గురువు
కం. గురుపూర్ణిమ పర్వంబున
నిరతము సద్బోధనాఖ్య నిష్ఠాగరిమన్
ధరణీతలమున దీపిలు
గురుజనులకు వందనముల కోట్లర్పింతున్.
కం. ఛాత్రులను ప్రేమ మీరగ
పుత్రులుగా దలచుచుండి భువనంబున సత్
పాత్రత, జీవన సరణియు
నాత్రంబుగ నేర్పు గురుల కందింతు
నతుల్.
కం. అంతేవాసుల కొరకయి
సంతసమున జ్ఞానధనము సాదరఫణితిన్
సాంతం బొసగెడి గురునకు
సంతత మందించవలయు సత్ప్రణతులిలన్.
కం. తనశిష్యకోటిమనముల
ననుదినమును పేరుకొనెడి యజ్ఞానంబున్
ఘనతర జ్ఞానజ్యోతికి
ననిశం బర్పించుగురున కందింతు నతుల్.
కం. గురువే జగదాధారము
గురువే జీవనము నేర్పు కోవిదు డిలలో
గురువే రక్షకు డగుటను
గురునకు వందనము లిడుదు గురుతరభక్తిన్.
No comments:
Post a Comment