Saturday, 28 September 2013

“పరనింద”



 “పరనింద”
పరనింద చేయువారల
కరయంగా నిహము పరము లతిదుఃఖదముల్
సురుచిర మృదువచనంబులు
చిరతరసత్సౌఖ్యదము
లు క్షితివారలకున్.  
వర్తమానంలో
రాజకీయములందు రాణించవలెనన్న
 
..........పరనింద చేయుట ప్రథమ కృత్య
మనుదిన హర్షంబు నందంగవలెనన్న
 
..........పరనింద చేయుచు బ్రతుక వలయు,
నత్యుత్తముండంచు యశమందవలెనన్న
 
..........వలయు నన్నింటను పరుల నింద,
కూర్మితో గద్దెపై కూర్చుండవలెనన్న
 
..........పరనింద చేయంగ వలయు నెపుడు
కలియుగంబులోన క్రమముగా నీరీతి
జనుల మనములందు సకలజగతి
నిరతసుఖము కొరకు పరనింద చేయుటే
విధియటన్న తలపు విస్తరించె.


కానీ,

పరనింద పాపకృత్యము
పరనిందయ హానిదంబు బహువిధములుగా

పరనింద సత్వనాశిని
పరనిందను చేయువారు బడుగులు జగతిన్.


పరనింద వైరవర్ధిని
పరనిందయ యశహరంబు భాగ్యాంతకమౌ,

పరనింద నరకతుల్యము
పరనిందను మానవలయు ప్రజలెల్లరకున్.  


పాలనాదక్షత ప్రభుతకు లేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,

కర్తవ్యదీక్షితుల్ కాలేనివారికి
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
దిశలు నిండెడు సవ్య యశమందలేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,

దాతృత్వబుద్ధితో దయజూపలేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
సంఘసేవను బూని సహకారి గాకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,

సజ్జనసన్నుతుల్ సంధించలేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
వరమృదువాక్యాలు వచియింప లేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,

సత్యవాచనమన్న సఖ్యత లేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
న్యాయానువర్తన ధ్యేయంబు గాకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,

సద్గురుడౌటకు సత్వంబు లేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
హితకాంక్షియై చేరి జతగొన లేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,

ధర్మరక్షణవిధుల్ దాల్చగలేకున్న
..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
ఎందు జూచిన పరనింద కిలను నేడు
పెద్దపీటయ కనవచ్చు, విమలు డగుచు

పరుల నిందించ లేనట్టి నరుని చరిత
మకట హాస్యాస్పదంబయ్యె ననుట నిజము.  



పరనింద చేయుచు బ్రతుకు నీడ్చుటకన్న
..........బండగట్టుక బావి బడుట మేలు,

పరనింద చేయుచు నరుసమందుటకన్న
..........భీకరాగ్నిని జేరి దూకు టొప్పు,

పరనింద చేయుచు ధరనుండు కన్నను
..........రైలు పట్టాలపై వ్రాలు టొప్పు,

పరనింద చేయుచు చరియించు కన్నను
..........అంభోధిలో దూకు టర్థవంత

మవని పరనింద తుల్యమౌ యఘము లేదు
కోటి గ్రంథాల సారమౌ మాట లివియె

పరుల కుపకార మొనరింప చిరసుఖంబు
పాప మొదవును పరనింద వలన నిజము.

1 comment:

  1. పరనింద నరకతుల్యమే కానీ అది ఎంతమంది పాటించుచున్నారు, మీ వాఖ్యలు అక్షర సత్యం.

    ReplyDelete