుత్సాహియై పత్నికిన్. ౧౧.
ఆ.వె. విస్తరించి చెప్ప వేగంబుగా నంత
పతియె దేవుడంచు సతము దలచు
శీలసద్గుణాఢ్య లీలావతీ తన్వి
ముదము చెందె మిగుల హృదయమునను. ౧౨.
ఆ.వె. భార్యతోడ గూడి పరమహర్షంబుతో
కాలమెంతొ ప్రీతి గడుపుచుండ
భర్తృయుక్తచిత్త భాగ్యప్రదాతయౌ
నతని ధర్మపత్ని కపుడు కనగ. ౧౩.
ఆ.వె. సత్యదేవు కృపను సంతోషదంబౌచు
గర్భధారణంబు క్రమత జరిగె
మాసనవక మేగ మంచికాలంబున
దశమమాసమందు తనయ కలిగె. ౧౪.
కం. దినదిన వృద్ధిని
బాలిక
యనుపమమగు దీప్తిగలిగి యా శశిపగిదిన్
దినమొక కళతో బెరుగుచు
జనులకు తా గూర్చుచుండె సంతోషంబున్. ౧౫.
ఆ.వె. రోజుకొక్క కళను రాజిల్లు చుండుటన్
బంధుజనులు, హితులు, బ్రాహ్మణులును
ఠీవిగల్గు నా కళావతీనామంబు
నొసగినారలప్పుడుత్సవముగ. ౧౬.
కం.
కన్యారత్నము గలుగగ
నన్యోన్యము వారలెంతొ హర్షముతోడన్
ధన్యులమైనా మంచును
మాన్యత్వము బొంది రాసమాజము నందున్. ౧౭
ఆ.వె. నామకరణమయ్యె నామెయు భక్తితో
సత్యదేవు వ్రతము జరుపవలయు
ననుచు చెంతజేరి పెనిమిటితో దెల్ప
నాతడేమొ తలచి యనియె నిట్లు. ౧౮.
కం.
లీలావతి! నామాటల
నాలింపుము వరుని పాణినందినవేళన్
మేలుగ వ్రతముం జేసెద
మేలా త్వరపడెద విప్పు డీవిధి నీవున్? ౧౯.
కం.
అల్లుడె కాదిక బంధువు
లెల్లరు వచ్చెదరు గాన నిందునిభాస్యా!
యుల్లంబులలర నప్పుడె
చెల్లును చేయంగ వ్రతము చేసెద మనినన్. ౨౦.
ఆ.వె. వల్లె యనియె నామె వ్యాపారమును జేయ
నింటినుండి వెడలి యెంతయేని
దీక్షబూని చేరె దేశాంతరంబందు
విమలరత్నరాశి విక్రయించ. ౨౧.
ఉ. కోరికమీర వైశ్యుడిటు కూరిమితోడ ననేకదేశ సం
చారము చేసి, రత్నముల సంచులు మిక్కిలి విక్రయించి, వ్యా
పారము పూర్తిచేసుకొని, వైభవమొప్ప స్వకీయ గేహమున్
చేరిన మీద భార్య విభుచెంతను జేరి వచించె నీవిధిన్. ౨౨.
చం.
వినుమిది నాథ! నీవిపుడు వేగమె యోచనచేసి యంతటన్
మనసుత కీకళావతికి, మాన్యకు, యుక్తవయస్క, కీమెకున్
ఘనగుణశాలియౌ
వరుని, ఖ్యాతిగడించిన సుందరాంగునిన్,
వినయసుశీలసంయుతుని, విజ్ఞుని చూడగ యుక్తమౌనికన్. ౨౩.
సీ.
లీలావతీవాక్య మాలకించిన యాత
డానందభరితుడై యాత్మజాత
కనురూపగుణవయో ధనమాన యుతుడౌచు
వ్యాపారదక్షుడౌ వానికొరకు
దూతలం బంపించి జాతివారలలోన
వెతికించి యడిగించి విస్తృతముగ
కాంచనాఖ్యంబైన గ్రామంబునందున్న
వైశ్యాత్మజుని యోగ్యవరునిగాను
ఆ.వె. నిర్ణయించి శాస్త్రనియమాన్వితుండౌచు
బంధుజనులతోడ వైభవముగ
రయముమీర వరుని రప్పించి కన్నియన్
దానమిచ్చె సంతసాన నతడు. ౨౪.
