Monday, 18 April 2022

గోంగూర

 

లింగాకారము దాల్చిన

యంగజహరుడైన శివున కరయ సముండున్

సంగీతతుల్య మట్టులె

గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 1.

 

శృంగారతుల్య రసమును

రంగులహోళీని బోలు రమ్యసుపర్వం

బంగనకు దూగు హితకరి

గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 2.

 

గోంగూర యాంధ్రమాతయు

గోంగూరయె రుచ్యతరము కువలయమందున్

గోంగూరలేహ్య మతులము

గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 3.

 

గోంగూర యున్న చాలిట

నంగనలకు వేరొకండు నవసర మగునే

సంగతమగు పాకంబున

గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 4.

 

బెంగాలున నాంధ్రంబున

రంగూనున నైనగాని బ్రహ్మాండమునన్

మంగళకరమగు రుచిగల

గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే? 5

వాస్తవము

 

వాస్తవము

మ.

ధరపై జన్మము మానవాళికి గనన్ దథ్యంబుగా నెంతయో

స్థిరపుణ్యంబును జేసియుండ గలుగున్ శ్రీమంతమౌ దేవతా

కరుణాసంఘముచేత, నిక్కముగదా! కళ్యాణముల్, హానులున్,

వరసౌఖ్యంబులు నబ్బుచుండు నిచటన్ భాగ్యానుసారంబుగన్                        1.

మ.

జననం బందుట జీవితాశయములన్ సంకల్పమం దుంచుటల్,

ఘనతన్ బొందుట, కామితార్థములకై కార్యంబులన్ సల్పుటల్,

మనగా యత్నము చేయుచుండుటలు, సన్మార్గంబునన్ నిల్చుటల్,

కొనుటల్ మృత్యువు, దైవనిర్ణయములై కూడున్ ధరిత్రీస్థలిన్.                          2. 

ఉ.

నాటకరంగతుల్య మిది నమ్ముడు జీవన, మిందు జీవి కా

మేటి మహత్వదర్శకు డమేయ వసుప్రదుడైన దైవ మే

పాటిగ పాత్రలన్ దెలుపు వానికి కాలము చెల్ల దేహు లీ

దీటగు కాయమున్ విడుట, దీప్తి త్యజించుట సంభవించెడిన్.                        3.

ఉ.

అన్నలు, దమ్ములున్, పడతి, యాత్మజులున్, జనకుల్, స్వకీయులున్,

మన్నన లందజేయుచును మైత్రిని జూపు హితైషి వర్గముల్

క్రన్నన దూరమౌదు రిట గాయము కూలగ, నాదియన్న దే

మున్నను వెంటరా దనుట యొప్పగు వాక్యము లోకమందునన్.                      4.

ఉ.

సత్యము కాదు జీవితము, సౌఖ్యనికాయము, బాంధవత్వముల్

నిత్యము కావు, నష్టమగు, నిక్కము, దీని నెరుంగలేక తా

నత్యతిమోహముం గొని యహర్నిశ లిచ్చట దేహధారి సాం

గత్యము శాశ్వతం బని యకారణ బంధము దాల్చు నీ యిలన్.                        5.  

 

శ్రీ శు భ కృత్ నా మ సం వ త్స ర ము న కు స్వా గ త ము

 

శ్రీ శు కృత్ నాసంత్సముకు స్వా ము

శా.    శ్రీమంతంబయి సౌఖ్యదాయకముగా చిద్భావమున్ నింపుచున్

క్షేమాకారము దాల్చి వత్సలతతో శ్రీలన్ బ్రసారించుచున్

బ్రేమన్ బంచుచు స్వీయ యానమున సద్విశ్వాసమున్ బొందుచున్

నామౌన్నత్యము గాంచె తాను "శుభకృ"న్నామాబ్ద మన్నింటిలోన్.             1.

మ.    "శుభకృ"న్నామక భవ్యవత్సరమిటన్ శుద్ధానురాగమ్ముతో

విభవంబుల్ ధరవారి కెల్లగతులన్ విస్తారరూపంబుగా

బ్రభవించం దగు సవ్యమార్గగతులన్ బ్రహ్మాండభాండంబునం

దభయం బంచు ఘటింప జేయునదియై యందెన్ సువిఖ్యాతులన్.                 2.

