Sunday, 7 July 2019

ఔను, నాకు దేవుడు కనబడ్డాడు.


ఔను, నాకు దేవుడు కనబడ్డాడు.
 06.07.19
ఉత్పలమాలిక

దేవుని గంటి నేనిచట దీనజనంబుల సేవ చేయుటే
పావనమైన కార్యమని ప్రత్యహమున్ మదిలోన నిష్ఠతో
భావన చేయుచున్ నిలుచు వారలలోన, నిరంతరమ్ముగా
జీవన మీ ధరాస్థలిని చిన్మయరూపుడు దేవదేవు డిం
దేవిధినైన సంమున నింపెసలార పరోపకార మో
జీవుడ! చేయుమా యనుచు చెప్పి సృజించెను నన్ను నాదు నా
నావిధ సంపదల్ జనగణంబుల నార్తులలోన బంచెదన్
ధీవిభవంబు మీర నని దెల్పి చరించెడి వారియందునన్
దైవము నిందు జూచితిని, తన్మయులై ప్రజ కెల్లరీతులన్
శ్రీవిభవంబు జూపుచును, శీలము శోభిలునట్టి పద్ధతుల్
జీవితమందు దీప్తులను జేర్చుకొనందగు సత్పథంబు,
ద్భావము లెప్డు నేర్పగల వారయి దీపిలు తల్లిదండ్రులం
దావర దాయకున్ బ్రభు ననంతసుఖప్రదు జూచినాడ నౌ
నోవిమలాత్ములార!  నిజ ముర్విని సందియ మించుకేనియున్
రావల దిందు నమ్మవలె రమ్యపదంబులతోడ యిచ్చటన్
చేవను జూపు విజ్ఞ కవిశేఖరులార! ముదంబు నాకగున్.

వృద్ధాప్యం-రెండవ బాల్యం



వృద్ధాప్యం-రెండవ బాల్యం
04.7.19

కం.
శుద్ధాంతరంగ సంయుత
మిద్ధరణిని ధర్మబద్ధ మెల్లరి కొరకై
సద్ధితము గోరుచుండెడి
వృద్ధాప్యము బాల్యనిభము విను డెట్టు లనన్. 1.
ఆ.వె.
చీకుచింత లెపుడు చేరంగ రాబోవు
స్వపరభేద మరయు నెపము గనము
కలిమి లేము లిటను బలిమి జూపించవు
రసను బాల్యనిభము ముసలితనము. 2.
కం.
అందరి క్షేమము గోరుచు
సుందరమగు భావి కొరకు శుభకామన లె
ప్డందించు ముసలితనమును
సందియమే లేదు బాల్య సమమని యనుటన్. 3.
ఆ.వె.
ధనము కూడబెట్టి యనయంబు సౌఖ్యాల
కొరకు కాంక్షసేయు సరణి లేదు
దొరకినంతలోన నరుసంబులను గాంచు
ముసలితనము బాల్యమునకు సమము. 4.
కం.
ప్రేమం బందును, సకలురు
క్షేమంబుల నడుగుచుండి కీర్తించెద రీ
భూమిని గన వృద్ధాప్యము
ధీమతులకు బాల్యసమము తెలియుడు దీనిన్. 5.
ఆ.వె.
బాలవాక్కు నిజము బ్రహ్మవాక్కని యండ్రు
పెద్దవారి మాట చద్దిమూట.
మెండు హితము గూర్చు రెండును భువిలోన
ముసలితనము బాల్యమునకు సమము. 6.

అవయవదానం



అవయవదానం


03.7.19 -

తే.గీ.

అవయవంబుల దానమీ యవనిలోన

దానసముదాయమున జూడ తథ్యముగను

శ్రేష్ఠతరమౌట దానికై సిద్ధమైన

వాని కబ్బును సౌఖ్యంబు పరమునందు. 1.


తే.గీ

కాలి బూడిదయైపోయి నేలనుగల

మట్టి గలియుటయే గాన గట్టి మదిని

నవయవంబుల నితరుల కందజేయ

గోరువానిని పరమందు చేరు సుఖము. 2.


నిజమైన సౌందర్యం.