కం.
వైవాహిక కార్యం బిటు
లావేళ సమాప్తమైన నానందముతో
నావైశ్యుడాత్మజాతకు
దీవెనలందించె భాగ్యదీప్తులు గలుగన్. ౨౫.
కం.
మరియాదలు బహువిధముల
జరిపించిరి, బంధుజనులు సచ్ఛుభకాంక్షల్
కరమందించుచు వారికి
నరుసం బొనరింపజేసి యరిగిన మీదన్. ౨౬.
ఆ.వె. ధర్మపత్నిగాని, తానైన వైశ్యుండు
కార్యమగ్నులౌచు తిరుగుచుండి
సత్యదేవుమాట స్మరియించ లేరైరి
నిజము మౌనులార! నిద్రనైన. ౨౭.
సీ.
సుందరాంగుడింక శుభలక్షణాఢ్యుడౌ
జామాతృసంగతిన్ సర్వగతుల
హర్షోదయంబైన నావణిక్శ్రేష్ఠుండు
హరికార్య మారీతి మరచి పిదప
యత్యాదరంబుతో నల్లునిం గొనియాడి
చేరె నాతనితోడ దూరదేశ
మాదట వ్యాపార మందునిందును జేయు
సంకల్పమును బూను సమయమందు
ఆ.వె. ఓరి మూర్ఖ! యనుచు నారాయణుం డప్డు
మాటదప్పి యతడు మసలు చుండ
దు:ఖ మొదవు గాత తోరంబుగా నంచు
శాప మిచ్చె మిగుల కోపగించి. ౨౮.
ఆ.వె. వ్రతము చేతునంచు ప్రతిన బూనినవాడు
కామితార్థసిద్ధి కలిగి కూడ
హరిని గొలుచుమాట స్మరియించకున్నచో
పాట్లు తప్పబోవు భాగ్యమణగు. ౨౯.
సీ.
శాపార్తుడైయున్న వ్యాపారి యటపైన
రత్నసాన్పురమందు రత్నములను
క్రయవిక్రయంబులన్ గావించగాబూని
నదిలోన నొకచోట నావనుంచి
వాణిజ్యకార్యంబు వరుస జేయుచునుండె
ద్విగుణితోత్సాహియై వివిధగతుల
అల్లుడాతనియందు నత్యాదరమునూని
సహకరించుచునుండె నహరహమ్ము
ఆ.వె. చంద్రకేతు వనెడు సార్వభౌముండందు
రాజ్యపాలనంబు రమ్యముగను
చేయుచుండి మిగుల శ్రేయంబులం గూర్చి
యవని నేలుచుండె నభయ మొసగి. ౩౦.
సీ.
ఒకనాటి నడిరేయి నుర్వీశుముందట
స్వప్నమందున నిల్చి చక్రధారి
యావణిగ్ద్వయముపై నాగ్రహించుట చేత
“నరనాథ! మేల్కొని యరయు మోయి,
నీరాజ్య మీవేళ చోరాశ్రయం బయ్యె
రాజకోశములోని రత్నతతుల
నపహరించినవార లరుగుచున్నారింక
నిద్రించగానేల? నీవు లెమ్ము,
తే.గీ. వారి ననుసరించి బంధించుటకుగాను
భటగణంబు బంపి వారలకును
తగిన శిక్షవేసి ధర్మంబు రక్షింపు
మాజ్ఞ యనుచు బలికె నద్భుతముగ. ౩౧.
తే.గీ. భగవ దాదేశ మారీతి యగుటచేత
ముందు వెనుకలు చూడక సందియంబు
నొందకుండగ నరనాథు డోర్వలేక
వారి నావేళ కొనిరాగ భటుల బంపె. ౩౨.
తే.గీ. వాసుదేవుని మహిమచే వారికపుడు
చోరు లిద్దరు కనుచూపు మేరలోన
నదిని జేరెడు మార్గాన నడుచుచున్న
విధము దోచగ వారిని వెంబడించి. ౩౩.
సీ.
ఆరాజభటులంత చోరానుగమ్యులై
యానదీతీరాన నాగియున్న
నావలో నిద్రించు నావైశ్యులం జూచి
వీరె చోరులటంచు జేరి యందు
రత్నరాశులు గాంచి రాజవిత్తంబుగా
నిర్ధారణము చేసి నిద్రలేపి
సంకెళ్ళు తగిలించి సంకోచ మొకయింత
చూపకుండగ నాత్మభూపుకడకు
తే.గీ.