చం.   రతమహీస్థలంబుపయి భవ్యములై వెలుగొందు పద్ధతుల్

సురుచిరభావదీప్తియుత సుందరకర్మము లాచరించు స

ద్వరగుణసంచయంబులను దాను ఘటింపగ జేయునంచు శ్రీ

కర"శుభకృత్తు"పొందినది ఖ్యాతి యనంతము గాగ పూర్వమున్.            3.

శా.    కృత్యంబుల్ మనుజాళి కేయెడల వక్రీభూతదుస్సత్వముల్

నిత్యంబున్ గలిగింప జేయని గతిన్ నిష్ఠామహత్వంబుతో

వ్యత్యాసంబును జూపకుండ "శుభకృ"ద్వర్షంబు హర్షస్థితిన్

బ్రత్యక్షం బొనరించ గల్గు క్రమతన్ వాసిన్ గనెన్ ధాత్రిలోన్.                   4.

శా.    నానాసస్యసమృద్ధి యన్నియెడలన్ నవ్యోరుసత్వంబుతో

నీనేలన్ బ్రభవింపజేయుటకునై యింపారు భావంబుతో

దానిచ్చోటకు వచ్చుచుండు "శుభకృ"ద్భవ్యాబ్ద ముత్సాహియై

దీనోద్ధారక విష్ణుతుల్య యగుచున్ దివ్యప్రకాశమ్ముతోన్.                              5.

మ.    హినీరీతి యశంబు గాంచు "శుభకృ"న్మాన్యాబ్ద మాత్మీయస

న్మహనీయత్వము జూపి సౌఖ్యచయ సమ్పచ్ఛక్తులన్ నింపి తా

నిహమం దాయత హర్షము న్నిలుపగా నేతెంచె, సద్భావనా

సహితా! స్వాగత మబ్దరాజమ! శుభస్వాంతా! జగద్వ్యాపకా!                    6.

ఉ.     సంతతధర్మదీక్షయు, బ్రశస్త వినిర్మలభావజాల మ

త్యంత మృదూక్తిభాషణ మహర్నిశ లొప్పగు సత్యనిష్ఠ యా

శాంతవిశాలసద్యశము, సన్నుతవర్తన నుండు శక్తి స

త్వాంతరసిద్ధియున్ "శుభకృ"దబ్దమ! చూపుము మానవాళికిన్.                      7.

ఉ.     వత్సరకాల మంతయును వైభవవృద్ధిపరంపరాస్థితుల్

సత్సుఖసంపదల్, జనుల స్వాంతములందున సాధుభావముల్,

కుత్సిత మింతలేమియు, నకుంఠిత సుస్థిరకార్యదీక్ష లో

వత్సలతారసార్ద్ర! నవవర్షమ! యీభువి కందగావలెన్.                          8.

చం.   భలను మారుమ్రోగవలె సజ్జనసంస్తుతి శోభనంబుగా

నభయము గూడుచున్ "శుభకృ"దబ్దమ! నీవిట జేరియుండగా

శుభము ఘటించుచుండవలె శుభ్రయశోవిభవప్రభావముల్

ప్రభలను జిమ్ముచుండవలె భాగ్యచయంబది యందుచుండగన్.                     9.

చం.   విశశితారకాచయము రమ్యతనింపుచునుండ నెల్లెడన్

భువిపయి సస్యసంపద కపూర్వబలంబును గూర్చు రీతిగా

నవిరళవర్షముల్ "శుభకృ"దబ్దమ! నీ కనుసన్నలోన సం

స్తవముల కర్హతం గొనుచు సవ్యవిధంబున నందగావలెన్.                    10.

చం.   ముదుసలివారలై బలము పూర్తిగ తగ్గి చరించలేమిచే

ముదమును గాంచనట్టి తనపూర్వుల చిత్తము సంతసించగా

సదమలభావుడై జనుడు సన్నుతరీతిని సేవచేయు టీ

యదనున గాంచ నో "శుభకృ"దబ్దమ! భాగ్యము కల్గజేయుమా!                      11.

