శ్రీసత్యనారాయణ
వ్రతకథ
(తెలుగు పద్యకావ్యము)
ఐదవ అధ్యాయము
కం.
శ్రీకరమౌ సత్యవ్రత
మేకాలము చేసి యందె నిహపరసుఖముల్
మీ కా తుంగధ్వజు కథ
చేకొని వివరింతు వినుడు స్థిరమతులగుచున్. ౧.
ఆ.వె. అనుచు చెప్ప దొడగె నాసూత మౌనీంద్రు
డందమైన ఫణుతులందులోన
రంగరించి యపుడు తుంగధ్వజోదంత
మినుమడించు శ్రద్ధ మునుల కపుడు.
౨.
సీ.
తొల్లి రాజన్యుడౌ తుంగధ్వజాఖ్యుండు
క్షత్రియోచితమైన మైత్రితోడ
ప్రజలె బిడ్డలటన్న భావంబుతో రాజ్య
పాలనంబును జేసి ప్రజలకెప్పు
డభయంబు నందించి యండగా నిలుచుచు
సర్వకాలములందు సాకుచుండు,
శతపుత్రసహితుడై సన్మార్గగామియై
యిలపైన సుఖశాంతు లలమజేయు
ఆ.వె. మమతబంచు వాడు, మారక్షకుండంచు
విస్తృతాదరమున విశ్వసించి
చింతలేక జనులు జీవించుచుండగా
భవ్యయశముతో నృపాలుడలరు. ౩.
సీ.
ఒకనాడు నరనాథు డుత్సాహభరితుడై
వేటాడ గాంక్షించి విపినమేగి
మృగము లెన్నింటినో తెగటార్చి పురమేగు
చుండగా త్రోవలో నుత్సవముగ
బిల్వపత్రపు ఛాయ విమలాంతరంగులై
సద్భక్తియుక్తులై సత్యదేవు
వ్రతము యాదవముఖ్యు లతుల హర్షముతోడ
చేయుచుండగ జూచి చేరకుండ
తే.గీ.
ప్రణతులైనను చేయక భావమందు
సార్వభౌమత్వ ఛాయలు, గర్వరేఖ
పొటమరించంగ హృదిలోన భూపతినని
యూహచేయుచు కిమ్మనకుండె నతడు. ౪.
తే.గీ.
సజ్జనుండయ్యు సన్మార్గచరుడునయ్యు
కర్మవశమున మత్సరగ్రస్తుడయ్యె
ఔర! నరపతి కాంచుడా యబ్బురంబు
ఎప్పుడేమౌనొ యెవ్వరు చెప్పగలరు. ౫.
తే.గీ.
గౌరవముతోడ నా గొల్లవారలపుడు
వ్రతము ముగిసిన పిమ్మట రాజు జేరి
మోదయుతులౌచు తీర్థప్రసాదములను
స్వీకరించంగ ప్రార్థనం జేయ నృపుడు. ౬.
సీ.
గొల్లవారలు వీరు, గోపాలకులు గాన
కొల్చిన దైవంబు గొల్లవాడె,
సార్వభౌముడ నేను సంరక్షకుడగాన
దీనిని ముట్టంగ లేనటంచు
విధిమాయ నాతండు విజ్ఞత గోల్పోయి
స్వీకరించెడి మాట లేక యప్పు
డాప్రసాదము వీడి యచ్చోట నిలువక
పురికేగి చూడగా పుత్రశతము
ఆ.వె. ప్రాణహీనులైరి, రాణివాసంబంత
శోకమగ్నమయ్యె, సుఖము లుడిగె,
మనము తప్తమయ్యె, ధనరాశులన్నియు
నపహరించబడియె నక్కజముగ. ౭.
సీ.
భూనాథు డారీతి పుత్రాదిసంపత్తు
లణగిపోవుటచేత నార్తుడయ్యు
విజ్ఞసత్తముడౌట స్వీయాపరాధంబు
గ్రహియించి యద్దాని కారణంబు
సత్యదేవుండంచు సర్వేశు డాతండె
దిక్కు నాకని నమ్మి మ్రొక్కి యపుడు
భక్తియుక్తుండౌచు వ్రతము చేయగ నెంచి
వనమధ్యమందున్న వారి కడకు
ఆ.వె.
త్వరితగతిని జేరి కరుణజూపుడు మీరు
యాదవేంద్రులార! యాప్తులార!
సత్యదేవపూజ జరిపించి నాచేత
నన్ను గావు డనియె నమ్రుడౌచు. ౮.
సీ.