నిజమైన సౌందర్యం.
(05-07-19)

ఆ.వె.
మానవుండు సతము మాన్యత్వముం బొంద
సంచరించుచుండి సర్వగతుల
దేహసౌష్ఠవంబు దీప్తిప్రదంబైన
యంద మంద గోరు నన్నిగతుల.                      1.
ఆ.వె.
దేహదీప్తి గోరి దివ్యౌషధంబుల
రాశులిందునందు శ్రమకు నోర్చి
కూర్చు కొనుట లోన కువలయంబంతయు
తిరుగుచుండు టిందు నరయవచ్చు.                2.
ఆ.వె.
స్వర్ణమయములైన సన్నుతాభరణంబు
లతులరత్నఖచితమై వెలుంగు
నట్లు కూర్చి తాల్చ నమరిన యందాని
కనుభవించు మోద మహరహంబు.                    3.
ఆ.వె.
మోహమిం దదేల దేహంబు నిత్యమై
నిలువబోదు భువిని నిక్కముగను
దాని కంద మిచట నానావిధంబైన
భూషణంబు లొసగబోవు వినుడు.                    4.
ఆ.వె.
నిర్మలాత్ములార! నిజమైన సౌందర్య
మెందు గల దటంచు సుందరమగు
మనముతోడ నెంచ నతరమైనట్టి
యంద మిందు నంద రరయవచ్చు.                  5.
ఆ.వె.
మానవత్వదీప్తి, మమతానురాగాలు
సాటివారియందు సవ్యమైన
సానుభూతితోడ సమతను జూపించు
టందు నిక్కమైన యంద మమరు.                    6.
ఆ.వె.
స్వార్థబుద్ధి వీడి సర్వమానవులకు
నిత్యశుభము గోరు నిర్మలమగు
ఠీవియూని హితము భావించుచుండుట
యందు నిక్కమైన యంద మమరు.                  7.
ఆ.వె.
ఎదుటివారి మనసు కిసుమంతయుం గాని
బాధ కలుగురీతి పరుషములగు
మాటలాడకుండ మనగల్గ జాలుట
యందు నిక్కమైన యంద మమరు.                  8.
ఆ.వె.
ఆత్మతుల్యు లంద రన్నలు తమ్ముళ్ళు
జగతి యంత నాకు స్వంతమైన
దగు కుటుంబ మనుచు ననుకొన గల్గుట
యందు నిక్కమైన యంద మమరు.                  9.
ఆ.వె.
ఇతరు లెన్నియేని యిక్కట్లు పడుచుండ
స్వీయసుఖము లందు హేయమైన
సంతసంబు గాంచు స్వాంతంబు వీడుట
యందు నిక్కమైన యంద మమరు.                  10.
ఆ.వె.
నాదు కుక్షి నిండ మోదమందెద నంచు
దలచకుండ తనదు ధనచయంబు
దీనజనుల జేరి దానంబు చేయుట
యందు నిక్కమైన యంద మమరు.                  11.
ఆ.వె.
తనను విశ్వసించి తనపక్షమున జేరు
వారి నమ్మకంబు కోరి ద్రుంచి
వంచనంబుతోడ బాధించకుండుట
యందు నిక్కమైన యంద మమరు.                  12.
ఆ.వె.
ఫలము లందగోరి పరుల పంచన జేరి
స్వీయధర్మ మన్న ఛీ యటన్న
భావ మూనకుండ పావనుండైయుండు
టందు నిక్కమైన యంద మమరు.                    13.
ఆ.వె.
అల్పసుఖములందు ననునిత్యమును పెచ్చు
కల్లలాడునట్టి కాంక్ష వీడి
సత్యవాదియౌచు నిత్యంబు చరియించు
టందు నిక్కమైన యంద మమరు.                    14.
ఆ.వె.
జన్మభూమి కొరకు సన్మార్గగామియై
ధర్మదీక్ష బూని తనువు, ధనము
తడయకుండ జేరి త్యజియించు యత్నంబు
నందు నిక్కమైన యంద మమరు.                    15.
ఆ.వె.
గృహము జన్మభూమి లిహమందు సౌఖ్యంబు
కలుగజేయు నట్టి స్థలము లగుట
సతము వాటికైన స్వచ్ఛతాకార్యంబు
లందు నిక్కమైన యంద మమరు.                    16.
ఆ.వె.
వృక్ష మిలను జనుని రక్షించు గావున
లక్ష మాటలేల లక్షణముగ
చెట్లు నాటి వాటి సేవను తరియించు
టందు నిక్కమైన యంద మమరు.                    17.
ఆ.వె.
కలియుగంబులోన నిలపైన ధర్మంబు
మృగ్యమగుచునుంట యోగ్యు డగుట
తలచి నిష్ఠతోడ   దానిని రక్షించు
టందు నిక్కమైన యంద మమరు.                     18.
ఆ.వె.
మహిని దైవతములు మహిళలై యుండుట
మాతృభావమూని నాతుల గని
గారవించుటౌను కర్తవ్యమని యెంచు
టందు నిక్కమైన యంద మమరు.                    19.
ఆ.వె.
గురుజనంబులందు నిరతంబు భక్తితో
మెలగుచుండి యొండు తలపు లేక
క్షితిని వారిమాట హితకరమని యెంచు
టందు నిక్కమైన యంద మమరు.                    20.
ఆ.వె.
కనుక మేలుకొనుట కర్తవ్య మగుటను
జాగరూకులౌచు సర్వజనులు
నిష్ఠబూని భువిని నిజమైన సౌందర్య
మరయ గలుగు సరణి నందవలయు.                21.


