Tuesday, 28 July 2026

శ్రీగురుభ్యో నమః

 శ్రీగురుభ్యో నమః

🙏🙏

కం.

అజ్ఞాన మణచగలిగిన

స్వజ్ఞానము పంచునట్టి సన్నుతమతియౌ

ప్రజ్ఞావంతుడు గురు డా

విజ్ఞశ్రేష్ఠునకు గూర్తు వినయాంజలులన్.

కం.

నిగమస్తుత్యుం డాద్యుడు 

ఖగవాహను డెపుడు గొల్చు కారుణ్యాత్ముం

డగజానాథుడు గురులకు 

తగు దక్షత నొసగునట్టి దైవము ప్రణతుల్.

కం. 

జగమును గావగ గీతా

నిగమంబును బోధచేసి నిలిచిన వాడీ

జగములకు గురుడు కృష్ణుడు 

నగధరు డాయనకు గూర్తు నతులశతంబుల్.

కం.

భరతావని కద్వైతము 

వరగతి చూపించి నట్టి పరమగురుండౌ 

స్థిరయశుడు శంకరార్యుడు 

నిరుపము డాయనకు నతులు నిష్ఠాయుక్తిన్.

కం.

వేదంబులు విభజించుచు 

నేదంపూర్వంపు రీతి నిఖిలపురాణా

స్వాదన జగతికి దెల్పిన 

వేదవ్యాసాఖ్యగురుని విజ్ఞు నుతింతున్.

కం.

ధరపయి జన్మం బొసగుచు 

చరియించెడి విధము నేర్పు సన్మార్గదులౌ

వరగుణజననీజనకుల

చరణములకు మ్రొక్కుచుంటి సద్భక్తి మెయిన్.

కం.

అక్షరహీనుండగు నా 

కుక్షిని నక్షరము నింపు గురువరకోటిన్ 

దీక్షామయులై నాకును

నక్షయ విజ్ఞాన మొసగు నార్యుల గొలుతున్.


గురుపూర్ణిమ శుభవేళ త్రిమూర్తిస్వరూపులైన గురుజనులందరికి నమ్రతాపూర్వక నమశ్శతములు.

🙏🙏


హ.వేం.స.నా.మూర్తి.

No comments:

Post a Comment