పోస్టు కార్డు
వరుస తప్పకుండ తిరుగుచుండి
నిరత మఖిలజగతి కరుస మందించెడి
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 1.
కారణాంతరాల దూరస్థులై యున్న
బంధుజనుల జేరి బహువిధాల
పలుకరించుచుండు నిలవారి చుట్టంబు
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 2.
కులము మతము లెంచ దిలనుండు వారంద
రన్నదమ్ములంచు నందరికడ
చేరుచుండు కూర్చు శ్రేయంబు లెల్లెడ
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 3.
తోకలేని పిట్ట తోయదమండలం
బాకసంబు దాటి యద్భుతముగ
పరహితంబు గోరి యరుగు నెందైనను
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 4.
పిన్న పెద్ద యనెడు భేదమించుకయైన
చూపకుండ జనుల సుఖము గోరి
సమత జూపుచుండి సత్వమందించెడు
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 5.
మోద మందజేయు పేదవారలకైన
వ్యయము స్వల్ప మగుట, జయద మగుట
స్వార్థ మింత లేక సాయ మందించెడు
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 6.
ఎర్రపెట్టెలోన నింపుగా కూర్చుండి
ఖాకిగోతమందు కట్టుబడుచు
చేరు తప్పకుండ చిరునామ వద్దకు
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 7.
ఇంధనంబు పూన దిసుమంతయైనను
దారి ఖర్చుకొరకు ధనము కోర
దెగిరి పోవుచుండు నేప్రాంతమునకైన
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 8.
ఆప్తయగుచు సతత మన్నివర్గాలకు
వలయు సంగతులను తెలియబరచు,
సమయమంత గడుపు సాంఘిక సేవలో
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 9.
వర్తమానమందు వరుసలు గట్టిన
సాధనాలవలన సన్నగిల్లె
వైభవంబు తనకు, వాస్తవం బేమన్న
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 10.
No comments:
Post a Comment