Sunday, 31 July 2016

దత్తపది-౨

అసి - కసి - నుసి - రసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి
పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయుట.
(31.07.2016)
అసితమై యొప్పు కచభార, మద్భుతముగ
సితసుమంబుల మాలను సిగకు జుట్టి
రసిజంబుల సొబగులు చక్షువులకు

ప్రాక సిరివోలె గనిపించు పల్లెపడుచు.         ౧.
 నవ్య-భవ్య-దివ్య-సవ్య 
అనే పదాలను ఉపయోగిస్తూ
నచ్చిన ఛందంలో
వైద్యవృత్తిని గురించి పద్యం వ్రాయటం.
(03.08.2016)

శా. నవ్యంబై వెలుగొందు పద్ధతులతో నానాప్రకారంబుగా

భవ్యంబైన చికిత్స చేయబడునో భాగ్యాన్వితుల్! రండిటన్

దివ్యత్వంబొనగూర్చ, రోగతతులం దీర్చంగ మామార్గమే

సవ్యంబైన దటండ్రు వైద్యవరులీ సంఘంబునం దంతటన్.1



కావ్యము వ్రాయురీతి పలు కమ్మని వాక్యములెంచి యెల్లెడన్

దీవ్యదమోభాషణల దెల్పెదరిట్టుల వైద్యశాలలన్

మీవ్యధదీర్చు కార్యమున మేమిట జూపెడి తీరు మేలికన్

నవ్యము భవ్యమున్ మరియు నమ్ముడు దివ్యము సవ్యమిద్దియే.2

కన్ను - ముక్కు - చెవి - నోరు
పై పదాలను ఉపయోగిస్తూ
దీపావళి సంబరాలను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని 
వ్రాయటం.


కన్ను ముక్కు చెవియు కరము భద్రంబురా
దూరముండి చేత నోరుమూసి
కాల్చ వలయు మీరు కడు జాగరూకు లై
మందుగుండ్లు పిల్ల లంద మొప్ప.

కన్నుల విందగు వెలుగుల
కెన్నంగా ముక్కు తనియు నీగంధములన్
మిన్నంటు ధ్వనులు చెవికిని
మన్నికయగు నోరు తీపిమయ మగును గదా.

సరి - గమ - పద - నిస
పై పదాలను ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని 
వ్రాయటం.



రామా! నీసరి రక్షకుల్ గనమిలన్ రమ్యాతిరమ్యంబు నీ
నామంబే గమనించినాడ పలుకన్ నాకిమ్ము సామర్ధ్య మో
స్వామీ! నీపదసన్నిధిం నిలుచు సద్భాగ్యమ్ము ప్రాప్తించినన్ 
నీమంబూని సదా చరింతు ననియెన్ నిష్ఠంగపీంద్రుడటన్. 

గడుసరి యగు నగ్రజుతో
తడబడక విభీషణుండు తద్యత్నంబున్
విడువగ మన్ననలందుచు
నొడయని సత్పదము లోన నుండగ బలికెన్.

సరియగు సీతను బంపుట
సురవైరీ!మోక్షపదము సుగమము చేయున్
గురుముని సమ్మత మిది నీ
కరయంగా రామచంద్రు డతి హర్షమునన్.

దిన - వార - పక్ష - మాస
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని 
వ్రాయటం.




హృది నమ్మగ దగు నర్జున!
కదనం బనివారణీయ కర్మము, కలుషం
బది నీపక్షము చేరునె
యిది వినుమా సమ్మతించు మీ పోరునకున్.


సీత - కైక - సుమిత్ర - తార
పై పదాలను ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని 
వ్రాయటం.

సీ సీ తనయునికై కసి
యాసురగుణు డౌచు నూనె నవ్వారలపై
దా సుమి! త్రప లేకుండగ
దాసునివలె విభుడు సర్వ తారక మనుచున్.

 

No comments:

Post a Comment