కొండలలోన బుట్టి
పలుకోనల సందుననుండి పారుచున్
మెండుగ సద్దు చేయుచును
మెచ్చెడురీతిని వంపుసొంపులన్
దండిగ జూపుచున్
క్షితికి తన్మయతన్ గలిగించుచుండి నీ
వండగ నుందు వీప్రజల
కద్భుతరీతి ఝరీ! ప్రశస్తవై.
స్వాదు జలంబునింపుకొని
చక్కని తీరుగ నాట్యమాడుచున్
మోదముతో స్వహస్తములు
ముందుకు జాచి విహంగపంక్తులన్
నీదరి జేర బిల్చుచు
వినిర్మల భావము తోడ ప్రాణులన్
భేదము లేకజూచెదవు
విజ్ఞవు నీవు ఝరీ! మహీస్థలిన్.
నీగతి గల్గు ప్రాంతమున
నిర్ఝరిణీ! సతతంబు సఖ్యముల్
రాగసుధాఢ్యజీవనము
రమ్యసువర్తన మబ్బుచుండు నీ
యాగమనంబు కర్షకుల
కందగ జేయును సస్యసంపదన్
స్వాగత మంది యీ
భువిని చల్లగ జేయుట నీకు యుక్తమౌ.
నీరే జగదాధారము,
నీరే ప్రాణంబు నిల్పు
నిత్యౌషధమై,
నీరే రక్షక మాపగ!
నీరంబందించునట్టి
నీవందు నతుల్.
28.07.2016
No comments:
Post a Comment