Sunday, 7 April 2019

శ్రీ వి కా రి కి స్వా గ త ము

శ్రీరామ
శ్రీ  వి  కా  రి  కి  స్వా  గ  త  ము

శా.
శ్రీమంతంబుగ విశ్వమానవులకున్ శ్రేయంబు లందించుచున్
    క్షేమస్థాపనకై "వికారి!"శుభదశ్రీలన్ స్వరూపంబునన్
    నీమం బొప్పధరించి యీక్షితిపయిన్ నిత్యంబు హర్షంబులన్
    ప్రేమన్ బంచగ వచ్చియున్న నిను నీవేళన్ బ్రశంసించెదన్.    1.
మ.
వినుతింతున్ నిను నో "వికారి"వినుమా విశ్వంబునందంతటన్
   ఘనతం నింపెడి శాంత్యహింసలకునౌ కల్యాణభావంబు లీ
    జనచిత్తంబుల నింపుమా, విమలమౌ సద్వాక్యసంపత్తి నీ
    వనయం బిందు త్వదీయ కాలమున నో హర్షప్రదా! చూపుమా.  2.
శా.
కాలుష్యంబులు నేడు సత్వయుతులై క్రౌర్యంబు జూపించుచున్
   వాలాయంబుగ మానవాళిగతులన్ బాధించు చుండంగ నీ
   నేల న్నీస్థితి యో"వికారి"!మలినానీకంబు లోకంబునన్
   గూలం జేసెడి శక్తిగూర్చు నిదె నీకుం జేతు  శబ్దాంజలుల్.  3.
మ.
రిపుసంఘంబులు భారతావనికి బల్రీతుల్ మహత్కష్టముల్
   నెప మొక్కింతయులేక గూర్చుట లహో నిత్యస్వకార్యంబుగా
   జపముల్ సేయుచునుండె వారి కుటిలాశల్ద్రుంచ బౌరాళి కీ
   విపుడా ధైర్యము హే “వికారి” యిడుమా యీనేల నీవుండగన్ . 4.
చం.
కినుక వహించి సంఘమున గీడ్పడజేయగ స్వార్ఘబుద్ధితో
   ననయము సంచరించెడి దురాత్ముల చిత్తములందు లేశమై
   నను రమణీయభావము జనప్రియవౌట "వికారి"వర్షమా
   కనబడజేయుమీ విచట గల్గగ జూడుము సౌఖ్యసంపదల్.  5. 
ఉ.
స్వానుభవంబుతో బ్రజకు చక్కని వర్తనమందియుండ స
    న్మానము లందు నిచ్చట ననంతముగా బరమందు నిత్యమున్
    మానక జేరు సౌఖ్యములుమాధవు సత్కృప చేత ముక్తి మీ
    కానక నందునంచు మరియాదను నీవు "వికారి!" నేర్పుమా.  6.
చం.
గతమున నందియున్న పలుకష్టములన్ మరపించి ప్రీతితో
   నతులిత సౌఖ్యసంపదల నందగజేయు శుభాశయంబుతో
   క్షితి కిపుడొప్పు మీరగను జేరు "వికారి!"నవాబ్దమా! జగ
   న్నుతముగ నీదు వాంఛకిట నూతన సత్వము కూడు గావుతన్.  7.
మ.
తరుణోపాయము లీ ధరాప్రజలకున్ దౌష్ట్యంబుతో మోసముల్
   నిరతంబిందు ఘటింప జేయు టకునై నిష్ఠన్ బ్రదర్శించు నా
   యరిసంఘంబుల బార ద్రోలు పనిలో నందించి యీకాలమం
   దురు చైతన్యము నో"వికారి!"యరుసం బొప్పార గల్గించుమా . 8. 
చం.
మునుపటికంటె మేలయిన మోదము లీ ధరపైన నిచ్చలున్
   మనుజుల కీవు జూపుచును మాన్యత గూర్చుచు శాంతి భద్రతల్
   జనహిత కార్యముల్ నిలిపి సస్యసమృద్ధిని జేర్చి సౌఖ్యముల్ 
   ఘనముగనందజేయగ"వికారి!" యిటన్ నిను స్వాగతించెదన్  9.