తీసుకొనిపోయి కనవలె దేవ! తమరు
వీరె చోరులు, ధనమిదె, వీరికి తగు
దండనం బీయవలె నన్న ధరణివిభుడు
చీకటింటను బంధింప జెల్లు ననియె. ౩౪.
కం.
వారట్టులు భగవానుని
తోరపుటాగ్రహము వలన దు:ఖాన్వితులై
చేరిరి కారాగృహమున
కారణము గ్రహించలేక కర్మానుగులై. ౩౫.
సీ.
ఆరత్నపురిలోని వారి గేహమునందు
చోరప్రవేశంపు కారణాన
ధనరాశులేగాదు కనిన వస్తువులెల్ల
నపహరించిరి మ్రుచ్చు లంతెగాక
రోగజాలం బప్పు డాగకుండగ తల్లి
తనువునందున జేరి తాండవించ
మగదిక్కు లేమిచే పగలును, రాత్రియు
క్షణ మొక్క యుగముగా గడుచుచుండ
ఆ.వె. వస్త్రసుఖము లేక, భాగ్యమింతయులేక
తినుట కించుకైన తిండి లేక
తల్లి యాజ్ఞచేత తనయ కళావతి
భిక్ష మడుగుచుండె వీధులందు. ౩౬.
ఆ.వె. భాగ్యవశముచేత బ్రాహ్మణగృహములో
నొక్కపర్వమందు నుత్సవముగ
సత్యదేవు వ్రతము జరుగుచుండగ జూచి
పరవశించిపోయె పడతి యపుడు. ౩౭
ఆ.వె. దేవ! రక్షయనుచు తీర్థప్రసాదాలు
తాను తీసుకొనియు, తల్లికింత
చేతనంది గృహము చేరి నంతనె తల్లి
యెచట నుంటివనియె నింతదనుక? ౩౮.
ఆ.వె. ఇంతరాత్రి దనుక యీరీతి యెచ్చటో
తిరుగుటెల్ల మంచి సరణికాదు,
యౌవనస్థురాలవైనదానవు, నీదు
తలపు దాచకుండ పలుకు మనియె. ౩౯.
కం.
అమ్మా! సత్యవ్రతమట,
యమ్మాన్యుల గృహములోన నద్భుతరీతిన్
నమ్ముము జరుగుచునుండుట
సమ్మోదముతోడ నుంటి సాంతం బచటన్. ౪౦.
కం.
వేరొండు నాదు మనమున
చేరదు దుర్భావనంబు చేకొను మిదిగో
నారాయణతీర్థం బని
కోరిక తీరంగ నొసగె కూరిమి నిండన్. ౪౧.
తే.గీ. తాము సంతాన హీనులై స్వామి కృపను
తనను బొందిన విధమును తరుణమందు
సత్యదేవుని వ్రతమును జరుపకుండ
కాలయాపన చేసిన క్రమము నపుడు. ౪౨.
తే.గీ. తల్లి తెల్పి, కళావతి కుల్లమందు
నామె వరపుత్రియనుమాట లన్ని జేర్చి
కష్టమీరీతి తమకింత కలుగుటెల్ల
సత్యదేవుని యాగ్రహ జనితమనుచు. ౪౩.
కం.
అమ్మా! వరపుత్రిక వీ
వమ్మాధవు కరుణచేత నబ్బితివమ్మా!
సమ్మానమందుచుంటివి
సుమ్మా! యని పలికె తల్లి సుతకావేళన్. ౪౪.
ఆ.వె. స్థిరమనస్కయౌచు తీర్థప్రసాదాలు
స్వీకరించి నిలిచి శ్రీపతికడ
అర్థరాత్రమందు నవ్వైశ్యకులజాత
ప్రార్థనంబు చేసె భక్తితోడ. ౪౫.
తే.గీ. చక్రధర! దేవ! సంతతసౌఖ్యదాత!
సకలకల్మషహర! విభూ! సత్యమూర్తి!
శాశ్వతైశ్వర్యసంధాత! విశ్వవినుత!
నిర్మలాంగక! కేశవా! నీకు నతులు. ౪౬.
తే.గీ. సత్యనారాయణస్వామి! సాధుపక్ష!
మాధవానంత! శార్ఙ్గి! రమాసమేత!