ఉ.     మ్మకముంచి నీపయిని నైష్ఠికతన్ గొని స్వాగతించు మా

కమ్మవు నయ్యవై "శుభకృ"దబ్దమ! హాయిని గూర్తువో యిటన్

గ్రమ్మిన వ్యాధిగూల్చి, గతకాలమె మేలని మానవాళి స్వాం

తమ్ములలోన దల్చువిధి దావక వర్తన మిందు జూపెదో?                              12

చం.   కువలయమందు నేడు గన కుత్సితభావము మత్సరంబులే

స్తవముల నందుచున్నయవి తద్గత చిత్తము లాశ్రయించు నా

యవగుణ రాజినిన్ శుభకృదబ్దమ! నీ కుశలత్వ దీప్తిచే

జవమున దున్గగా వలయు సద్విధి జూపగ స్వాగతించెదన్.                   13.

శా.    స్వాముల్ తామని చిత్తదీప్తి కొరకై సన్న్యాసు లైయుండి సత్

క్షేమం బందరి కందయోగ్యమగు సుశ్రీయుక్త వాక్యస్థితిన్

బ్రేమన్ బంచగలేని వారల మదిన్ విజ్ఞత్వమున్ నింపి త్వ

త్సామర్ధ్యంబును జూపుమోయి! “శుభకృ”ద్వర్షంబ” నీ వేళలోన్.                     14.

మ.    తవర్షంబులలోన నీ జగతిలో క్రౌర్యైక చిత్తంబుతో

నతులార్తిన్ గలిగించ జేరినది నవ్యంబైన రోగంబు త

ద్దితిజాకార కరోన కెల్లగతులన్ దేజంబునుం గూల్చి నీ

వ్రతదీక్షన్ బ్రకటించుమోయి  శుభకృ” ద్వర్షంబ!  సత్వంబునన్.                    15.

మ.    రుణం బియ్యది యీ సమాజమునకున్ ద్వచ్చిత్తనైర్మల్యమున్

బరమానందము గూర్చ జూపుటకునై భద్రాశయ స్ఫూర్తితో

ధరకేతెంచితి వీవటందు “శుభకృ”ద్వర్షంబ! నిన్నియ్యెడన్

వరశబ్దంబుల స్వాగతించెదను  భవ్యశ్రేష్ఠ భాగ్యప్రదా!                          16.

శా.    మున్నే పూజలు చేసి యుంటినొ మహా మోదంబు నందంగనౌ

త్వన్నామంబును, రూపమిందు శుభకృ ద్వర్షంబ నేగాంచితిన్

నిన్నీధాత్రికి స్వాగతించితి నిటన్ నిత్యానురాగమ్ముతో

నెన్నం జాలిన పద్ధతిన్ నిలువుమా! ఈ వత్సరం బంతయున్.                         17.

 

అందరికీ శ్రీ శుభకృన్నామ సంవత్సర శుభాకాంక్షలు.

హ. వేం. స. నా. మూర్తి.

 

 

 

 

 

అన్నమయ్య

 అన్నమయ్య

 

శా.

శ్రీమంతంబగు భక్తితో దలచెదన్  'చిద్రూపియై క్షేమముల్

భూమిన్ గల్గగ జేయుచుండి విలసత్ పుణ్యప్రభావమ్ముతో

నామూలమ్ముగ పాపముల్ దునుముచున్ హర్షంబులన్ గూర్చు నా

శ్రీమద్వేంకట నాయకార్చకకవిశ్శ్రీనన్నమయ్యన్ ఘనున్.  1.

 

కం.

పదకవితల కీయిలలో

నుదయించు బితామహుండు నున్నతుడు ఛవిన్

సదమలు డన్నమయార్యుడు

మది నచ్యుతు నిలిపినట్టి మాన్యుం డతడున్. 2.

 

శా.