అందరికి “

శ్రీ వికారినామ సంవత్సరాగమన సందర్భమున

హృదయపూర్వక శుభాకాంక్షలు.

హ.వేం.స.నా.మూర్తి.

Friday, 1 March 2019

జై భారత్ జై జవాన్

జై భారత్ జై జవాన్

శార్దూలమాలిక
శ్రీమంతంబగు భారతావని పయిన్ చీకాకులం గూర్చగా
తామెవ్వారలు యత్నముల్ సలిపినన్ తథ్యంబుగా వారికీ
భూమిన్ నిల్వగలేని దుర్గతితతిన్ బొందింపగా సందియం
బే మీ భారతమందు గానమని నీ వీవేళ నిక్కంబుగా
ధీమంతుండవు గాన సైనిక! మహద్దీక్షాయుతాత్ముండవై
యామాలిన్యహృదంతరస్థితులకై యత్యుగ్రరూపంబునన్
ప్రేమస్వాంతవిరాజితా! నుతగుణా!విశ్వైకసంసార సు
స్థేమా! సర్వహితానుభావసహితా! చిద్రూప!ధర్మస్థితా!
నీమం బొప్పగ దెల్పగావలెనులే నీకిందు పౌరాళియున్
సామీప్యంబున వెన్నుతట్టి నిలువన్ సంకోచ మొక్కింతయున్
తామై యందరు నమ్ముమోయి పరమార్థం బెంచ జన్మంబునన్
క్షేమాన్వీతముగా యొనర్చి సతత శ్రేయంబులం గూర్చుచున్
నామౌన్నత్యము జన్మభూమి కెపుడున్ నానాప్రకారంబుగా
నేమాత్రంబును జంకకుండని విధిన్ హే దేశభక్తాగ్రసం
స్తోమా! పూని  ఘటించు టౌనుగద, “దాసోహమ్ము నీ”కంచు వా
రా మందుల్ భరతోర్విలో యిడుము లత్యంతంబుగా గూర్చు దు
ష్కామంబుల్ గలవారు బల్కవలె పో సర్వప్రయత్నంబునన్
తామై భీతిలి పారగావలెను హే దాక్షిణ్యభావా! దయా
రామా! రక్షకసోదరా! యమలినా! రమ్యప్రదేశంబు నా
నామంత్రోదయదీప్తభూమి, సతతానందార్థ సంధాయక
స్వామిత్వంబు ప్రపంచమందుగను సత్ సత్వంబునుం గల్గు నీ
సీమన్ హైందవభూమినిన్ సమరసన్ జేగీయమానోజ్జ్వలన్
ధామం బౌచు సమస్తవేదములకున్ ధర్మంబులన్ శాంతినిన్
క్షేమార్థంబు సమగ్ర విశ్వమునకున్ జెప్పన్ బ్రయత్నించు స
ర్వామోదాద్భుతభావసంయుతను ప్రహ్లాదన్ శుభ స్థాననున్
గామేశాది సమస్త దేవతలకున్ కైమోడ్పు లందించి సత్
త్కామంబుల్ ఫలియింప జేయు స్థిరనున్ ధన్యాత్మనున్ భారతిన్
శ్రీమన్మాధవరూపధారణమహచ్ఛ్రేయోవిశేషాన్వితన్
సామర్ధ్యంబిచటన్ ఖలాపహృతికై సంధించ సన్నద్ధయౌ
నామాతన్ భరతాఖ్యనున్  చిదుమగా నైజాసురత్వంబు నే
డీమూర్ఖుల్ ప్రకటించుటల్ శుభము గాదేరీతి నవ్వారికిన్
నీమాహాత్మ్యము శౌర్యమిప్పుడు మహన్నిష్ఠన్ బ్రదర్శించుమా!
శ్రీమన్! భారత వీరసైనిక! మహాసేవాసమాధిస్థితా!
ధీమన్! నీకు జయంబు గల్గు నిట సందేహంబు లేదిందులో
సేమం బిచ్చట శాశ్వతం బయి సదా జేజేలు మార్మ్రోగ నీ
భూమిన్ సౌఖ్యము నిత్యమై నిలుపగా బూజింతు విశ్వేశునిన్.

