శ్రీవిఘ్నేశ్వరాయనమః
సీ.
లంబోదరుండౌట సంబరంబులు భువిన్
మెండుగా గలిగించుచుండు సతము,
గజవక్తృ డౌటచే నిజదయావర్షంబు
చిమ్ముచునుండు నీ క్షితి ననిశము
ఏకదంతుండౌట ప్రాకృతదైవమై
యాదిపూజలనంది మోదమిడును
శూర్పకర్ణుండౌట నేర్పుగా భక్తాళి
కరులైన చెనటుల జెరుగుచుండు
తే.గీ.
విఘ్ననాథుడు తానౌట విమలమతుల
నొవ్వజేసెడి విఘ్నాల నోళ్ళు మూసి
యందు డంచును నిజభక్తబృందములకు
కార్యసిద్ధిని జూపించి ధైర్య మొసగు.
కం.
గణనాథా! వందనమయ
ప్రణుతింతును నిన్ను సతము ప్రహ్లాదము ధా
రుణిపయి నిలుపుము సతతం
బణిమాదుల నొసగువాడ వాఖుతురంగా!
వినాయకచవితి సందర్భంగా అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
🙏🙏
హ.వేం.స.నా.మూర్తి.
No comments:
Post a Comment