ఈపుణ్యాత్ముడు స్వీయభావధనమిం దింపారు రాగమ్ముతో

పాపప్రావృతలోకమం దనిశమున్ భవ్యాచ్ఛసౌఖ్యంబులన్

దీపిల్లంగను జేయగల్గిన మహాదేవున్ సమర్చింపగా

జూపెన్ పుష్పచయంబుగా తిరుమలేశున్ మ్రొక్కి హర్షంబునన్. 3.

సీ.

శ్రీహరివాసంబు స్థిరపై యట "నదిగో

నల్లదిగో"యంచు ననినవాడు

"బ్రహ్మ కడిగినట్టి పాద"మియ్యది యంచు

నిలవారలకు బూని తెలుపువాడు

"కొండల నెలకొన్న కోనేటి రాయని"

నలఘుభక్తిని సదా కొలుచువాడు

"తందనానా"యంచు దగ సమానత్వంబు

భవ్యమౌ రీతిని బలుకువాడు

తే.గీ.

జీవనం బెల్ల శ్రీహరి సేవలకయి

యర్పణముచేయు కవివర్యు డనఘు డతడు

తాళ్ళపాకాన్వయాబ్ధికి ధవళయశము

లంద జేసిన ఋషితుల్యు డన్నమయ్య. 4.

 

శ్రీముక్తీశ్వర స్తుతి

 

శా.

శ్రీముక్తీశ్వర! లోకనాయక! ప్రభూ! చిద్రూప! గౌరీపతీ!

ప్రేమస్వాంత! పురారి! భక్తవరదా! విశ్వేశ్వరా! శ్రీకరా!

యీముక్త్యాల పురాన రక్షకుడవై యింపారు రూపమ్ముతో

స్వామీ! వాసముచేయు నిన్ను గొలుతున్ సద్భావనాదీప్తికై.                                  1.

మ.

బలి యానాడు త్వదీయభక్తతతులన్ భవ్యానురాగమ్ముతో

నిలలో గావగ గోర, వల్లెయని నీ విచ్చోట ముక్త్యాలలో

సలిలంబందున లింగరూపమున నైశ్వర్యాది సౌఖ్యప్రదా!

లలి ముక్తీశ్వర! నిల్చినాడవు నతు ల్దాక్షిణ్యభావోజ్జ్వలా!                                      2.

మ.

జలమందుండి కృపాకటాక్షవిలసత్సౌఖ్యప్రసారంబు లీ

స్థలమందున్ బ్రసరింపజేసెడి శివా! సర్వజ్ఞ! ముక్తీశ్వరా!

యలనాడా రఘురాముడున్ శుభగుణైకాకారు డౌ ధర్మజుం

డలికాక్షా! నిను మోక్షదున్ గొలిచి రత్యానంద సంయుక్తులై.                                   3.

శా.

ఈముక్త్యాలయు, గృష్ణ, యిచ్చటిజనుల్  హేవిశ్వనాథా! మహత్

క్షేమప్రాపక! నీదుసంగతిని సచ్ఛ్రేయంబు లేవేళ నీ

భూమిన్ బొందెద రయ్య, నన్ను  నటులే పూర్ణానురాగాన శ్రీ

రామారాధిత పాదపద్మ యుగళా! రక్షించు ముక్తీశ్వరా!                                       4.

 

శ్రీ ఉజ్జయినీ మహాకాళేశ్వర స్తుతి.

 

శ్రీరామ.                                                        శ్రీ శివాయ నమః

శ్రీ ఉజ్జయినీ మహాకాళేశ్వర స్తుతి.

(ఛందము-మానిని)

శ్రీల నొసంగెడి  చిన్మయరూపుడు  శ్రీపతి  కొల్చెడి  క్షేమదుడున్

లీలలు జూపుచు   క్లేశము  లన్నియు  లిప్తను బాపు నిలింపుడు తా

నాలము చేయక  యాశ్రితభక్తుల   నందరి గాచుట   యందు మహా

కాలుని నామము కాంక్షదుడై యిట గైకొని యుండె సుక్రముడై.             1.