గోపాలు రావేళ మాపూర్వపుణ్యంపు
మహిమచేతనె గాదె మమ్ముజేర
వచ్చె నీతండంచు నచ్చంపు భక్తితో
కల్పోక్తమై యొప్పు క్రమములోన
సత్యదేవుని పూజ నత్యంత హర్షాన
పూర్తి చేయించగా భూపుడపుడు
విమలసద్భక్తితో వినయాన్వితుండౌచు
సత్యప్రసాదంబు సంతసమున
ఆ.వె. తాను స్వీకరించి తనవారి కొకయింత
చేతబూని పురము చేరి యచట
పుత్రశతము మరియు పూర్వవైభవ మంత
పొంది భవ్యయశము లందుకొనియె. ౯.
తే.గీ. బ్రతికి యున్నంతకాలమం దతడు సతము
సత్యదేవుని వ్రతమునె సర్వగతుల
శ్రేష్ఠమని నమ్మి, చేయుచు స్థిరయశంబు
లంది యిహమున, పరమున హరిని జేరె.
౧౦.
సీ.
తానొక్కడేగాక తనరాజ్యమందంత
సత్యనారాయణస్వామి మహిమ
వాడవాడలలోన భక్తబృందము బంపి
వివిధరీతులలోన విస్తృతముగ
తెలియజేయుటె కాదు, యిలలోన నిత్యంబు
పూర్ణిమైకాదశీ పర్వవేళ
వ్రతములు జరిపించి ప్రజలకందరి కెంతొ
హర్షంబు చేకూర్చి యశములందె
తే.గీ. పౌరు లెల్లరు నరనాథు కారణమున
సత్యదేవుని భక్తులై, సన్మతులయి
నిత్య మాదేవు మహిమలు నిష్ఠబూని
తలచు చుండుట సర్వథా ధన్యులైరి.
౧౧.
సీ.
వ్రతము లన్నింటిలో వసుధాస్థలంబందు
కలియుగంబున భవ్యఫలద మగుచు
విలసిల్లు శ్రీసత్యవిభుని సద్వ్రత మెవ్వ
రాచరింతురొ వారి కఖిల సుఖము
లబ్బుచుండుటె గాదు, హర్షంబుతో నెవ్వ
రీవ్రతాఖ్యానంబు లెల్లవేళ
వినుచుందురో వారు ధనధాన్యసంపత్తు
లందుచుందురు సత్య మనుదినంబు
తే.గీ. పేదవారలు ధనవంతు లౌదు రికను,
బంధనోన్ముక్తులౌదురు బంధయుతులు,
భయము తొలగును, సంతాన భాగ్య మబ్బు
సర్వవిధముల ప్రాప్తించు సద్యశంబు.
౧౨.
ఆ.వె.
దు:ఖనాశ మగును, తోరంబుగా హర్ష
మొదవుచుండు, నిత్య ముత్సవంబు
లందుచుండు జనుల కనుమాన మింకేల
సతము సత్యదేవు వ్రతము వలన ౧౩.
ఆ.వె. విష్ణుమూర్తి భువిని వివిధరూపము లంది
పిలిచినప్పుడెల్ల పలుకుచుండు,
కలియుగంబులోన తలచిన మాత్రాన
సత్యదేవుడొకడె సాకువాడు. ౧౪.
ఆ.వె. సత్యదేవు డండ్రు, సత్యనారాయణుం
డండ్రు, సత్యమూర్తి యండ్రు భువిని
ప్రజలు భక్తితోడ బహువిధనామాల
పిలుచుచుంద్రు హరిని కలియుగాన.
౧౫.
ఆ.వె. వ్రతము చేయ గలుగు భాగ్యసంపత్తులు
శక్తిలేనివారు శ్రద్ధతోడ
కనినగాని, నిలిచి కథను విన్ననుగాని
పొందగలరు సుఖము లెందునైన. ౧౬.
ఆ.వె. అనుచు బలికె సూతు డాశౌనకాదులౌ
మునిగణంబుతోడ మున్ను నైమి
శంబునందు, వారు సానందచిత్తులై
భక్తి జేసి రపుడు ప్రణతిశతము.
౧౭.
సీ.
హరివంశజలధిలో నమృతాంశునిభుడౌర!
వేంకటేశ్వరశర్మ విజ్ఞవరుడు,
సద్గుణంబులరాశి, సన్మార్గవర్తియై
సామ్రాజ్యలక్ష్మి యాసాధ్వి యలరు,
వారి పుత్రులలోన వరుస గనిష్ఠుండు
సత్యదేవుని బంటు సద్గుణుండు
సత్యనారాయణుం డత్యంత హర్షాన
సత్యదేవునిదయా సముదయమున
ఆ.వె. ననువదించినాడు వినయాన్వితుండౌచు
సత్యదేవు కథను శ్రద్ధబూని,
భక్తితోడ దీని బఠియించువారి కా
సత్యదేవు డొసగు సంతసంబు. ౧౮.
ఐదవ అధ్యాయము సమాప్తము.
No comments:
Post a Comment