Sunday, 31 July 2016

దత్తపది-౨

అసి - కసి - నుసి - రసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి
పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయుట.
(31.07.2016)
అసితమై యొప్పు కచభార, మద్భుతముగ
సితసుమంబుల మాలను సిగకు జుట్టి
రసిజంబుల సొబగులు చక్షువులకు

ప్రాక సిరివోలె గనిపించు పల్లెపడుచు.         ౧.
 నవ్య-భవ్య-దివ్య-సవ్య 
అనే పదాలను ఉపయోగిస్తూ
నచ్చిన ఛందంలో
వైద్యవృత్తిని గురించి పద్యం వ్రాయటం.
(03.08.2016)

శా. నవ్యంబై వెలుగొందు పద్ధతులతో నానాప్రకారంబుగా

భవ్యంబైన చికిత్స చేయబడునో భాగ్యాన్వితుల్! రండిటన్

దివ్యత్వంబొనగూర్చ, రోగతతులం దీర్చంగ మామార్గమే

సవ్యంబైన దటండ్రు వైద్యవరులీ సంఘంబునం దంతటన్.1



కావ్యము వ్రాయురీతి పలు కమ్మని వాక్యములెంచి యెల్లెడన్

దీవ్యదమోభాషణల దెల్పెదరిట్టుల వైద్యశాలలన్

మీవ్యధదీర్చు కార్యమున మేమిట జూపెడి తీరు మేలికన్

నవ్యము భవ్యమున్ మరియు నమ్ముడు దివ్యము సవ్యమిద్దియే.2

కన్ను - ముక్కు - చెవి - నోరు
పై పదాలను ఉపయోగిస్తూ
దీపావళి సంబరాలను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని 
వ్రాయటం.


కన్ను ముక్కు చెవియు కరము భద్రంబురా
దూరముండి చేత నోరుమూసి
కాల్చ వలయు మీరు కడు జాగరూకు లై
మందుగుండ్లు పిల్ల లంద మొప్ప.

కన్నుల విందగు వెలుగుల
కెన్నంగా ముక్కు తనియు నీగంధములన్
మిన్నంటు ధ్వనులు చెవికిని
మన్నికయగు నోరు తీపిమయ మగును గదా.

సరి - గమ - పద - నిస
పై పదాలను ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని 
వ్రాయటం.



రామా! నీసరి రక్షకుల్ గనమిలన్ రమ్యాతిరమ్యంబు నీ
నామంబే గమనించినాడ పలుకన్ నాకిమ్ము సామర్ధ్య మో
స్వామీ! నీపదసన్నిధిం నిలుచు సద్భాగ్యమ్ము ప్రాప్తించినన్ 
నీమంబూని సదా చరింతు ననియెన్ నిష్ఠంగపీంద్రుడటన్. 

గడుసరి యగు నగ్రజుతో
తడబడక విభీషణుండు తద్యత్నంబున్
విడువగ మన్ననలందుచు
నొడయని సత్పదము లోన నుండగ బలికెన్.

సరియగు సీతను బంపుట
సురవైరీ!మోక్షపదము సుగమము చేయున్
గురుముని సమ్మత మిది నీ
కరయంగా రామచంద్రు డతి హర్షమునన్.

దిన - వార - పక్ష - మాస
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని 
వ్రాయటం.




హృది నమ్మగ దగు నర్జున!
కదనం బనివారణీయ కర్మము, కలుషం
బది నీపక్షము చేరునె
యిది వినుమా సమ్మతించు మీ పోరునకున్.


సీత - కైక - సుమిత్ర - తార
పై పదాలను ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని 
వ్రాయటం.

సీ సీ తనయునికై కసి
యాసురగుణు డౌచు నూనె నవ్వారలపై
దా సుమి! త్రప లేకుండగ
దాసునివలె విభుడు సర్వ తారక మనుచున్.

 

Thursday, 28 July 2016

సెలయేరు



 
కొండలలోన బుట్టి పలుకోనల సందుననుండి పారుచున్

మెండుగ సద్దు చేయుచును మెచ్చెడురీతిని వంపుసొంపులన్

దండిగ జూపుచున్ క్షితికి తన్మయతన్ గలిగించుచుండి నీ

వండగ నుందు వీప్రజల కద్భుతరీతి ఝరీ! ప్రశస్తవై.

స్వాదు జలంబునింపుకొని చక్కని తీరుగ నాట్యమాడుచున్

మోదముతో స్వహస్తములు ముందుకు జాచి విహంగపంక్తులన్

నీదరి జేర బిల్చుచు వినిర్మల భావము తోడ ప్రాణులన్

భేదము లేకజూచెదవు విజ్ఞవు నీవు ఝరీ! మహీస్థలిన్.

నీగతి గల్గు ప్రాంతమున నిర్ఝరిణీ! సతతంబు సఖ్యముల్

రాగసుధాఢ్యజీవనము రమ్యసువర్తన మబ్బుచుండు నీ

యాగమనంబు కర్షకుల కందగ జేయును సస్యసంపదన్

స్వాగత మంది యీ భువిని చల్లగ జేయుట నీకు యుక్తమౌ.