 

జ్జయినీపతి!  యున్నత భావము లుర్వి నజస్రము నొప్పలరన్

ముజ్జగముల్ నిను మ్రొక్కుచు విస్తృత మోదము గోరుచు మోకరిలన్

జ్జయముల్ గన సంతసముల్ గొను త్వము జూపుచు సాకెడి నీ

కుజ్జి యొకండిట నుండునె? కొల్చెద మో హర! దీనుల నోము మయా!      2.

 

శ్వర! యుజ్జయినీశ్వర!  కాల! మహేశ్వర!  రక్షక!  హేగిరిశా!

శాశ్వతసౌఖ్యద!  ద్గతిదాయక!  సంతతహర్షద! సాధుయశా

విశ్వవిధాయక!  విజ్ఞజనాశయ!  ప్రేమకళామయ!  వేదనుతా!

శ్వ దమేయసుక్తి నిరూపక!  న్నుతు లో శివ! సాకుమయా!                         3.

 

నిన్నిట నుజ్జయినిన్ జనులందరు నిత్యము జేరుచు నీయెదుటన్

న్నన చేయుచు మ్ముల గావు ముమాపతి యంచు నస్కృతులన్

భిన్నవిధంబుల భీతిని గూల్చగ వేడుచు జేయగ బ్రేమముతో

గ్రన్నన బ్రోచెడి కామ్యశుభంకర! కామవిరోధి! హరా! ప్రణతుల్.                  4.

 

ద్వాదశ సంఖ్యను ధారుణి పైనను దావకమూర్తులు థ్యముగన్

మోదము గూర్చును మోక్షము నందెడి పూర్ణబలంబును బొంద శుభా

పాదిత సుస్థిర భాగ్యము జూపుచు బ్రాప్తిల జేయును వైభవముల్

నీదయ యుజ్జయినీస్థల మందున నిస్తుల మీశ్వర! నీకు నతుల్.                5.

 

పాపము లన్నియు బాయును శీఘ్రము పాహి మహేశ్వర! పాహి యనన్

నీపద ముజ్జయినీపతి! వీడక నిత్యము గొల్తుము నీదు దయన్

మాపయి జూపుము మానక కావుము మ్మహిభూషణ! మారహరా!  

దీపిల జేయుము ధీబల మిచ్చట దేకువ నింపుచు  దేవవరా!                     6.

 

పుట్టుట గూర్తువు భూతలమందున  బూర్ణసుఖంబిడి పొమ్మనుచున్

గుట్టుగ నాడుచు గూల్చుచునుందువు కూడుట వీడుట క్రోధమతీ!

నెట్టన గల్గుట నీకగు మానవ! నిర్మలతన్ మది  నిల్పిన నీ

ట్టున హర్షము బాయని దౌనని ల్కెడి యీశ్వర! వందనముల్.              7.

 

పూర్వ మవంతిని  భూసుర కోటికి  మోదము గూల్చుచు పోడుములన్

ర్వము ద్రుంచుచు  సాగుచునుండు నిశాటుని దూషణు త్వరమే

ర్విత భావుని ఖండన జేసెడి కాంక్షను నీవట కాలునిగా

ర్వ! కనంబడి చంద్రకళాధర! చంపితి వందుము న్నుతులన్.                        8.

 

తావకభక్తుడు తా విధుసేనుడు న్యుడు సన్మణి దాల్చు నెడన్

పావన మయ్యది భాగ్యద మౌటను వైరము బూనుచు బార్థివులున్

జేవను జూపుచు జేకొన దానిని జేరిన వేళను శీఘ్రముగన్

భూవిభు నాతని బ్రోచిన శంకర! పూర్ణదయాకర! మ్రొక్కు లయా!                9.

 

నిత్యము నుజ్జయినీపతి! శంకర! నిన్ను దలంచుచు నిష్ఠను నీ

త్యతి భక్తిని నాపగ లందలి ఛ్ఛజలంబున ర్చనకై

త్యసుఖాస్పద! స్నానము గూర్చెడి జ్జన పంక్తిని సాకునెడన్

వ్యత్యయముం గొను వైనము దాల్చని స్మవిలేపన! వందనముల్.             10.

 

హ. వేం. స. నా. మూర్తి.

31.10.2021.