దీనజనబంధు! సర్వేశ! జ్ఞానదాత!
నిత్యకల్యాణదాయక! నీకు నతులు. ౪౭.
మాలినీ
వృత్తము. సకలజగదధీశా! సర్వభక్తార్తినాశా!
ప్రకటితనిజకీర్తీ! భక్తహృచ్చక్రవర్తీ!
సకలశుభవిధాతా! సర్వసౌఖ్యప్రదాతా!
సకరుణ మముగావన్ సాగిరా రమ్ము దేవా!. ౪౮.
కం.
నీవే మాకాధారము
నీవే మము గావగలవు, నిను గొల్తుమికన్
గావుము మావారల, సుఖ
మీవే కరుణాంతరంగ! యెప్పటియట్లున్. ౪౯
కం.
మా మగవారల నింటికి
క్షేమముగా చేర్చుమయ్య! చిన్మయరూపా!
మామానస మలరించగ
నో మాధవ! సత్యదేవ! యున్నతచరితా! ౫౦.
కం. రేపే నీసద్వ్రతమును
శ్రీపతి! యో సత్యమూర్తి! చేసెదమయ్యా!
హే పరమదయామయ! విను
మా పొరపాటులను సైచి మము గావదగున్. ౫౧.
తే.గీ. అనుచు లీలావతీసాధ్వి తనయ గూడి
సచ్చిదానందరూపుడౌ సత్యదేవు
నమిత భక్తిని ప్రార్థించ నర్థరాత్రి
జాగుసేయక సాగెనా స్వామి యపుడు. ౫౨.
ఆ.వె. సత్యదేవు డపుడు చంద్రకేతుని జేరి
యాజ్ఞ యంచు బలికె నద్భుతముగ
విజ్ఞ! చంద్రకేతు! వినుము శ్రద్ధనుబూని
వారు చోరు లసలె కారు నిజము. ౫౩.
సీ.
కారా గృహంబందు కఠినదండనమంది
బంధింపబడినట్టి వైశ్యులధిప!
చోరులు కారయ్య వారు మద్భక్తులు
నాయాగ్రహముచేత నాడు నీకు
వశమైరి చౌర్యంబు వారెప్పుడును చేయ
రంతయు నామాయ యనుట నిజము
సన్మానయుతముగా సాగనంపుము వారి
నధిక విత్తంబిచ్చి యాదరమున
ఆ.వె.
అట్లు చేసెదేని యశమందగల వెందు
కాని యెడల బహుళ కష్టతతిని
స్వాగతించగలవు సర్వసంపత్తులు
నాశమొందు ననియె కేశవుండు. ౫౪.
ఆ.వె. స్వప్నమందు నిలిచి సత్యదేవుం డట్టు
లాజ్ఞ యిడుట చేత నధిపుడంత
ఘోరనరకతుల్య కారాగృహంబందు
చేరి దు:ఖమందు వారి నపుడు. ౫౫.
ఆ.వె. చేర బిలిచి యంత శిక్షకు సరియైన
కారణంబు నడిగి వారినుండి
కేవలంబు జూడ దేవుని మహిమగా
తెలిసి సంతసించి పలికె నిట్లు. ౫౬.
సీ.
వైశ్యబాంధవులార! భగవదాజ్ఞను బూని
శిక్షించి యున్నాడ చిరము మిమ్ము,
స్వామిభక్తులు మీరు, సత్యదేవుని దూత
లంచు స్పష్టంబయ్యె నబ్బురముగ
ద్విగుణీకృతంబైన విత్తంబు గొనుడంచు
రత్నాల సంచుల రాశి బోసి,
విలువైన బహువిధ పీతాంబరము లిచ్చి
మోదమందుచు వారి నాదరించి
ఆ.వె. విష్ణు భక్తులనుచు వేవేల ప్రణతుల
నర్పణంబు చేసి యధిక భక్తి
మహితమైన యట్టి మంగళవాద్యాలు
మ్రోగుచుండ నపుడు సాగనంపె. ౫౭.
ఆ.వె. అనుచు చెప్పె సూతు డాశౌనకాదులౌ
మునుల కపుడు దివ్య వనమునందు
నైమిశంబు నందు నైష్ఠికుండై నిల్చి
సత్యదేవు మహిమ సంతసమున. ౫౮.
మూడవ అధ్యాయము సమాప్తము.
No comments:
Post a Comment