Monday, 30 September 2013

“గ్రామ దేవతలు”

“గ్రామ దేవతలు”
ఎల్లమ్మదేవతా! యిమ్ము మాకులమందు
          సంతానసౌఖ్యంబు సంతతంబు,

పోచమ్మ మైసమ్మ లాచంద్రతారకం
          బైన సత్కీర్తుల నందజేసి

కాచుచుందురుగాత, క్రమత ముత్యాలమ్మ
          గంగమ్మ దుర్గమ్మ ఘనముగాను
సంపదల్ కురిపించి సాకుచుందురు గాత,
          బాలమ్మ పెద్దమ్మ భావశుద్ధి

నిచ్చుచుందురుగాత, యీదమ్మ చౌడమ్మ
          మాకందజేతురు మమత, సమత,
నూకాంబికాదేవి నూతనోత్సాహంబు
          మానసంబుల నింపు తాను, పిదప

కోటదుర్గాదేవి కోరిక లీడేర్చు,
          నానందమును గూర్చు నక్కలమ్మ,
ఉప్పలమ్మయు బెంచు నుపకార కాంక్షను
          కనగ
పోలేరమ్మ ఘనత గూర్చు,
పైడితల్లియు మాకు భవ్యమై వెలుగొందు
          ఐక్యతాభావంబు నందజేయు,
నిక మహాలక్ష్మమ్మ సకలసంపదలిచ్చి
          రక్షించుగావుత లక్షణముగ,

పురుషరూపము దాల్చి భువనంబు లన్నింట
          తిరుగుచు దయజూపి ధరనుగాచు
పోతురాజాదులు పుణ్యకార్యములందు
          బలమంద జేతురు బహుళగతుల

భక్తిభావమలర పరమహర్షంబుతో
కొలుతు మెల్లవేళ నిలిచి మిమ్ము,
కావవలయు మమ్ము గ్రామదేవతలార!
స్వాస్థ్యసుఖములిచ్చి, సత్వమొసగి.
మానకుండ యెపుడు బోనాలు జాతరల్
పర్వదినములందు నిర్వహించి,
క్రమము తప్పకుండ ఘనముగ సంబరాల్
చేయుచుండ గలము సిరుల నిండు.

భరతభూమిలోన నిరతంబు ధార్మిక
వర్తనంబు నిలిపి వసుధలోన
శాంతి నింపుచుండి సంతోషదీప్తుల
నందజేయవలయు నందరకును.

No comments:

Post a Comment