హ.వేం.స.నా. మూర్తి.
28.02.2019.

సైనికాభినందన

జై భారత్ జై జవాన్

సైనికాభినందన

కందములు

అభినందన లందుము నీ
వభినందన! సాహసించి యత్యుత్తమమౌ
శుభకార్యము చేయుటచే
సభలందున నీదుకీర్తి చర్చకు వచ్చెన్.             1.

అరివర్గంబుల కందియు
నరయగ ధైర్యంబు చూపి యాత్మావనికై
నిరుపమగతి సహియించితి
వురుతరసద్యశము లొదవె నుర్విని నీకున్.    2.

జనియించిన దేశంబున
కనయము సౌఖ్యంబు గూర్చనగు కార్యంబే
ఘనమని శౌర్యము జూపితి
వనుపమ మది సత్యమంచు నభినందింతున్.  3.

మనదేశపు సత్వంబుల
ననుచితగతి నడచునట్టి యరిసంఘములం
దనయంబును జూపించగ
నని దుముకు జవానులార! యభినందింతున్   4.

జైజై భారత మంచును
జేజేలు సతంబు బల్కి చెనటుల హృదులం
దాజీవన సంత్రాసం
బాజిని గలిగించు వీరు నభినందింతున్.   5.

ధనధాన్యరాశి కన్నను
తన సౌఖ్యము కన్న మిన్న తన జన్మభువిన్
ఘనతరముగ రక్షించుట
యనుకొను సైనికుని నిత్య మభినందింతున్.  6.

నీవసుమతి గని సైనిక!
యీ విశ్వములోన దౌష్ట్య మేర్పడునట్లున్
భావన జేసెడి వారల
కావంతయు జంకకుందు వభినందింతున్.   7.

నీవే రక్షణ సేతువు
నీవే సౌఖ్యంబు లిందు నిర్మలమతితో
దైవంబు వోలె గూర్చెద
వావిధి వర్ణింప దరమె యభినందింతున్.  8.

జేజే భారతమాతా!
జేజే హే కర్మభూమి! జేజే జననీ!
జేజే సైనికవీరా!
జేజే హే త్యాగమూర్తి! జేజే లిచటన్.  9.

ధన్యుండ వీవు సైనిక!
ధన్యత్వమునందె భరతధాత్రియు జూడన్
మాన్యుండవైన నిన్గని
యన్యం బికయేల నోయి యభినందింతున్.  10.

హ.వేం.స.నా.మూర్తి.
01.03.2019.