నీరే జగదాధారము,

నీరే ప్రాణంబు నిల్పు నిత్యౌషధమై,

నీరే రక్షక మాపగ!

నీరంబందించునట్టి నీవందు నతుల్.            
                                                                                                           28.07.2016                            

Wednesday, 20 July 2016

సమస్యాపూరణం - ౩

 జులై 17, 2016
 సౌజన్యుండైన నేమి సంకట మందున్
భూజనులకు ధైర్యంబున
తేజంబును విజయమొదవు దీప్తియు గల్గున్
నైజంబిది యది కొరవడ
సౌజన్యుండైన నేమి సంకట మందున్.౧.


 జులై 18, 2016
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
కమ్మని భాగవతమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
సమ్మతమని యలనాడిట
నమ్ముని తుల్యుండు నన్నయార్యుడు వ్రాసెన్.  ౨.


శత్రువు లేనివాని కిల శాంతి సుఖంబులు కల్గ నేర్చునే
మిత్రుడు సర్వకాలముల మేలొనరించగ బూనువాడు, సత్
పాత్రత గూర్చువా, డికను భాగ్యము బంచుచు నుండి దౌష్ట్యమున్
వేత్రము చూపుచున్ సతము విస్తృతరీతి నశింపజేయుటన్
శత్రువు, లేనివాని కిల శాంతి సుఖంబులు కల్గ నేర్చునే. ౩.

 శత్రు రహితున కబ్బునే? శాంతి సుఖము
శత్రువును గూల్చు దీక్షలో సతత మవని
జనుల కలవడు నేకాగ్ర శక్తి యద్ది
శత్రు రహితున కబ్బునే? శాంతి సుఖము
శత్రు నాశన మందు తా జనుడు గాంచు. 



జులై 20, 2016
మాతను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్
భూతేశుడైన శంకరు
డా తన్వంగిని హిమాలయాత్మజను శివన్
చేతం బలరగ త్రిజగ
న్మాతను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్. ౪.

  
జులై 21, 2016
 సన్యాసికి పిల్లనిచ్చి సంబరపడియెన్. 
మాన్యుం డా హిమవంతుడు
ధన్యత్వము నందగోరి, తన్మయుడయి తా
నన్యుల కందక తిరిగెడు
సన్యాసికి పిల్లనిచ్చి సంబరపడియెన్.  5.

 జులై 22, 2016
 వానరు, లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో
మాననివా రకృత్యముల, మాన్యతకై పరుగెత్త్తువార లె
వ్వానికి జంకకుండగను స్వార్థమె చూచుచు నన్యమేమియున్
గాననివారు మానవులు, కర్మము లెంచనివార లాదిలో
వానరు, లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో? 6. 


 జులై 23, 2016
 నాపతి యేగుదెంచ గని నాపతి భీతిని నక్కె నొక్కెడన్. 
చూపుచు ఖడ్గరాజమును, చోరుడ! రమ్ముర! యెక్కడుంటివో
పాపము చేసినా విపుడ వార్యము దండన, నీదుజీవమన్
దీపము నార్పుకొందువని తిట్టుచు, నిప్పులు గక్కుచున్న సే
నాపతి యేగుదెంచ గని నాపతి భీతిని నక్కె నొక్కెడన్. 7.


 జులై 24, 2016
పురుషుని బెండ్లియాడె, నొక పూరుషు డందరు మెచ్చి యౌననన్
వరగుణయైన యొక్కరిత వైభవమొప్పగ నింటివారలౌ
గురుజను లాదరంబునను గూర్చిన వానిని సుందరాంగుడౌ
పురుషుని బెండ్లియాడె, నొక పూరుషు డందరు మెచ్చి యౌననన్
వరుసకు మేనమామ యట వర్ధిలు మంచు నొసంగె దీవెనల్. 8.

 జులై 25, 2016
 పురుషునకుం, దాళిబొట్టు భూషణము సతీ
ధరపయి చూడగ శౌర్యము
పురుషునకుం, దాళిబొట్టు భూషణము సతీ!
సురుచిరముగ నర్థాంగికి
వరగుణులై వీని దాల్చ వైభవ మబ్బున్.  9.


జులై 26, 2016
ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు
స్వార్థపరులౌచు సర్వత్ర సంచరించు
చుండి నిధులన్నియును మ్రింగుచుండువార
లన్యు లేమైన నాకేమి టని తలంచు
ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు.10.


హత్య లవినీతి కృత్యంబు లనుదినంబు
మత విరోధంబు లతివల మానహాను
లధిక మౌచుండ కిమ్మన నట్టులుండు
ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు.  11.


జులై 27, 2016
న్నను భర్తగా గొనిన యన్నులమిన్న అదృష్టరాశియౌ
అన్నవరంబులో జనులు హర్షముతో తమ కండదండగా
నున్న పరోపకారగుణు నొక్కని నున్నతు గాంచి యాత్మలో
నెన్నుచు నుండి రిట్టులని యీతని సాధుచరిత్రు ధీరు రా
జన్నను భర్తగా గొనిన యన్నులమిన్న అదృష్టరాశియౌ.12.


మున్నొక సుందరాంగి గని మోదముతో నిటులెంచె నొక్క డీ
సన్నుతగాత్రి కేనెసరి, సచ్చరితుండను, శౌర్యయుక్తుడన్
మన్నన లందువాడ నిక మాన్యుడనై చరియించువాడ నౌ
యన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ.13.


మన్నన గాంచబోవు, బహుమానము లందవటంచు స్నేహితుల్
తన్నొక యజ్ఞగా దలచి తాళుమటంచును నా
డేల వ
ద్దన్నను భర్తగాగొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ
“పున్నమి” వానితో మహిని పొందెసుఖంబు లనారతంబుగన్. 14. 


జులై 28, 2016
పోరువలన శాంతి బొందగలము
మోద ముడిగిపోవు,సోదరావళితోడి
పోరు వలన, శాంతి బొందగలము
కలిసి యొక్కటైన కలహంబులను మాని
సత్య మిందికేల సందియంబు. 15.

రాజుతోడ బలికె రమ్యంబుగా మంత్రి
దేవ! మనకువైరి తిరముగాను
పొరుగువాని కహితు డరయంగ వీరల
పోరువలన శాంతి బొందగలము.16

 జులై 29, 2016
 హారము కోసమై ప్రజ లహర్నిశమున్ కృషి చేయగా దగున్. 
వారును వీరటంచు పలువాదము లాడక, సత్స్వభావులై
కోరిక మీర నందరికి కూరిమి బంచుచు ధర్మనిష్ఠ ని
ద్ధారుణి సంచరించవలె, తన్మయతన్ సమభావనాసమా
హారము కోసమై ప్రజ లహర్నిశమున్ కృషి చేయగా దగున్.  17.



కూరిమి కోసమై సత మకుంఠిత దీక్షను బూనగా వలెన్

ధీరత బూని యన్నిటను దివ్య యశంబుల నందుచుండి సం
స్కారముతోడ పేదలకు సంపద పంచుచు స్వార్ధభావ సం
హారము కోసమై ప్రజలహర్నిశమున్ కృషిచేయగా దగున్.18.


 జులై 30, 2016
వ్యర్థ మొనరింప దగును సంపదల బుధులు

నిరత సుఖముల కోసమై పరుగు లిడుట
వ్యర్థ, మొనరింప దగును సంపదల బుధులు
మెతుకు దొరకక నిత్యమీ క్షితిని దిరుగు
దీనజనముల సేవను మానకుండ.  19.


సంవిద్రోహ శక్తుల యత్నములను
వ్యర్థమొనరించ వలయు, సంపదల బుధులు
మెచ్చుకొనునట్లు ధరవారి మేలుగోరి
వ్యయము చేయంగ వలయు నెవ్వారలైన.20.

అహముతో గర్వించి సహవాసులను జేరి
                      పరుషమౌ వాక్యాలు పలుకుచుండి
సంవిద్రోహులై సంచరించెడివారి
                      యత్నంబులను గాంచి యనుదినంబు
సన్మార్గగములైన సజ్జనావళి యేమి
                       చేయుట యుక్తమీ నీక్షితిని జెపుడు?,
దారిద్ర్యబాధతో తాళలే కున్నట్టి
                        వారల కేయవి పంచవలయు?
సద్వివేకంబు చూపుచు సర్వ విషయ
సార మందించు చుండెడి వారి నేమి
యనగ జెల్లును భువిలోన? నందురేని
వ్యర్థమొనరింపదగును, సంపదల, బుధులు.

 

Tuesday, 19 July 2016

గురువు



గురువు
కం.  గురుపూర్ణిమ పర్వంబున
నిరతము సద్బోధనాఖ్య నిష్ఠాగరిమన్
ధరణీతలమున దీపిలు
గురుజనులకు వందనముల కోట్లర్పింతున్.

కం.  ఛాత్రులను ప్రేమ మీరగ
పుత్రులుగా దలచుచుండి భువనంబున సత్
పాత్రత, జీవన సరణియు
నాత్రంబుగ నేర్పు గురుల కందింతు  నతుల్.

కం.  అంతేవాసుల కొరకయి
సంతసమున జ్ఞానధనము సాదరఫణితిన్
సాంతం బొసగెడి గురునకు
సంతత మందించవలయు సత్ప్రణతులిలన్.

కం.  తనశిష్యకోటిమనముల
ననుదినమును పేరుకొనెడి యజ్ఞానంబున్
నతర జ్ఞానజ్యోతికి
ననిశం బర్పించుగురున కందింతు నతుల్.

కం.  గురువే జగదాధారము
గురువే జీవనము నేర్పు కోవిదు డిలలో
గురువే రక్షకు డగుటను
గురునకు వందనము లిడుదు గురుతరభక్తిన్.